Thursday, December 19, 2024

పాక్‌లో 62మంది మృతి.. ఆత్మాహుతి దాడి మా పనే: ఐఎస్

- Advertisement -
- Advertisement -

పెషావర్: వాయవ్య పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉన్న షియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా జరిగిన ఆత్మాహుతి దాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పేర్కొంది. ఈ దాడిలో 62 మంది చనిపోగా, దాదాపు 200 మంది గాయపడ్డారు. ఇదిలావుండగా ఈ ఆత్మాహుతి దాడి వెనుక ఉన్న అసలు వ్యక్తులను(మాస్టర్‌మైండ్స్) అరెస్టు చేస్తామని శనివారం పాకిస్థాన్ అంతరంగి మంత్రి షేఖ్ రషీద్ ప్రతిన చేశారు. పెషావర్‌లోని కిస్సా ఖ్వానీ బజార్‌లోని జామియా మసీదులో శుక్రవారం ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు.
‘గాయపడిన మరో ఐదుగురు ఆసుపత్రిలో మరణించడంతో మసీదు పేలుడు మృతుల సంఖ్య శనివారం 62కు చేరింది’ అని పెషావర్‌లోని లేడి రీడింగ్ హాస్పిటల్ ప్రతినిధి ముహమ్మద్ అసీమ్ తెలిపారు. ఇదిలావుండగా ఆత్మాహుతి దాడికి పాల్పడిన ముగ్గురు అనుమానితులను ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా పోలీసులు, దర్యాప్తు సంస్థలు గుర్తించాయని అంతరంగిక మంత్రి షేఖ్ రషీద్ అహ్మద్ తెలిపారు. పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఒకటి రెండు రోజుల్లో అనుమానితులను చేరుకుంటాయని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు. మసీదులో జరిగిన పేలుడు సుసైడ్ బ్లాస్ట్ అని పెషావర్ ఎస్‌ఎస్‌పి(ఆపరేషన్స్) హరూన్ రషీద్ ఖాన్ పేర్కొన్నారు. దాడికి పాల్పడింది ఇద్దరేనని, వారిలో ఒకరు ఆత్మాహుతి బాంబర్ అని ఆయన తెలిపారు. ఇదిలావుండగా పెషావర్ పేలుడును అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. కాగా ఖైబర్‌పఖ్తూన్‌ఖ్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ నేరస్థులను పట్టుకుని న్యాయం చేస్తామన్నారు.

IS Claims Responsibility for Mosque Blast in Pakistan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News