ఈ ఉగ్రసంస్థ తదుపరి లక్ష్యం భారత్..? నిఘావర్గాలు
న్యూఢిల్లీ: గురువారం కాబూల్‌లో జరిగిన జంట పేలుళ్ల వెనుక ఐఎస్‌ఐఎస్‌కు చెందిన ఉగ్రవాద విభాగం ఉన్నట్టు భారత నిఘావర్గాలు భావిస్తున్నాయి. ఐఎస్‌ఐఎస్‌కు చెందిన ఐఎస్ ఖొరాసాన్(ఐఎస్‌కె) అనే జిహాదీ సంస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిహాదీ దాడులతో భయోత్పాతం సృష్టించడం ద్వారా మధ్య ఆసియాను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నది ఖొరాసాన్ లక్షం. దీని తదుపరి లక్షంగా భారత్‌ను ఎంచుకోనున్నట్టు అనుమానిస్తున్నారు. దాంతో, కాబూల్ ఘటనతో భారత నిఘావర్గాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కేరళ, ముంబయిలలోని ఉగ్రభావాలున్న యువకులు కొందరు ఐఎస్‌ఐఎస్ ఉచ్చులో పడి దొరికిపోయిన ఘటనలు నమోదయ్యాయి. అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో మరోసారి అలాంటి యువకులు ఆదిశగా అడుగులు వేసే అవకాశమున్నట్టుగా నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా ఇప్పటివరకూ జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడులకు పాల్పడ్డ జైషేమహ్మద్ ఇక తన స్థావరాన్ని అఫ్ఘన్‌లోని హెల్మండ్ రాష్ట్రంలోకి మార్చనున్నట్టు నిఘావర్గాల అంచనా. అదేవిధంగా మరో ఉగ్రసంస్థ లష్కర్‌ఇతోయిబా అఫ్ఘన్‌లోని కునార్ రాష్ట్రానికి తన అడ్డాను మార్చనున్నట్టు భావిస్తున్నారు. 2008 ముంబయి బాంబు పేలుళ్లకు పాల్పడింది లష్కర్ గ్రూపేనన్నది గమనార్హం.