Friday, December 20, 2024

యుసిసి ఆచరణ సాధ్యమేనా?

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి పౌరస్మృతి’ అనే అంశం చాలా కాలంగా (1950 నుండి) భారత రాజకీయ సమాజంలో వివాదాస్పద చర్చనీయ అంశంగా వుంది. అందుకే దీన్ని రాజ్యాంగ 3వ అధ్యాయం అయిన ప్రాథమిక హక్కులలో కాకుండా 4వ అధ్యాయం ఆదేశిక సూత్రాలలో చేర్చారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 27వ తేదీన భోపాల్ సభలో చేసిన ప్రకటన ఉమ్మడి పౌర సంస్మృతి అంశాన్ని మరొకసారి చర్చనీయాంశమైంది. తాజా పరిణామ క్రమంలో కేంద్ర ప్రభుత్వం బహుశా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.లోక్‌సభలో సంపూర్ణ మెజార్టీ వుంది కనుక ప్రభుత్వం ముందుకు వెళుతుంది. రాజ్యసభలో కూడా కొన్ని పార్టీలు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో బిల్లు పాస్ కావడం పెద్ద కష్టం కాకపోవచ్చు. లా కమిషన్ సూచనల మేరకు విపక్షాలు తమ అభిప్రాయాలను వెల్లడించడం ప్రారంభించాయి. దేశంలో మైనారిటీ వర్గాలను కూడా పరిగణనలోకి తీసుకొని, వారికున్న కొన్ని అపనమ్మకాలు, అపోహలు తొలగిస్తే ఈ బిల్లు ఏ కాభిప్రాయంతో చట్టంగా వచ్చే అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా సానుకూలతను ప్రకటించారు. డిఎంకె, బిఆర్‌యస్ వంటి ఇతర పార్టీలు మాత్రం ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో పరిష్కరించవలసిన విద్య, ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి వంటి అనేక సాంఘిక, ఆర్ధిక సమస్యలు ఉండగా వాటిని వదిలేసి ఉమ్మడి పౌరస్మృతి విషయాన్ని ఇప్పుడు అత్యవసరంగా తెరపైకి తేవడం బిజెపి విభజన రాజకీయాల వ్యూహంతోనే. రాబోయే లోక్‌సభ ఎన్నికను గెలవడానికి, హిందూ ఓటర్లను ఐక్యం చేయడానికి ఈ అంశాన్ని లేవనెత్తింది అన్న అభిప్రాయాన్ని ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి. దేశంలోని పౌరులందరికీ క్రిమినల్ లా వర్తించినట్లుగానే, కుల, మత, లింగ తదితర వివక్ష లేకుండా అందరికీ ఒకే చట్టం ఉండాలి అన్నది ఉమ్మడి పౌర స్మృతి లక్ష్యం. ఈ విషయంలో ఈ నెల 23న లా కమిషన్ తాజా సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది.

2018 ఆగస్టు తర్వాత ఐదేళ్ల విరామం అనంతరం ఇప్పుడు మళ్లీ ఈ అంశంలో చలనం వచ్చింది. అప్పట్లో 21వ లా కమిషన్ అభిప్రాయాలు కోరగా, ఇప్పుడు 22వ లా కమిషన్ ప్రక్రియ ప్రారంభించింది. భారత రాజ్యాంగంలోని 44వ అధికరణలోని 4వ చాప్టర్‌లో ఉమ్మడి పౌరస్కృతి అంశం గురించి స్పష్టంగా పేర్కొంది. దేశంలోని ప్రజలంతా ఒకే పౌర స్మృతిని కలిగి ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని ఆ అధికరణం చెబుతుంది. ఉమ్మడి పౌరసత్వ చట్టం తెస్తామనీ 1998 ఎన్నికల్లో బిజెపి ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాన్ని గురించి ప్రజలకు వాగ్దానం చేసింది. దానికి అనుగుణంగా 2019 నవంబర్ నెలలో ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆనాడు ప్రతిపక్షాలు నిరసన తెలియజేయడంతో ఆ బిల్లును ప్రభుత్వం తాత్కాలికంగా ఉపసంహరించుకుంది.

