Friday, December 20, 2024

మేనకా గాంధీ ఆరోపణలకు ఇస్కాన్ కౌంటర్(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: వట్టిపోయిన ఆవులను ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ వధశాలలకు అమ్మివేస్తోందంటూ బిజెపి ఎంపి మేనకా గాంధీ చేసిన ఆరోపణలపై ఇస్కాన్ మంగళవారం స్పందించింది. మేనకా గాంధీ ఆరోపణలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె ఆరోపణలను ఖండిస్తూ ఇస్కాన్ వివరణతోపాటు ఒక వీడియోను కూడా విడుదల చేసింది.

దేశంలో అతిపెద్ద మోసకారి ఇస్కాన్ సంస్థ. గోశాలలను ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున భూములను పొందడంతోపాటు అనేక ప్రయోజనాలు ఇస్కాన్ పొందుతోంది అంటూ మేనకా గాంధీ తన వీడియోలో ఆరోపించారు. తాను ఇటీవల అనంతపూర్ గోశాలను సందర్శించానని, అక్కడ వట్టిపోయిన ఆవును కాని దూడను కాని తాను ఒక్కటి కూడా చూడలేదని ఆమె తెలిపారు. అక్కడ ఉన్నవన్నీ పాడి ఆవులే. దీన్ని బట్టి చూస్తే అక్కడ వట్టిపోయిన ఆవులన్నిటినీ అమ్మేశారని అర్థమవుతోంది అంటూ ఆమె ఆరోపించారు. ఇస్కాన్ తన వట్టిపోయిన(పాలు ఇవ్వని) ఆవులన్నిటినీ వధశాలలకు అమ్మేస్తోందని కూడా ఆమె ఆరోపించారు.

ఈ వీడియోపై ఇస్కాన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ యుధిష్టిర్ గోవింద దాస్ స్పందించారు. మేనకా గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తప్పుడు సమాచారమని ఆయన స్పష్టం చేశారు. గోసంరక్షణకు కట్టుబడిన ఇస్కాన్ 60కి పైగా గోశాలలను నిర్వహిస్తోందని, గోవులు, ఎద్దులు బతికున్నంత కాలం వాటి సంరక్షణ బాధ్యతను ఇస్కాన్ చూసుకుంటోందని ఆయన తెలిపారు.

అనంతపూర్ గోశాలలో వట్టిపోయిన ఆవులు, దూడలను సంరక్షిస్తున్న తీరును తెలియచేస్తూ ఒక వీడియోను కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అనంతపూర్ గోశాలను మేనకా గాంధీ సందర్శించిన విషయం అక్కడ ఉన్న తమ సిబ్బంది ఎవరి దృష్టికీ రాలేదని కూడా ఆయన తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా తమ గోశాలలను సందర్శించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News