పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరు(పిఓకె) ఒన విదేశీ భూభాగమని, అది పాకిస్తాన్ పరిధిలోకి రాదని పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టులో అధికారికంగా ప్రకటించింది. ఈ సంచలన ప్రకటన శుక్రవారం(మే 31) పాకిస్తాన్ అదనపు అటార్నీ జనరల్ నుంచి వెలువడింది. కశ్మీరీ కవి, జర్నలిస్టు అహ్మద్ ఫర్హాద్ షా కిడ్నాప్ కేసులో పాక్ అదనపు అటార్నీ జనరల్ ఈ ప్రకటన చేశారు. మే 15న రావల్‌పిండిలోని తన ఇంట్లో నుంచి అ్మద్ ఫర్హాద్ షాను పాకిస్తాన్ నిఘా సంస్థలు అపహరించాయి. తన భర్తను కిడ్నాప్ చేశారంటూ ఫర్హాద్ షా దాఖలు చేసిన పిటిషన్‌పై ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం విచారణ జరపింది. ఫర్హాద్ షాను కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి మొఖ్తార్ కయాని పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీనిపి అదనపు అటార్నీ జనరల్ జవాబిస్తూ పిఓకెలో పోలీసు కస్టడీలో ఫర్హాద్ షా ఉన్నారని, ఆయనను ఇస్లామాబాద్ హైకోర్టులో హాజరుపరచలేమని తెలిపారు.
పిఓకె ఒక విదేశీ భూభాగమని, దానికి సొంత రాజ్యాంగం, సొంత కోర్టులు ఉన్నాయని అదనపు అటార్నీ జనరల్ తెలిపారు. పాకిస్తానీ కోర్టులు ఇచ్చే తీర్పులు పిఓకెలో విదేశీ కోర్టుల తీర్పులుగా పరిగణిస్తారని ఆయన వ్యాఖ్యానించినట్లు పాకిస్తాన్ టుడే పత్రిక తెలిపింది. దీనికి జస్టిస్ కయాని స్పందిస్తూ పిఓకె ఒక విదేశీ భూభాగమైతే అందులోకి పాకిస్తానీ సైన్యం, పాకిస్తానీ రేంజర్లు ఎలా ప్రవేశించారని ప్రశ్నించారు. ప్రజలను బలవంతంగా అపహరించే పద్ధతులను పాకిస్తానీ నిఘా సంస్థలు మానలేదని జస్టిస్ కయానీ ఈ సందర్భంగా విమర్శించారు. పర్హాద్ షాను ధిర్కోట్ పోలీసులు అరెస్టు చేసినట్లు వాదనల సందర్భంగా వెలుగుచూసింది. ఆయనపై పిఓకెలో రెండు కేసులు నమోదయ్యాయి. కాగా..పాక్ ఆక్రమిత కశ్మీరు 1947 నుంచి పాక్ ఆక్రమణలో ఉంది. అయితే పిఓకె భారత్‌లో అంతర్భాగమని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పలు సందర్భాలలో స్పష్టం చేశారు.