Wednesday, January 22, 2025

ఇషాన్ కిషన్ సెంచరీ

- Advertisement -
- Advertisement -

ఆర్డిటి స్టేడియం వేదికగా ఇండియా బితో గురువారం మొదలైన దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌లో ఇండియా సి తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోరును సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయి టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమయ్యాడు. మళ్లీ టీమిండియాలో స్థానం కోసం ఎదురు చూస్తున్న ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో శతకం సాధించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకున్నాడు.

అనుహ్యంగా దులీప్ ట్రోఫీకి ఎంపికైన ఇషాన్ అందివచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఇండియా బి బౌలర్లనుదీటుగా ఎదుర్కొన్న ఇషాన్ 126 బంతుల్లో 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. బాబా ఇంద్రజిత్ 9 ఫోర్లతో 78, సాయి సుదర్శన్ (31), రజత్ పటిదార్ (40), రుతురాజ్ గైక్వాడ్ 46 (బ్యాటింగ్)లు కూడా రాణించడంతో ఇండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 357 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లను పడగొట్టాడు.

ములాని ఒంటరి పోరాటం..
ఇండియా డితో జరుగుతున్న మరో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఎ టీమ్ గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన జట్టును శమ్స్ ములాని,తనుస్ కొటియన్ ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన శమ్స్ ములాని ఏడు ఫోర్లతో 88 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. తనుష్ కొటియన్ ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 53 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. మిగతా వారిలో రియాన్ పరాగ్ (37), కుమార్ కుశాగ్రా (28)లు మాత్రమే కాస్త రాణించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News