- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం: గత పాలకుల హయాంలో సాగు, తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడ్డారని, పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో తాగు, సాగునీటి కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఇరిగేషన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని వైష్ణవిగార్డెన్‌లో సాగునీటి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ…గత పాలకుల హయాంలో వెనుకబాటు తనానికి గురైన తెలంగాణ ప్రాంతంలో చెరువులు, కుంటలు అభివృద్ధికి నోచుకోక కరువు, కాటకాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, కుంటలు సాగునీటిలో జళకళను సంతరించుకున్నాయి.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువు, కుంటల్లో పేరుకుపోయిన పూడికను తీయటంతో పాటు చెరువులకు నీరందించే ప్రధాన కాల్వలను మరమ్మతు చేయటంతో కాల్వల ద్వారా పెద్ద ఎత్తున నీరు చెరువులకు చేరి నిండుకుండలను తలపిస్తున్నాయని అన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజల స్థితిగతులను శాసించే పెద్దచెరువు గత ౩౦ సంవత్సరాలుగా చుక్కనీరులేక మత్సకారులు, రైతులతో పాటు మరెంతో మంది కరువు, కాటకాలతో విలవిలలాడుతూ వలసలు వెళ్లారని, ప్రభుత్వ ప్రత్యేక చొరవతో మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ.16 కోట్లతో ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు నీరందించే ప్రధాన కాల్వలైన పెద్దవాగు, రాచకాల్వలను మరమ్మతు చేయించటం ద్వారా పెద్ద ఎత్తున వర్షపునీరు చేరి ముప్పైఏళ్ల తర్వాత పెద్దచెరువు అలుగు పారటం ద్వారా ఈ ప్రాంతంలోని మత్సకారులు, రైతులకు ఎంతో జీవనోపాధి లభించింది.
అలాగే, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రధాన చెరువులను మరమ్మతు చేయించటం ద్వారా నేడు పెద్ద ఎత్తున నీరు చేరి నిండుకుండలను తలపిస్తున్నాయని అన్నారు. ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు పుష్కలంగా నీరు చేరటం ద్వారా చుట్టుప్రక్కల గ్రామాల్లో సుమారు 20 కిలోమీటర్ల మేర భూగర్భజలాలు పుష్కలంగా పెరిగాయని తెలిపారు. ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు పెద్ద ఎత్తున నీరు చేరటం ద్వారా ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మార్చేందు కోసం ప్రభుత్వం నుంచి రూ.12 కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపామని, విడుదలైన వెంటనే టూరిజం హబ్‌గా నిర్మించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెరువులు, కుంటలకు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయస ంస్థ ఛైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎంపిపి కృపేష్, జడ్పిటిసి జంగమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, కౌన్సిలర్ సిద్దంకి కృష్ణారెడ్డి, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, రైతులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.