Thursday, January 23, 2025

మళ్లీ బొగ్గు సంక్షోభం!

- Advertisement -
- Advertisement -

Is there another power crisis in the country?

థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద తక్కువగా ఉన్న బొగ్గు నిల్వలు
వర్షాలు మొదలైతే బొగ్గు ఉత్పత్తి, రవాణాకు ఆటంకాలు
జులైఆగస్టు నెలల్లో మరోసారి సంక్షోభం ఎదురయ్యే అవకాశం
సిఆర్‌ఇఒ తాజా నివేదిక హెచ్చరిక

న్యూఢిల్లీ: రుతుపవనాలు రావడానికి ముందు దేశంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు తక్కువగా ఉండడం జులైఆగస్టు నెలల్లో మరో విద్యుత్ సంక్షోభానికి మరో సంకేతం కావచ్చని స్వతంత్ర పరిశోధనా సంస్థ పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నిటివద్ద కలిపి కేవలం 20.7 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి.‘విద్యుత్ డిమాండ్ స్వల్పంగా పెరిగినా దాన్ని తట్టుకునే స్థితిలో దేశంలోని బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలు లేవని అధికార వర్గాలద్వారా సేకరించిన గణాంకాలన బట్టి అర్థమవుతోందని, అందువల్ల చాలా ముందుగానే బొగ్గు రవాణాకు ప్రణాళికలను రూపొందించుకోవలసిన అవసరం ఉందని ‘సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్’( సిఆర్‌ఇఎ) అనే సంస్థ దేశంలో విద్యుత్ సంక్షోభం, బొగ్గు నిర్వహణ సంక్షోభంపై రూపొందించిన తాజా నివేదిక అభిప్రాయపడింది. ఆగస్టు నెలలో విద్యుత్ పీక్ డిమాండ్ 214 గిగావాట్లుగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ ఇండియా(సిఇఒ) అంచనా వేసింది. దీనికి తోడు సగటు విద్యుత్ డిమాండ్ మే నెలలో ఉన్న 1.33,426 మిలియన్ యూనిట్లకన్నా పెరిగే అవకాశం ఉంది.రుతుపవనాల రాక కారణంగా బొగ్గు గనుల్లో తవ్వకం, గనులనుంచి విద్యుత్ స్టేషన్లకు బొగ్గు రవాణాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

రుతుపవనాలకు ముందే బొగ్గు నిల్వలను తగిన స్థాయికి పెంచుకోని పక్షంలో జులైఆగస్టు నెలల్లో దేశం మరో విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది’ అని ఆ సంస్థ పేర్కొంది. ఇటీవల ఎదురైన విద్యుత్ సంక్షోభానికి కారణం బొగ్గు ఉత్పత్తి కాదని, దాని పంపిణీ, అధికారుల ఉదాసీనతే కారణమని కూడా ఆసంస్థ తెలిపింది. ‘విద్యుత్ రంగంనుంచి పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టుగా బొగ్గు రవాణా, నిర్వహణ తగినంత లేదని ప్రభుత్వ గణాంకాలను బట్టి స్పష్టమవుతుంది. బొగ్గు ఉత్పత్తి తగినంతగా ఉన్నప్పటికీ థర్మల్ స్టేషన్లలో తగినన్ని బొగ్గు నిల్వలు ఉంచలేదని కూడా దీన్ని బట్టి అర్థమవుతోందని ఆ నివేదిక తెలిపింది. దేశంలో 2021 ఆర్థిక సంవత్సరంలో 716.08 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా, 2022 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 777.26 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. అంతకు ముందు ఏడాదికన్నా ఇది 8.54 శాతం ఎక్కువ.

అయితే దేశంలో 1500 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థం ఉండగా ఉత్పత్తి అందులో సగం మాత్రమే ఉండడం గమనార్హం. అందువల్ల నిజంగా బొగ్గు కొరత ఏర్పడితే బొగ్గు కంపెనీలు ఉత్పత్తి పెంచుకునే వీలు ఉందని సిఆర్‌ఇఎలో విశ్లేషకుడు సునీల్ దహియా అంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి ఈ మధ్యనే మొదలు కాలేదని, 2020 మేనుంచి కూడా థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వలు తగ్గుతూ వస్తున్నాయని ఆయన అన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే విద్యుత్ ప్లాంట్ నిర్వాహకులు తగినంత బొగ్గు నిల్వలు ఉంచుకోవడం ఎంతయినా అవసరమని, ఎందుకంటే వర్షాకాలంలో గనుల్లో వరద నీరు చేరి బొగ్గు తవ్వకానికి, రవాణాకు అంతరాయం ఏర్పడుతూ ఉంటుందని ఆ నివేదిక హెచ్చరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News