న్యూఢిల్లీ : ఐసిఎస్ కుట్ర కేసులో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 44 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ ) శనివారం తెల్లవారు నుంచి దాడులు ప్రారంభించి ఇంతవరకు 15 మంది నిందితులను అరెస్ట్ చేసింది. నిందితులు అల్‌ఖైదా, ఐసిఎస్, వంటి ఉగ్రవాద సంస్థలతో కలిసి హింసాత్మక చర్యలకు కుట్ర పన్నారనే అభియోగాలు ఉన్నాయి. మహారాష్ట్ర లోని పుణె, ఠాణె, మీరా భయాందర్‌తోసహా అనేక ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. పుణెలో రెండు చోట్ల, ఠాణెలో 40 చోట్ల, కర్ణాటకలో రెండు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.
దాడుల్లో భారీగా లెక్కల్లో చూపించని నగదు, మారణాయుధాలు, పదునైన ఆయుధాలు, అనేక పత్రాలు, స్మార్ట్‌ఫోన్లు , ఇతర డిజిటల్ పరికరాలు పట్టుబడ్డాయి. పుణె ఐసిఎస్ మాడ్యుల్ కేసులో కీలక నిందితుడు షానవాజ్‌ను ఢిల్లీలో అరెస్ట్ చేసి ఐఈడీలను తయారు చేసేందుకు ఉపయోగించే అనేక రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. పుణె మాడ్యుల్ కేసుతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని ఎన్‌ఐఎ అరెస్ట్ చేసి గత నెలలో ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులు ఉగ్ర ముఠాలను ఏర్పాటు చేసి నిధులను సేకరిస్తున్నారని ఎన్‌ఐఎ పేర్కొంది. వారి నుంచి మారణాయుధాలు ఐఈడీ , మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.