వివాహం, విడాకులు, దత్తత, వారసత్వాలకు సంబంధించి దేశంలో పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలని సుప్రీంకోర్టులో కొన్ని వర్గాలు పిటిషన్ దాఖలు చేశాయి.దేశంలో వివిధ కుటుంబ సంప్రదాయాలు, మత విశ్వాసాలు, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు మహిళల పట్ల వివక్ష చూపుతున్నాయని, వాటిని వెంటనే సరిదిద్దాలని, అలాంటి అవసరం ఉందని 2018లో సంప్రదింపుల పత్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలకు పర్సనల్ లా, మరికొన్ని మైనార్టీలకు వేరే చట్టాలు అమలులో ఉన్నాయి. సిక్కుల వివాహాలు ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ 199 ప్రకారం జరుగుతాయి. అయితే అందులో విడాకుల అంశం గురించిన ప్రస్తావన లేదు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర భారత దేశంలో ఉన్నత, మధ్య తరగతి కులాలలో అన్న భార్య (వదిన) ను తల్లిలా గౌరవిస్తాము. కానీ పంజాబ్‌లో, తెలుగు రాష్ట్రాలలో కొన్ని బిసి కులాలలో, ట్రైబల్ తరగతుల్లో అన్న మరణిస్తే తమ్ముడు ఆమెను రెండవ వివాహం చేసుకొనే ఆచారం ఉంది. అన్న సంతానం తన సంతానంగా పరిగణించబడుతుంది. వ్యవసాయ భూమి, ఇతర ఆస్తులు పరిరక్షించుకోవటానికి, వదిన మరో వ్యక్తితో వివాహం జరగకుండా కుటుంబ ఐక్యత కోసం, పిల్లలను మరో వ్యక్తిని చేసుకుంటే సరిగ్గా చూడరని భావించి అన్న పిల్లలకు కన్న తండ్రి వలే బాబాయే సంరక్షణ, పోషణ చేసే ఆచారం ఉంది. ఇవి సంస్కృతిక పరమైన, ఉమ్మడి ఆస్తుల రక్షణ కోసం రక్త సంబంధాల వివాహాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ మధ్య శాస్త్రీయ పరిశోధనా ఫలితంగా ‘రక్త సంబంధ మేనరిక’ వివాహాలు చాలా వరకు అన్ని కులాలలో తగ్గిపోయాయి. అందువల్ల సిక్కులు ఇప్పటికీ హిందూ వివాహ చట్టాన్నే అనుసరిస్తున్నారు. అలాగే పార్శీల కుటుంబాల్లో దత్తత హక్కుల అంశాలను జొరాస్టియన్ విధానాలను అనుసరిస్తున్నారు. దత్తత చట్టాల మార్పునకు పార్శీలు అంగీకరించడం లేదు. ఇక ముస్లిం స్త్రీలకు అన్యాయం జరుగుతుందని, వారికి హక్కులు కల్పించాలని సుప్రీంకోర్టులో అనేక పిటిషన్ దాఖలు అయ్యాయి. మొత్తం మీద ఉమ్మడి పౌర స్మృతి అంశం చాలా సంకిష్టమైనది. విభిన్న మతాలు, వర్గాలు, జాతుల వైవిధ్యం ఉన్న మన దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని ప్రజలలో విస్తృత చర్చ చేసి దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, ఏకాభిప్రాయంతో సాధిస్తే బిల్లు లక్ష్యం, ఆచరణ కూడా సులువు అవుతుంది. 1985లో షాబానో కేసు విషయంలో సుప్రీంకోర్టు ముస్లిం మహిళల విడాకుల హక్కులకు సంబంధించి ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ప్రతిపాదనను పరిశీలించాలని కోరింది. చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రాన్ని జాతీయ సామరస్యాన్ని సాధించేందుకు పార్లమెంటు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. 2015లో ఎబిసి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ కేసులో క్రైస్తవ మహిళలు క్రైస్తవ చట్టాలు ప్రకారం తమ పిల్లలకు సహజంగా సంరక్షకులు కారనీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే హిందూ వివాహిత మహిళలు తమ పిల్లలకు సహజంగా సంరక్షకులుగా అవుతారని పేర్కొంది. ఉమ్మడి పౌర స్మృతిని రాజ్యాంగబద్ధంగా పరిశీలించకుండా వదిలేసారని సుప్రీంకోర్టు కామెంటు చేసింది. అలాగే 2020లో సుప్రీంకోర్టు లింగ సమానత్వం కోసం హిందూ వారసత్వ చట్ట ప్రకారం పూర్వీకుల ఆస్తిలో మహిళలకు సమాన హక్కులు ఉన్నాయని స్పష్టంగా పేర్కొంది.అయితే 2005లో హిందూ వారసత్వ చట్టాన్ని సవరించే నాటికి మహిళలు జీవించి ఉంటేనే అది వర్తిస్తుంది అని స్పష్టం చేసింది.
2021లో దేశంలో ప్రజలకు విభిన్న వివాహ చట్టాలు అడ్డంకులు లేకుండా ఉమ్మడి కుటుంబ చట్టాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ఉమ్మడి పౌర స్మృతి ఉంటే అది విభిన్న ప్రజల మధ్య కుల, మత, జాతి, లింగ వివక్ష లేకుండా జాతీయ సమైక్యతకు తోడ్పడుతుందని కూడాపేర్కొంది. మతం మార్పిడి, మత స్వేచ్ఛ, వివాహానికి సంబంధించి, వారసత్వ చట్ట నిర్వచనంలో మార్పులను కూడా సూచించింది. వివిధ మతాల్లో వారసత్వ చట్టాల ప్రక్షాళన కోసం సిఫారసులు చేసింది. అయితే వివిధ మతాలకు చెందినవారు అనేక అపోహలతో ఈ సిఫారసులను వ్యతిరేకించడంతో చట్టంలో మార్పులుచేయటంలో జాప్యం జరిగి ఆచరణ సాధ్యం కాలేదు. వారసత్వ చట్టాల కింద అక్రమ సంతాన వారసుల హక్కులను గుర్తించేందుకు లా కమిషను సిఫారసు చేసింది.

