మన తెలంగాణ / హైదరాబాద్ : అంబేద్కర్ స్పూర్తిగా ఆ రోజుల్లోనే రాజకీయాల్లో ఈశ్వరీబాయి తనదైన ముద్ర వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో శనివారం జె.ఈశ్వరీబాయి 33వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈశ్వరీబాయి రాజకీయాల్లో రాణిస్తూనే గీతారెడ్డిని డాక్టర్ చదివించారని అన్నారు. ప్రతీ పురుషుడి విజయం వెనకాల ఒక మహిళ ఉన్నట్లు, గీతక్క ప్రతీ విజయంలో డాక్టర్ గారి సహకారం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడం నేను బాధ్యతగా భావించానన్నారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా గీతారెడ్డి క్రియాశీలకంగా పనిచేశారని, ఆరోగ్య సమస్యలను పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పనిచేశారని అందుకే గీతక్క ఇంచార్జిగా ఉన్న నల్లగొండ జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచామని ముఖ్యమంత్రి అన్నారు. గీతక్క లాంటి వారు మంత్రివర్గంలో లేకపోవడం ఒక లోటు అని, మంచికి, చెడుకు ఎప్పటికీ మాకు అండగా ఉండే అక్క.. గీతక్క అని అన్నారు. ఏ అవకాశం ఉన్నా వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామినిచ్చారు. అంతకు ముందు సిఎం, మంత్రులు ఈశ్వరీబాయి చిత్రపటానికి నివాళులర్పించారు.