ఓస్లో: నోబెల్ శాంతి బహుమతి ఎవరికనేది ప్రకటించడానికి ఇంకా కేవలం మూడు వారాలే ఉంది. అయితే చాలా మంది ఈసారి నోబెల్ శాంతి బహుమతి వాతావరణ ఉద్యమ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌కు దక్కుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. ముఖ్యంగా ఆమె అభిమానులు. అయితే అక్టోబర్ 8న విజేత ఎవరో ప్రకటించబడుతుంది. ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి ప్రతీసారి ఆశ్చర్యకరంగానే ఊహించని వ్యక్తికి లభిస్తూ వస్తోంది. సాధారణంగా ఈ బహుమతికి తగిన వ్యక్తిని ఐదుగురు కమిటీ మెంబర్లు ఎంపికచేస్తారు.
గ్లోబల్ వార్మింగ్‌పై కాప్26 వాతావరణ సమావేశంను నవంబర్‌లో స్కాట్‌ల్యాండ్‌లో నిర్వహించనున్నారు. వచ్చే దశాబ్దం కల్లా గ్రీన్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించుకునేందుకు ఈ సమావేశమే చివరి అవకాశం అని శాస్త్రజ్ఞులు అంటున్నారు. వాతావరణ ఉపద్రవాన్ని నివారించాలంటే ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీ సెల్సియస్ లక్షం కంటే కిందికి ప్రపంచం తగ్గించాలంటున్నారు. ఈ నేపథ్యంలో స్వీడన్ వాతావరణ కార్యకర్త థన్‌బర్గ్(18)కి నోబెల్ శాంతి బహుమతి ఈసారి దక్కుతుందన్న ఆశాభావంతో చాలా మంది ఉన్నారు. అయితే జాబితాలో థన్‌బర్గ్ మాత్రమేకాక నవల్‌నీ, త్సిఖనౌస్‌కయ, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి వారు ఉన్నారు. దాదాపు 329 నామినీల పేర్లు జాబితాలో ఉన్నాయి.