నేటి ఆధునిక కాల పరిస్థితుల్లో పెళ్లికి ముందు స్త్రీ, పురుషుల సహ జీవనాన్ని, పరస్పర ఇష్టపూర్వక, అవగాహన పరిణితితో తీసుకున్న నిర్ణయంగా కోర్టులు గుర్తిస్తున్నాయి. విదేశీ సంస్కృతీ ప్రభావాల వల్ల ఏక లింగ వివాహాలను కూడా చట్టబద్ధం చేయాలని ఆ వర్గాలు కోరుతున్నాయి. ప్రస్తుత తరుణంలో హిందూ చట్టంలో కూడా సంస్కరణలు రావాలనీ, మహిళా సంఘాలు కోరుతున్నాయి. మహిళలు తమ వివాహ విషయంలో, దాంపత్య హక్కుల విషయంలో, పిల్లలను కనడంలో, వారిని పెంచటంలో మహిళా హక్కులను విదేశాలలో వలే స్త్రీ, పురుష సమానత్వాన్ని గుర్తించాలనీ కోరుతున్నారు. గృహ హింస నుండి రక్షణ, విడాకుల విషయంలో స్త్రీలకు సంపూర్ణ హక్కులు పురుషులతో పాటు వివక్ష లేని సమాన హక్కులు కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ మహిళా ఉద్యమాల ఫలితంగా హిందూ వారసత్వ చట్టాన్ని 2005లో సవరించారు. దాని ప్రకారం మహిళలకు తలిదండ్రుల వారసత్వ ఆస్తిలో సమాన హక్కులు, అత్తమామల పూర్వీకులు ఆస్తులలో పురుషులతో పాటు సమాన వారసత్వ హక్కు ఉంటాయని పేర్కొంది. భర్త సంపాదనపై భార్యకు కూడా సమాన హక్కును వారు కోరుతున్నారు.

