కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, వెనుక నుండి నడిపిస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కేరళలో పట్టు కోసం ప్రయత్నించటం తప్పుకాదు. కానీ దాని కోసం అనుసరిస్తున్న విధానాలు పూర్తిగా తప్పుడు మార్గంలో నడుస్తున్నాయి. బిజెపి ‘మత రాజకీయాలు’ పతాక స్థాయికి చేరుకున్నాయి. కేరళలోని వామపక్ష ప్రభుత్వంపై దాడి చేయటం కోసం, మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల్లో లేని భయాన్ని సృష్టించమే తప్పు. కేరళలో ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రజలను మార్చడానికి శక్తివంచన లేకుండా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ఉమ్మడిగా ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ ప్రయత్నంలోని ఒక అంశమే ‘ది కేరళ స్టోరీ’ అనే ఒక సినిమాను తీసి, ఈ నెల 5వ తేదీన విడుదలకు సిద్ధం కావడం. ఈ సినిమాలో అన్ని అభూత కల్పనలు, కట్టు కథనాలే ఉన్నాయి. కేరళలో ఇస్లామిక్ తీవ్రవాదం పెరుగుతుందనీ ‘లవ్ జిహాద్’ పేరుతో అమాయకపు హిందూ అమ్మాయిలను ప్రేమలోకి దింపి, ఆ తర్వాత ఇస్లాం మతంలోకి ‘మత మార్పిడి’ చేస్తున్నారని నిరాధార అభియోగాన్ని మోపింది. ఈ కట్టు కథ ఆధారంగానే ‘ది కేరళ స్టోరీ’ తెరకెక్కింది.
కేరళ రాష్ట్రంలో 32,000 మంది బాలికలు కనిపించకుండా పోయారనీ, వారిని ‘లవ్ జిహాద్’ ద్వారా ఇస్లాంలోకి మార్చి సిరియాకు తరలించారని ఆ సినిమాలోని కథా అంశం. దీనికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాణం, అన్నీ సంఘ్ పరివారే చూసుకున్నదనేది, బహిరంగ రహస్యం. ఈ సినిమాను సంఘ్ పరివార్ అబద్ధాలు ఫ్యాక్టరీ నుండి తయారైన విద్వేష పూరిత తప్పుడు ఉత్పత్తిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా విమర్శించారు. అందుకే కేరళలో అధికార పార్టీగా ఎదగటానికి బిజెపి ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టడం అనే వ్యూహాత్మకమైన తప్పుడు మార్గాలను ఎంచుకున్నదని, అయినా అలాంటి కుయుక్తులు కేరళ రాష్ట్రంలో సాధ్యంకాదని ఆయన అన్నారు. మైనారిటీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో పని చేస్తూ ఆ సంస్థ విధానాలనే అమలు చేసేందుకు బిజెపి ప్రయత్నం చేస్తుంది.
కానీ, కేరళ రాష్ట్రం దేశంలోనే ఏనాడో వంద శాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం. అక్కడ ప్రజలు ‘వామపక్ష’, ‘లౌకిక’ భావాలు కలిగిన విద్యావంతులు. అక్కడ సంకుచిత, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు పని చేయవు. కేరళలో వామపక్షం అధికారంలో ఉన్నంత కాలం బిజెపికి అక్కడ మత రాజకీయాలు సాగించే అవకాశం లేదు. అందుకే ‘మతాన్ని రెచ్చగొట్టడానికి ఒక ఆయుధంగా ఈ సినిమాని వాడుకుంటుందని, ఇది సంఘ్ పరివార్ వికృత కార్యక్రమం’ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. ఈ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ‘మత విద్వేషాల’ దుష్ప్రచారం గురించి కేరళ ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు. అందుకే ఎలాంటి సాక్షాధారాలు లేకుండా ఒక వర్గంపై తప్పుడు ఆరోపణలు సంధిస్తూ మరొక వర్గాన్ని రెచ్చగొట్టేలా ‘కేరళ స్టోరీ’ అనేటువంటి సినిమాను తీసింది.
అసత్య పునాదులపై నిర్మించిన ఈ సినిమా ద్వారా బిజెపి ఏమీ ఆశిస్తుందో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘లవ్ జిహాదీలు’ లేనేలేవనే విషయాన్ని పార్లమెంటులో కూడా ప్రకటించారు. స్వయంగా సుప్రీంకోర్టు ‘లవ్ జిహాద్’ అంశాన్ని పరిశీలించి అలాంటిదేమీ లేదని కూడా తేల్చి చెప్పింది. అయినప్పటికీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, సంఘ్ పరివార్ కలిసి ఇదే విషయాన్ని పదేపదే, ‘లవ్ జిహాద్’ పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ స్పష్టం చేశారు. ఈ సినిమాలో చెప్పినట్లు వేలాది మంది బాలికలు నిజంగానే ‘లవ్ జిహాద్’ వల్ల మోసం చేసి సిరియా తదితర దేశాలకు పంపించేశారా? ఒకవేళ ఇదే నిజమైతే, నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ఉందా? ఉంటే, ఏలాంటి చర్యలు తీసుకుంది? ఒకవేళ సమాచారం లేకపోతే ఈ వైఫల్యానికి కారకులెవరు? ఇలాంటి సమాధానం లేనటువంటి ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి.
ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వద్దని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడంతో తప్పేమీ లేదు. ముస్లిం లీగ్ అనుబంధంగా ఉన్నటువంటి యువజన విభాగం ముస్లిం యూత్ లీడర్ ఇప్పటికే ఈ సినిమాకు మద్దతు ఇచ్చేవారికి సవాలు విసిరాడు. ఈ సినిమాలో చూపిస్తున్నట్లు 32,000 మంది బాలికలను ఇస్లాంలోకి మార్చి మరో దేశానికి తరలించాలని రుజువు చేస్తే కోటి రూపాయలు బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది.
కానీ ఆధారాలు లేని ఇటువంటి ఆరోపణలు చేయటం వల్ల ప్రయోజనం ఏమీ లేదని ఇలాంటి దుష్ప్రచారాలు వల్ల బిజెపి పార్టీకి ఒరిగేది ఏమీ లేదని కూడా వాళ్ళు స్పష్టం చేశారు.