సైనిక బలగాల్లో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న 2.7 అభ్యర్థులను చేర్చేందుకు అగ్నిపథ్ పథకాన్ని తెచ్చారా అని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జెడిఎస్ నాయకుడు కుమార స్వామి సందేహం వ్యక్తం చేశారు.
బెంగళూరు: అగ్నిపథ్ పథకం బహుశా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) రహస్య ఎజెండా అయి ఉండవచ్చని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి సందేహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర కొత్త రిక్రూట్ మెంట్ పాలసీపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అడాల్ఫ్ హిట్లర్ కాలంలో నాజీ పార్టీ జర్మనీ సైన్యంపై పట్టు సాధించినట్లు నేడు మన దేశంలో ఆర్ఎస్ఎస్ కు చెందిన బిజెపి మన సైన్యంపై పట్టు సాధించాలనుకుంటోందన్నారు. అగ్నిపథ్ స్కీమ్ కు పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది అని ఆయన ఈ సదర్భంగా సందేహాన్ని లేవనెత్తారు. సైనిక బలగాల్లో 10 లక్షల మందిని తీసుకుంటామంటున్నారు. కానీ ఎవరిని తీసుకుంటారు? ఆర్ఎస్ఎస్ కొందరిని అందుకు తయారు చేసిందా? దీని వెనుక ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండా ఉందా అన్న సందేహాలను ఆయన వ్యక్తం చేశారు. ఇదంతా ఓ నాజీ రకం ఎజెండాలా కనపడుతోందన్నారు. కర్నాటకలో బిజెపి మైనారిటీ వర్గాన్ని లక్ష్యం చేసుకుంటోందని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.