2018లో లా కమిషన్ సంప్రదింపుల పత్రంలో వివిధ మతాల్లోనే తీవ్రమైన తేడాలు ఉన్నాయని గుర్తించింది. వాటిల్లో ముఖ్యమైనవి మన ప్రభుత్వాలు రూపొందించే చట్టాల కన్నా ప్రజల మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, కుల, మత కట్టుబాట్లకు ఎక్కవ విలువను ఇస్తారు. గిరిజన ఆదివాసీలు తమ మత, కుటుంబ సంప్రదాయాలను ప్రాణ సమానంగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు, ఆచరిస్తారు. ఉదాహరణకు నాగాలోని కొన్ని తెగలలో ఒక తెగకు చెందిన అమ్మాయి వేరే తెగకు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వీలులేదు. తెలుగు రాష్ట్రాల్లో మేనరిక వివాహాల్లో తేడాలు ఉన్నాయి. ఆంధ్రాలో మేనకోడల్ని వివాహం చేసుకుంటారు. భర్తను ‘మామా’ అని పిలుచుకుంటారు. తెలంగాణలో మేన కోడలిని చేసుకోవడం తప్పు. మేనమామ కూతురిని చేసుకుంటారు. కొందరు మేనత్త కూతురిని చేసుకోరు. నిజానికి ఈ మేనరికపు పెళ్ళిళ్ళు ఏవీ చట్టబద్ధం కావు. అయినా మేనరికపు సంబంధాలను చేసుకోవడానికే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా గ్రామీణులు ఈ రక్త సంబంధాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఇవి సంస్కృతికపరమైన, ఉమ్మడి ఆస్తుల రక్షణ కోసం రక్త సంబంధాల వివాహాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ మధ్య శాస్త్రీయ పరిశోధనా ఫలితంగా ’రక్త సంబంధ మేనరిక’ వివాహాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇలా కుల, మత, ఆచారాలకు, వివాహ, విడాకుల, వారసత్వ సంబంధాలు, దత్తతకు సంబంధించినవి అనేక సంక్లిష్ట విషయాలు మనోభావాలతో ముడిపడి ఉంటాయి. మానవ సంబంధాలు తమ కుటుంబ, కుల, మత, ఆచార, సంప్రదాయలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ప్రభుత్వాలు రూపొందించే చట్టాలు వారి నమ్మకాలకు, విశ్వాసాలకు అడ్డురాకపోతేనే వాటిని ఆచరిస్తారు. కాగా అవసరమైతే చట్టాలను సైతం పక్కకు పెడతారు. ఉమ్మడి పౌరస్మృతిని ఆచరణలోకి తెస్తే! ఉమ్మడి వారసత్వ ఆస్తుల ఖర్చుల క్రింద హిందూ ధనిక వర్గాలవారు పొందే ఇన్‌కంట్యాక్స్ ప్రయోజనాలు ఇకముందు లభించవు. ఈ ప్రయోజనం మన దేశంలో ఇతర మతాల వారికి లేదు. ఇలా ఉమ్మడి పౌర స్మృతి చట్టాన్ని రూపొందించేటప్పుడు ఇవన్నీ పరిగణనలోకి వస్తాయి. అన్నివర్గాల వారిని సంప్రదించి, ఒప్పించినప్పుడే ఆ చట్టం ఆచరణలో విజయం సాధిస్తుంది. హడావుడి నిర్ణయాలు సత్ఫలితాలను ఇవ్వలేవు. కేవలం చట్టాలు మాత్రమే అన్ని సమస్యలను పరిష్కరించలేవు.

– డా. కోలాహలం రామ్ కిశోర్, 9849328496

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News