Friday, November 22, 2024

రాహుల్ నాయకత్వం ప్రశ్నార్థకం?

- Advertisement -
- Advertisement -

Is Rahul's leadership questionable?

విధానపర అంశాలపై, పాలనపర వైఫల్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నిత్యం నిలదీసే నేతగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఆయన నాయకత్వం పట్ల ఓటర్లకు మాత్రమే కాకుండా, ఆయన పార్టీ నేతలకు కూడా విశ్వాసం కలగడం లేదు. అందుకనే 2019 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆయన ఇప్పటి వరకు ఆ పదవిలో మరెవ్వరిని ఉంచలేకపోవడం ఆయనలోని అభద్రతా భావాన్ని వెల్లడి చేస్తున్నది. ప్రస్తుతం సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నా, తెరవెనుక అసలు అధికారాన్ని రాహుల్ చెలాయిస్తున్నారు. పార్టీలో ఇటువంటి ఏర్పాటు పట్ల గత ఏడాది 23 మంది సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సంస్థాగత సంస్కరణలు అవసరం అని నేరుగా సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆ లేఖ పార్టీలో కలకలం రేపినా, ఇప్పటి వరకు స్పందించే ధైర్యం పార్టీ నాయకత్వం చేయడం లేదు.

మరోవంక, రాహుల్ గాంధీకి సన్నిహితులైన నాయకులు పలువురు పార్టీలో తమకు తగు ప్రాధాన్యత లేదని, క్రమక్రమంగా పార్టీని విడవడం ప్రారంభించారు. ఏడాది క్రితం మధ్యప్రదేశ్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా తనకు మద్దతుగా ఉన్న 22 మంది ఎంఎల్‌ఎలతో కలిసి బిజెపిలో చేరడమే కాకుండా, అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. కర్ణాటకలో కూడా దాదాపు ఆ విధంగానే జరగడంతో అక్కడ కూడా కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో సచిన్ పైలట్ ఆ విధమైన తిరుగుబాటు చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం పడగొట్టడం కోసం బిజెపితో చేతులు కలపడానికి సిద్ధపడ్డారు.

అయితే అందుకు అవసరమైన ఎంఎల్‌ఎలను సమీకరింపలేక పోవడంతో పార్టీ అధిష్ఠానంతో రాజీపడవలసి వచ్చింది. ఫలితంగా ఉపముఖ్యమంత్రి పదవితో పాటు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. సింధియా, పైలట్ – ఇద్దరూ రాహుల్ గాంధీకి చాలా సన్నిహితలు కావడం గమనార్హం. ఇప్పుడు తాజాగా జితిన్ ప్రసాద బిజెపిలో చేరడం రాహుల్ గాంధీ నాయకత్వం సామర్థ్యంపై నీలినీడలు ప్రసరింప చేస్తున్నాయి. సింధియా, పైలట్ లవలే ఆయన ప్రజలలో మద్దతు గల నాయకుడు కాకపోవడంతో బిజెపికి ఆయన వల్లన పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేకపోయినా, రాహుల్ నాయకత్వంకు పెద్ద సవాల్ విసిరిన్నట్లు అవుతుంది.

జితిన్ ప్రసాద బిజెపిలో చేరడానికి జాతీయ మీడియా విశేష ప్రాధాన్యత ఇస్తున్నది. యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉత్తరప్రదేశ్ లో కీలకమైన బ్రాహ్మణ సామాజిక వర్గం బిజెపికి దూరం అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉండడంతో, వారిని ఆకట్టుకోవడానికి ఉపయోగ పడగలరని బిజెపి కేంద్ర నాయకత్వం ఆశిస్తున్నది. అయితే ఆయనకు ఆ సామర్ధ్యం లేదని తెలుసుకొనే, ఆయనను పక్కనపెట్టి ప్రియాంక గాంధీకి ఉత్తరప్రదేశ్ బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన అలిగి బిజెపిలో చేరడానికి సిద్ధపడంతో పశ్చిమ బెంగాల్ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు ఇచ్చారు. కానీ ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయన సారథ్యంలో చరిత్రలో మొదటిసారిగా ఒక్క సీట్ కూడా గెల్చుకోలేక చతికలపడింది.

వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికలలో ఆయనపై గెలుపొందిన బిజెపి నేత రేఖ శర్మతో పాటు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ లకే రాష్ట్రంలోని బ్రాహ్మణులలో జితిన్ కన్నా ఎక్కువ పలుకుబడి ఉన్నదని చెప్పవచ్చు. బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకోవడానికి తనకు నమ్మకస్థుడైన, గుజరాత్ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ శర్మను ఐదు నెలల క్రితం బిజెపిలో చేర్చి, యుపి నుండి ఎంఎల్‌సిగా ప్రధాని నరేంద్ర మోడీ చేశారు.

