Friday, November 22, 2024

అత్యాచారాలకు దుస్తులు కారణమా?

- Advertisement -
- Advertisement -

Is clothing the cause of rapes?

ఆడవాళ్ళు రెచ్చగొట్టే దుస్తులు ధరిస్తున్నారు. అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయి. మృగాళ్ళ మాట. చిన్నారులనూ, వృద్ధులనూ వదలరు. అంగాలే ఎదగని పిల్లల గౌన్లు, ముడతల ఒంటిని కప్పిన కంపు కోకలు ‘మగతనాన్ని’ రెచ్చగొడతాయా? అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన అమెరికా కాన్సాస్ యూనివర్శిటీ విద్యార్థులు ఒక సృజనాత్మక పథకం పాటించారు. అత్యాచార సమయంలో స్త్రీలు ధరించిన బట్టలతో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ‘ఏ దుస్తులు ధరించావు?’ అన్న శీర్షికతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అత్యాచార బాధితుల ఘోర కన్నీటి గాథలను కథనీకరించారు. మగమత్తులో మనసు మూసుకుపోయినవారి కళ్ళు తెరిపించారు. మహిళల దుస్తులు లైంగిక దాడులను ప్రేరేపిస్తాయన్న ఆలోచనను పటాపంచలు చేశారు.

బ్రసెల్స్‌లో మానవ సేవల ఉద్యోగిని డ్ఫెన్ గూసెన్స్ తన, తన తోటి ఉద్యోగుల బట్టలను, తను పని చేసే బ్రసెల్స్ జిల్లా మోలెన్ బీక్ మారిటైమ్ కమ్యూనిటి సెంటర్‌లో కాన్సాస్ ప్రదర్శనను ప్రతిబింబించే ప్రదర్శనను 2018 జనవరి 8-20 మధ్య ఏర్పాటు చేశారు. ప్రదర్శనలోని 18 రకాల దుస్తుల్లో పైజామాలు, స్నానాల బట్టలు, ట్రాక్ సూట్లు, పాఠశాల యూనిఫాం, పోలీసు దుస్తులున్నాయి. విజాతి, ఆకర్షణలేని స్వజాతి మగదుస్తులే ఎక్కువ. వీటిని చూసిన తర్వాతనైనా హింసకు, అత్యాచారాలకు గురైనవారి పట్ల ప్రజల మనస్తత్వం మారుతుందని ఆశిస్తానని, బట్టల ప్రభావమేమీలేదని, అత్యాచారం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా జరగవచ్చని నిర్ధారణ అయిందని ప్రదర్శన తిలకించిన స్త్రీ లీస్బెత్ వర్బోవెన్ అన్నారు. అత్యాచార సంస్కృతిపై పురుష సమాజంలో వ్యాపించిన అవాస్తవ ఊహాగాథలకు ప్రతిస్పందనగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశానని గూసెన్స్ చెప్పారు. ఆడపిల్లలకు జాగ్రత్తగా బట్టలేసుకొమ్మని చెపుతాం.

మగ పిల్లలకు మర్యాదగా మసలుకోమని బోధించం. ఏ బట్టలూ అత్యాచారాలను ఆపవనీ, మహిళలు (మగ వారిలా) ఇష్టమొచ్చిన దుస్తులు ధరించవచ్చని, తమ దుర్మార్గాలకు మృగవారు బట్టల సాకు చూపవద్దని ఆమె వ్యాఖ్యానించారు. ఇవన్నీ మహిళలందరూ వేసుకునే సాధారణ దుస్తులు. అయినా లైంగిక దాడులు ఆగలేదు. ఇది మా తప్పా అని అత్యాచారాలకు గురైన అమాయక స్త్రీలు బాధతో ప్రశ్నిస్తున్నారు. ‘చిన్ని గౌను కూడా అత్యాచారాన్ని ప్రేరేపించిందా?’ బాధితుల సహాయ సామాజిక సేవా సంస్థ ‘సిఎడబ్ల్యు’ సభ్యురాలు లీస్బెత్ కెన్స్ ప్రశ్న. ఇది మగ సమాజం. స్త్రీలు, పిల్లలు కూడా మగ ప్రభావాల్లో కొట్టుకుపోతున్నారు. ఆడ పిల్లలు రెచ్చగొట్టే బట్టలేసుకుంటారని, సరసాలాడుతారని, పొద్దుపోయి ఇళ్ళకు చేరుకుంటారని నిందిస్తారు. అత్యాచారాలకు, వేధింపులకు ఒకే ఒక వ్యక్తి బాధ్యుడు. అతనే వాటిని ఆపగలడు. అతనే నేరస్థుడు అని ఆమె వాపోయారు.

