మానవ బాంబర్ ఫొటో కూడా విడుదల
దుబాయి: అఫ్ఘన్ రాజధాని కాబూల్‌లోని హమిద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల చోటు చేసుకున్న వరస బాంబు పేలుళ్లను తామే జరిపినట్లు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించుకుంది. తాము అమెరికా సైనికులను, వారి అఫ్ఘన్ మిత్రులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు అఫ్ఘన్‌లో ఐఎస్ అనుబంధ సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్‌ఖోరసాన్ గ్రూపు ప్రకటించుకుంది. దాడి జరిపినట్లుగా చెబుతున్న మానవ బాంబర్ ఫొటోను కూడా ఆ సంస్థ విడుదల చేసింది. పేలుడు పదార్థాల బెల్టుతో ఐఎస్ జెండా ముందు నిలబడి ఉన్న ఆ వ్యక్తి ముఖాన్ని నల్లని గుడ్డతో కవర్ చేసుకున్నాడు. దాడి చేసిన వ్యక్తి తాలిబన్ చెక్‌పాయింట్లను దాటుకుని అమెరికా సైనికులు, వారికి సహకరిస్తున్న వారు ఉంటున్న చోటుకు 5 మీటర్ల దగ్గరకు చేరుకుని తనను తాను పేల్చేసుకున్నాడని ఐఎస్ ఆ ప్రకటనలో తెలిపింది. అయితే రెండో మానవ బాంబు గురించి కానీ, సాయుధుల గురించి కానీ ఆ ప్రకటన ప్రస్తావించలేదు.