Monday, December 23, 2024

హైదరాబాద్‌లో ఐసిస్ కలకలం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి ఉగ్ర కలకలం చెలరేగింది. దేశంలో ఎక్కడా ఉగ్రవాద దాడులు జరిగినా దాని మూలాలు, లింకులు హైదరాబాద్ లో బయల్పడేవి. అయితే కొన్నాళ్ల నుంచి దేశంలో ఎక్కడా ఇటువంటి ఉగ్ర కార్యకలాపాలు జరిగినా ఇంటలిజెన్స్ వ్యవస్థ అప్రమత్తతో ఉగ్రదాడులను భగ్నం చేస్తున్నారు. ఇదే విధంగా తాజాగా ఇంటెలిజెన్స్ అప్రమత్తతతో ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడిని అరెస్ట్ చేశారు. పాతబస్తీకి చెందిన సులేమాన్ అనే ఐసిస్ సానుభూతిపరుడిని మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్ కు మద్దతుగా, ఐసిస్ భావజాలాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. సులేమాన్ పేరుతో 20 సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు గుర్తించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు సులేమాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాతబస్తీకి చెందిన సులేమాన్ ఫలక్‌నుమా పరిధిలోని రైతు బజార్‌లో కొంతకాలంగా నివాసమున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ్నించే కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. కాగా, 2020లోనే పహాడీషరీఫ్‌లో సులేమాన్‌కు రాచకొండ ఎస్వోటీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే కౌన్సిలింగ్ తర్వాత కూడా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. అదే పనిగా సోషల్ మీడియాలో యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించే విధంగా ప్రచారం చేస్తున్నాడని భావించి అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, కొంతకాలం సైలెంట్‌గా ఉన్న సులేమాన్ తరువాత ఫండింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం అతడికి ఫండింగ్ ఎక్కడ్నించి వచ్చిందనే దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దేశంలో ఐసిస్ కదలికల్ని నాలుగు రోజుల క్రితం కేంద్ర భద్రతా బలగాలు గుర్తించాయి . ఈనేపథ్యంలో హైదరాబాద్ లో సానుభూతిపరుడిని అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది. టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఐసిస్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఐసిస్ తరుపున యుద్ధం చేయాలంటూ కామెంట్స్ పెడుతున్నాడు. ప్రస్తుతం దేశంలో మూడు ఐసిస్ మాడ్యూల్స్ యాక్టివ్ గా ఉన్నాయని భద్రతా సంస్థలు వెల్లడిస్తున్నాయి. భాగ్యనగరం.. అందునా పాతబస్తీ ఉగ్రవాద కార్యకలాపాలకు గత కొంత కాలంగా అడ్డాగా నిలుస్తూ వస్తోంది. ఇటీవల జరిగిన సంఘటనలు ఇందుకు ఊతాన్నిస్తున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు, నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. పూర్తిస్థాయిలో భాగ్యనగరంలోని పాతబస్తీని జల్లెడ పట్టాయి.. పడుతున్నాయి. గతంలోనూ పాతబస్తీ కేంద్రంగా ఐసిస్ తన కార్యకలాపాలను విస్తృతం చేసిన సంగతి విదితమే. భాగ్యనగరం పాతబస్తీపై ఐసిస్ ఎన్నాళ్లుగానో కన్ను వేసింది. ఇందుకనుగుణంగా పలు దఫాలుగా ఐసిస్ పాతబస్తీపై గురిపెట్టినప్పటికీ ఎన్‌ఐఎతో పాటు రాష్ట్ర పోలీసు యంత్రాంగా ఐసిస్ కుట్రలను బహిర్గతం చేసిన ఘటనలున్నాయి.
సులేమాన్‌ను కస్టడీ కోరనున్న పోలీసులు..
కాగా, ఐసిస్ సానుభూతిపరుడు సులేమాన్‌కు ఫండింగ్ ఎక్కడ్నించి వస్తోంది? సులేమాన్‌తో పాటు ఇంకెవరైనా వున్నారా? తదితర అంశాలపై విచారణ జరిపేందుకు సులేమాన్‌ను పోలీసులు కస్టడీ కోరనున్నారు. వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు. దేశవ్యాప్తంగా ఐసిస్ కదలికలు విస్తృతమవుతున్న తరుణంలో.. అందునా భాగ్యనగరంపై ఐసిస్ ఎంతోకాలంగా కన్నేసి ఉంచడం.. ప్రధానంగా ఆర్థిక వనరులే లక్షంగా దాడులకు ఐసిసి గతంలో దాడులకు ఉపక్రమించిన ఘటనలున్నాయి. అదే విధంగా ప్రముఖ ఆలయాలను సైతం ఐసిస్ గతంలో టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో సులేమాన్‌ని విచారిస్తే భాగ్యనగరంలో ఐసిస్ కదలికలతో పాటు సులేమాన్ ఫండింగ్ ఎక్కడ్నుంచి వస్తుందనే దానిపై నిఘా సంస్థలు, పోలీసులకు స్పష్టమైన సమాచారం లభించే అవకాశం ఉంది.

ISIS Terrorist arrest in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News