మానభంగాలు ప్రపంచ వ్యాపిత సార్వజనిక సమస్య. మానవాళిపై మాయని మచ్చ. 2015లో యూరోపియన్ యూనియన్‌లో 2.15 లక్షల లైంగిక హింసలు నమోదయ్యాయి. అందులో 72 వేలు అత్యాచారాలు. బెల్జియన్ స్త్రీలల్లో 56% మంది లైంగిక హింసకు 25% బహిరంగ ప్రదేశాలు భౌతిక వేధింపులకు గురయ్యారు. బెల్జియంలో 10% అత్యాచారాలే పోలీసులకు నివేదించబడతాయి. అందులో 10% నిందితులే (అంటే నూటికొక్కరే) శిక్షించబడతారు. బాధితుల చేదు అనుభవాల వ్యక్తీకరణను సమాజం నిరుత్సాహపరుస్తుంది. జపాన్‌లో నిశ్శబ్ద సంస్కృతి వ్యాపించింది. అత్యాచారాలకు గురైన స్త్రీలెవరూ ఫిర్యాదు చేయరు. చేసినా నేరస్థున్ని నిర్బంధించరు, శిక్షించరు. మానభంగానికి గురైనవారిలో 70% మిత్రులకు, కుటుంబ సభ్యులకు, సమీప ఆప్తులకు చెప్పుకోలేకపోయామన్నారు. 4% కంటే తక్కువ మంది పోలీసుల దగ్గరికెళ్ళారు. జపాన్ మహిళలు తమపై జరిగిన అత్యాచారాలకు తమనే నిందించుకుంటారు, తామే తప్పుచేశామనుకుంటారని ఓచనోమిజు విశ్వవిద్యాలయ లింగాంశాల అధ్యయన గౌరవాచార్యులు తామీ కైనో బాధపడ్డారు.

మాధ్యమాల అభ్యాసిని 28 ఏండ్ల షియోరి ఇటొపై పాత్రికేయుడు, 51 సంవత్సరాల్ నోరియుకి యమగుచి అత్యాచారం చేశాడు. ఇటొ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యమగుచి టోక్యో ప్రసార వ్యవస్థకు వాషింగ్టన్ బ్యూరో చీఫ్. జపాన్ ప్రధాని షింజో అబే జీవిత చరిత్ర రాశారు. విచారణ, దర్యాప్తు అధికారులు యమగుచిపై కేసు ఎత్తేశారు. 2017 డిసెంబర్‌లో యొకొహామాలో ఆరుగురు విశ్వవిద్యాలయ విద్యార్థులు సహ విద్యార్థినిని బలవంతం గా మద్యం తాపి సామూహిక అత్యాచారం చేశారు. విచారణాధికారులు కేసు వదిలేశారు. జపాన్‌లో అత్యాచారుల దోష నిర్ధారణ జరిగినా శిక్షలు పడవు. నేరస్థులు జైలుకు పోరు. 2018 జనవరిలో టోక్యో దగ్గరి చిబా విశ్వవిద్యాలయంలో ఇద్దరు విద్యార్థులు తోటి విద్యార్థినిని మద్యం తాపి అత్యాచారం చేశారు. టోక్యో యూనివర్శిటీలో ఇంకొక విద్యార్థి సహ విద్యార్థినిని మానభంగం చేశాడు. వీరి నేరాలు రుజువైనా శిక్షలు రద్దయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌లో స్త్రీలపై అత్యాచారాలు పెరిగాయని పూర్వప్రధాని షింజో అబే అన్నారు. 2014లో జపాన్‌లో 15 మందిలో ఒక మహిళ, అమెరికాలో 5 మందిలో ఒకరు అత్యాచారానికి గురయ్యామని ఫిర్యాదు చేసినట్లు ప్రభుత్వ సర్వేల్లో తేలింది. అమెరికాలో 33% స్త్రీలే తమపై జరిగిన అత్యాచారాలను పోలీసులకు తెలిపారు.

