కోర్టు ధిక్కార చర్యలకు కోర్టు సమాయత్తం
ఇస్లామాబాద్: ఒక మహిళా న్యాయమూర్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కోర్టు ధిక్కార ప్రక్రియను చేపట్టిన ఇస్లామాబాద్ హైకోర్టు మంగళవారం పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు షోకాజ్ నోటీసు జారీచేయడంతోపాటు ఈ నెల 31న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నెల 31న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలంటూ ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇమ్రాన్ ఖాన్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గత శనివారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగించిన 69 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ అదనపు సెషన్స్ జడ్జి బెజా చౌదరిపై బెదిరింపులకు పాల్పడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఇమ్రాన్ ఖాన్‌పై కోర్టు ధిక్కార ప్రక్రియను చేపట్టేందుకు విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలని హైకోర్టు నిర్ణయించింది. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు అనుచితమని జస్టిస్ మొహసిన్ అఖ్తర్ కయాని పేర్కొన్నారు. ఈ కేసు కేవలం ఇస్లామాబాద్ హైకోర్టుకు మాత్రమే పరిమితం కాదని, అత్యున్నత స్థాయికి దీని సందేశం వెళ్లనున్నదని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా కట్టడి అవసరమని ఆయన తెలిపారు.