అంతేకాదు, ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా చేసి, ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా చేయాలని కూడా తలపెట్టారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన పేరులో ‘శర్మ’ అని ఉన్నప్పటికీ ఆయన బ్రాహ్మణ కాదని, భూమియర్ అని తేల్చి చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. అప్పుడు జితిన్ ప్రసాద వైపు దృష్టి సారించారు.
రాహుల్ గాంధీ నిత్యం చేస్తున్న ఘాటైన విమర్శలు మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టివేయడానికి, పొరపాట్లు సరిదిద్దుకోవడానికి దోహదపడుతున్నా ప్రజలలో ఒక సమర్ధుడైన నాయకుడిగా ఆయనకు గుర్తింపు పొందలేకపోతున్నారు. ఆయన ప్రతిష్ఠగా తీసుకొని ప్రచారం చేస్తున్న ఎన్నికలలో ఎక్కడ కూడా కాంగ్రెస్ చెప్పుకోదగిన విజయాలు సాధింపలేకపోతున్నది. ఎక్కడైతే రాష్ట్రాలలో బలమైన నాయకులు ఉన్నారో, రాహుల్ గాంధీకి సన్నిహితులైన వారిని పక్కనపెట్టి నిలబడగలుగుతున్నారో, అక్కడే కాంగ్రెస్ చెప్పుకోదగిన విజయాలు సాధిస్తున్నది. పంజాబ్‌లో కెప్టెన్ అమరిందర్ సింగ్ రాహుల్‌ను లెక్కచేయకుండానే ముఖ్యమంత్రి కాగలిగారు. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ అదే విధంగా తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకో గలుగుతున్నారు.

మహారాష్ట్రలో సహితం ఎన్‌సిపి అధినేత శరద్ పవర్ ప్రోద్బలంతో రాహుల్ గాంధీ అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్యెల్యేలు శివసేనతో చేతులు కలిపి, బిజెపి ప్రభుత్వాన్ని పడగొట్టి, అక్కడ సంకీర్ణ ప్రభుత్వంలో చేరడం గమనార్హం. యువతకు అవకాశం ఇవ్వడం కోసం రాహుల్ గాంధీ జోక్యం చేసుకొని సీనియర్లను పక్కని పెట్టడంతో కేరళ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ చావుదెబ్బకు గురికావలసి వచ్చింది. గత ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఇచ్చిన 40 సీట్లలో చాలావరకు ఓటమి చెందడంతోనే తాము అధికారంలోకి రాలేకపోయామని తమిళనాడులో డిఎంకే తేల్చి చెప్పింది. ఈ సారి 25 సీట్లకు మించి ఇవ్వలేమంటే, అందుకు సర్దుకోక తప్పలేదు. దాదాపు అన్ని రాష్ట్రాలలో రాహుల్ గాంధీకి సన్నిహితులుగా పేరొందిన నేతలు కాంగ్రెస్‌కు భారంగా తయారయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ తమ కుటుంబం నుండి కాకుండా, ఎన్నిక ద్వారా మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని రాహుల్ పట్టుబట్టారు. ఆ విధంగా చేసి ఉంటె ప్రజలలో రాహుల్ పట్ల కొంత విశ్వాసం పెరగడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ సహితం తిరిగి కొంతమేరకు జవసత్వాలు పుంజుకోవడానికి అవకాశం యేర్పడెడిది.

అయితే తమ కుటుంబం పట్టు చేజారిపోతే, తిరిగి తమకు రాజకీయ మనుగడ కష్టమనే ఆందోళన ఒక నాయకుడిగా రాహుల్ గాంధీని బలహీనం చేస్తున్నట్లు చెప్పవచ్చు. పైగా రాహుల్ గాంధీ ప్రోత్సహిస్తున్న నాయకులలో చాలామంది రాజకీయ కుటుంబాల నుండి వచ్చిన వారే తప్పా, ప్రజల మద్దతు ద్వారా వచ్చిన వారు కాదు. అందుకనే అధికారం లేకుండా వారు మనుగడ సాగింపలేక పోతున్నారు. గత నెల మొదట్లో వచ్చిన ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వాటిల్లో పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, గుజరాత్‌లో గత ఎన్నికలలో కాంగ్రెస్ బిజెపికి గట్టి పోటీ ఇచ్చింది. ఈ రాష్ట్రాలలో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ చెప్పుకోదగిన ఫలితాలు సాధింపలేని పక్షంలో 2024 లోక్‌సభ ఎన్నికలలో సహితం ఆ పార్టీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయం కాగలదు. ఈ సవాళ్ళను ఎదుర్కొనే విధంగా కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రయత్నాలు గాని, ధీటైన ఎన్నికల వ్యూహాలను రూపొందించే సన్నాహాలు గాని ఎక్కడా కనిపించడం లేదు.

ఒక విధంగా పశ్చిమ బెంగాల్ లో బిజెపి నాయకత్వం చేసిన పొరపాటునే, రాహుల్ గాంధీ చేస్తున్నారని చెప్పవచ్చు. టిఎంసి పాలనా వైఫల్యాలను, అధికారంలోకి వస్తే తాము అందించగల పాలన గురించి ప్రచారం చేయకుండా, ప్రధాని నుండి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వ్యక్తిగత విమర్శలు చేశారు. దానితో ‘బయటి వారంతా వచ్చి బెంగాల్ ఆడబిడ్డపై దాడి చేస్తున్నారు’ అంటూ ఆమె ఓటర్ల సానుభూతి పొందగలిగారు. అదే విధంగా, కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రస్తావిచడం కాకుండా ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత దాడులకు రాహుల్ ఎక్కువగా దిగుతున్నారు. దానితో రాజకీయంగా రాహుల్ సొంత పార్టీలో కూడా ఏకాకిగా మిగులుతున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు కాంగ్రెస్ భవిష్యత్‌కు మాత్రమే కాకుండా, రాహుల్ గాంధీ రాజకీయ మనుగడకే పెను సవాల్‌గా పరిణమించనున్నాయి. ఈ సవాళ్ళను స్వీకరించే సామర్ధ్యం ఆయనలో ఏ మేరకు ఉన్నాయో కాలమే తేల్చి చెప్పగలదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News