మా దేశంలో లైంగిక దాడులు తులనాత్మకంగా తక్కువని జపాన్ ప్రభుత్వం గొప్పలుపోతుంది. దక్షిణ నైజీరియాలో ఒక దరిద్ర ఆచారముంది. భర్త చనిపోతే భార్యను శుద్ధి చేస్తారు. అందుకు భర్త శవంలో శరీర భాగాలను కడిగిన నీటిని భార్య తాగాలి. తర్వాత 7 రోజులు తిండి లేకుండా ఒక గదిలో బంధిస్తారు. ఆమె బతికితే అతని చావుకు ఆమె కారణం కాదని, మరణిస్తే భర్త అదృశ్య శక్తులు ఆమెను చంపేశాయని నిర్ణయిస్తారు. ఆడువారు అత్యాచారాలకు లోనయినప్పుడు మన రాజకీయులు, చట్ట నిర్మాతలు, మనువాదులు, మతాధిపతులు బుద్ధి లేకుండా మాట్లాడుతుంటారు. నిర్భయ అఘాయిత్య సందర్భంలో హిందు గురు ఆశారాం బాపు (అత్యాచారం కేసులో జైలు కెళ్ళాడు), సంఘ్ ప్రముఖుడు మోహన్ భాగవత్, మధ్యప్రదేశ్ బిజెపి మంత్రి కైలాస్ విజయవర్గీయ, మహిళా శాస్త్రవేత్త డా.అనితా శుక్లా, బి.ఎస్.పి. ఎం.పి. షఫీక్ రహ్మాన్ బర్ఖ్, తృణమూల్ ఎం.పి కాకోలి ఘోశ్ దస్తీదార్, జమాత్ ఇస్లాం మతసంస్థ పెద్దలు అమానవీయంగా వ్యాఖ్యానించారు. ‘భర్తలు, తండ్రులు లేకుండా సూర్యాస్తమయం తర్వాత బయటికిపోయే స్త్రీలు గౌరవార్హులు కారు. పెట్రోలు మంటకు కారణమవుతుంది. చక్కెర చీమలను ఆకర్షిస్తుంది’ అని సమాజ్ వాది పార్టీ నేత అబు అజ్మీ సూత్రీకరించారు. 2014లో మహారాష్ట్ర మహిళా హక్కుల సంఘం సభ్యురాలు, రాజకీయురాలు ఆశా మిర్గే అత్యాచారాలకు ఆడువారి బట్టలే కారణమని నిందించారు. నిర్భయ రాత్రి సినిమా కెందుకెళ్ళాలి? ముంబయి శక్తిమిల్స్ సామూహిక అత్యాచారానికి గురైన మహిళ అక్కడికెందుకెళ్ళింది? అని ప్రశ్నిస్తూ ఆడువారి బట్టలు, ప్రవర్తన, వారు తగని స్థలాలకు పోవడమే అత్యాచారాలకు కారణమని తీర్మానించారు.

‘ఆడు వారిని లైంగిక దృష్టితోనే చూడరాదు. మానవులుగా పరిగణించాలి. వారు శారీరక వాంఛలు తీర్చే వస్తువులు కాదు. మగాళ్ళ చేతి కీలుబొమ్మలు కాదు’ సంప్రదాయ ముస్లిం దేశం నైజీరియా రచయిత అబూబకర్ ఆదాం ఇబ్రహీం అన్నారు. ‘మానభంగాలకు స్త్రీల దుస్తులే కారణమని చాలా కాలంగా సాకు చెపుతున్నారు. ఇది తమ నియంత్రణాశూన్యతను, పశుశక్తి ప్రయోగాన్ని కప్పిపుచ్చుకోడానికి నేరస్థులు చేసే నింద. బాధ్యతను బాధితులపై నెట్టే బాధ్యతారాహిత్యం’ అని మానసిక శాస్త్రజ్ఞులు, మానభంగాల, లైంగిక వేధింపుల అధ్యయన నిపుణులు సంద్ర శుల్మన్ విశదీకరించారు. అత్యాచార మగాళ్ళు రొమ్ములిరుసుకొని తిరుగుతారు. దాడులకు గురైన స్త్రీలు, వారి పిల్లలు, కుటుంబ సభ్యులు శారీరక, సామాజిక సమస్యలకు, బాధలకు గురవుతారు. మగాళ్ళు స్త్రీల అణచివేతలో చూపే తెలివితేటలు వనితా వికాసానికి ఉపయోగిస్తే ప్రపంచం పురోగమించేది. ఆడువారి బట్టలు వాంఛను రెచ్చగొట్టవు. వనితా వలువలు కాదు మగ మనసులు మారాలి. అమ్మా, చెల్లీ ఆడువారేనని, స్త్రీలు సమాజ నిర్మాతలని, తోటి మానవులని గుర్తించాలి.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి- 9490204545
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News