ఐపిఎల్ మెగా వేలం పాటలో రూ.15.25కోట్లకు ఇషాన్ కిషన్‌ను సొంతం చేసుకున్న ముంబై ఇండియన్
చెన్నై సూపర్‌కింగ్స్ నుంచి రూ.14కోట్లు తీసుకొని రెండోస్థానంలో దీపక్ చాహర్
గతంలోనూ ఇవే జట్లకు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్, చాహర్
మూడోస్థానంలో రూ.12.25కోట్లతో శ్రేయస్ అయ్యర్
(కోల్‌కతా నైట్ రైడర్స్)
బెంగళూరు: ఊహించినట్టే ఐపిఎల్ మెగా వేలం పాట క్రికెటర్లపై కనక వర్షం కురిపించింది. బెంగళూరు వేదికగా శనివారం ఐపిఎల్ మెగా వేలం ప్రారంభమైంది. ఇక తొలి రోజు మెగా వేలంలో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ జాక్‌పాట్ కొట్టేశాడు. ముంబై ఇండియన్స్ రూ.15.25 కోట్లను వెచ్చించి సొంతం చేసుకుంది. ఈ మెగా వేలం పాటలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఇషాన్‌ను సొంతం చేసుకునేందుకు హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ చివరి వరకు గట్టిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. చివరికి ముంబై ఇండియన్స్ భారీ మొత్తం ధరకు ఇషాన్‌ను దక్కించుకుంది. గతంలో కూడా ఇషాన్ ముంబైకే ప్రాతినిథ్యం వహించడం విశేషం.
దీపక్ అదరోహో..
మరోవైపు భారత యువ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ కూడా మెగా వేలం పాటలో జాక్‌పాట్ కొట్టాడు. అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లకు సొంతం చేసుకుంది. గతంలో కూడా దీపక్ చెన్నైకే ప్రాతినిథ్యం వహించాడు. అయితే అతని రిటెయిన్ చేసుకోకుండా సిఎస్‌కె వదిలేసుకుంది. కానీ తిరిగి వేలం పాటలో భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది.
కోల్‌కతాకు శ్రేయస్
ఈసారి వేలం పాటలో అత్యధిక ధర పలుకుతాడని భావించిన శ్రేయస్ అయ్యర్ మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. ఈసారి అతనికి ఆశించిన స్థాయిలో ధర దక్కలేదనే చెప్పాలి. మెగా వేలం పాటలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.12.25 కోట్లను చెల్లించి శ్రేయస్‌ను కొనుగోలు చేసింది. తొలి సెట్ వేలంలో అయ్యర్‌ను కోల్‌కతా దక్కించుకుంది. సీనియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌ను పంజాబ్ కిగ్స్ దక్కించుకుంది. రూ.8.25 కోట్లు చెల్లించి పంజాబ్ ధావన్‌ను సొంతం చేసుకుంది. అంతేగాక సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబాడను పంజాబ్ భారీ మొత్తం ధరకు కొనుగోలు చేసింది. రబాడను పంజాబ్ రూ.9.25 కోట్లకు దక్కించుకుంది.
వార్నర్‌కు నిరాశే..
మరోవైపు వేలం పాటకు ప్రత్యేక ఆకర్షణగా మారిన ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్‌కు మెగా వేలం పాటలో తక్కువ ధరే లభించింది. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.6.25 కోట్లకు సొంతం చేసుకుంది. వార్నర్ ఈసారి కనీసం పది కోట్లకు పైగా ధరను పలకడం ఖాయమని విశ్లేషకులు జోస్యం చెప్పారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ వార్నర్ కేవలం రూ.6.25 కోట్లకే అమ్ముడు పోవడం గమనార్హం. ఇక భారత సీనియర్ బౌలర్ అశ్విన్‌కు కూడా మెగా వేలం పాటలో ఆశించిన ధర లభించలేదు. అశ్విన్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా తొలి సెట్‌లో ట్రెంట్ బౌల్ట్‌ను రాజస్థాన్ రూ.8 కోట్లకు దక్కించుకుంది. మనీష్ పాండేను రూ.4.6 కోట్లకు లక్నో ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. క్వింటన్ డికాక్‌ను రూ.6.75 కోట్లకు లక్నో దక్కించుకుంది. ఇక బెంగళూరు రూ. ఏడు కోట్లకు ఫా డుప్లెసిస్‌ను కైవసం చేసుకుంది. కమిన్స్‌ను కోల్‌కతా రూ.7.25 కోట్లకు, షమిను గుజరాత్ టైటాన్స్ రూ.6.25 కోట్లకు సొంతం చేసుకున్నాయి.
హర్షల్ పటేల్‌కు కళ్లు చెదిరే ధర
ఇక కిందటి ఐపిఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లను పడగొట్టిన హర్షల్ పటేల్ ఊహించినట్టే ఈసారి మెగా వేలం పాటలో భారీ ధరను పలికాడు. అతన్ని రూ.10.75 కోట్లను వెచ్చించి బెంగళూరు సొంతం చేసుకుంది. కిందటిసారి హర్షల్‌ను బెంగళూరు రూ.40 లక్షలకే దక్కించుకోవడం గమనార్హం. మరోవైపు నితీశ్ రాణాను రూ.8 కోల్‌కతా తిరిగి దక్కించుకుంది. హెట్‌మెయిర్‌ను రూ.8.50 కోట్లకు రాజస్థాన్ దక్కించుకోగా, డ్వేన్ బ్రావోను చెన్నై 4.40 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక కిందటిసారి బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన దేవ్‌దత్ పడిక్కల్‌ను ఈసారి రాజస్థాన్ దక్కించుకుంది. అతని కోసం రాజస్థాన్ రూ.7.75 కోట్లు చెల్లించింది. దీపక్ హుడాను రూ.5.75 కోట్లకు లక్నో దక్కించుకుంది. మరోవైపు విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను లక్నో రూ.8.75 కోట్లకు సొంతం చేసుకుంది.
ఇక శార్దూల్ ఠాకూర్ రూ. 10.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్, నికోలస్ పూరన్‌ను రూ.10.75 కోట్లకు హైదరాబాద్, ప్రసిద్ధ్ కృష్ణను రూ.10 కోట్లకు రాజస్థాన్, అవేశ్ ఖాన్‌ను రూ.10 కోట్లకు లక్నో, ఫెర్గూసన్‌ను రూ.10 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకున్నాయి. రాహుల్ త్రిపాఠిని కూడా సన్‌రైజర్స్ రూ8.75 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు శ్రీలంక యువ ఆల్‌రౌండర్ వనిండు హసరంగా కళ్లు చెదిరే ధరను పలికాడు. అతన్ని బెంగళూరు రూ.10.75 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం. అయితే స్టీవ్ స్మిత్, సురేశ్ రైనా, డేవిడ్ మిల్లర్, షకిబ్ అల్ హసన్ తదితరులకు మెగా వేలం పాటలో నిరాశే మిగిలింది. వీరిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు.