Saturday, November 16, 2024

రఫాపై ఇజ్రాయెల్ దాడులు.. 18 మంది హతం

- Advertisement -
- Advertisement -

18 మంది హతం
వారిలో 14 మంది పిల్లలు
గాజాకు యుఎస్ 9 బిలియన్ డాలర్ల సాయం

రఫా (గాజా స్ట్రిప్) : దక్షిణ గాజా నగరం రఫాపై ఇజ్రాయెల్ శనివారం రాత్రి జరిపిన దాడుల్లో 14 మంది పిల్లలతో సహా 18 మంది హతమైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. తన సన్నిహిత మిత్ర దేశానికి బిలియన్ల డాలర్ల అదనపు మిలిటరీ సాయాన్ని అమెరికా ప్రకటించింది. ఇజ్రాయెల్ రఫాపై దాదాపుగా రోజువారి దాడులు కొనసాగించింది. రఫాలో నివసిస్తున్న 23 లక్షల జనాభాలో సగం మందికి పైగా ఇతర ప్రాంతాల్లో శరణార్థులుగా మారారు. మరొక వైపు సంయమనం పాటించాలని యుఎస్‌తో సహా అంతర్జాతీయంగా పిలుపులు వస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న రఫా నగరంలో భూతల దాడులు సాగిస్తామని శపథం చేసింది.

యుఎస్ ప్రతినిధుల సభ శనివారం 26 బిలియన్ డాలర్ల సహాయ పథకానికి ఆమోద ముద్ర వేసింది. గాజాకు 9 బిలియన్ డాలర్ల మానవతావాద సాయం కూడా ఆ పథకంలో భాగం. ఇజ్రాయెల్ మొదటి దాడిలో ఒక వ్యక్తి, అతని భార్య, వారి మూడు సంవత్సరాల కుమారుడు మరణించినట్లు సమీపంలోని కువైటీ ఆసుపత్రి తెలియజేసింది. ఆ ముగ్గురి మృతదేహాలన ఆ ఆసుపత్రికే తరలించారు. అయితే, ఆమె గర్భవతి అని, వైద్యులు శిశువును రక్షించగలిగారని ఆసుపత్రి తెలిపింది. ఆసుపత్రి రికార్డుల ప్రకారం, రెండవ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది పిల్లలు, ఇద్దరు మహిళలు హతులయ్యారు.

ముందు రోజు రాత్రి రఫాపై జరిగిన వైమానిక దాడిలో ఆరుగురు పిల్లలతో సహా తొమ్మిది మంది మృతి చెందారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో 34 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందినట్లు స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గాజాలోని రెండు పెద్ద నగరాలు యుద్ధంలో ధ్వంసం అయ్యాయి. ఏడు నెలలుగా సాగుతున్న ఆ యుద్ధం ఆ ప్రాంతంలో అశాంతికి దారి తీసింది. యుద్ధం ఇజ్రాయెల్, అమెరికాలను మధ్య ప్రాచ్యం వ్యాప్తంగా ఇరాన్‌కు, తీవ్రవాద వర్గాలకు ప్రతిద్వంద్వులుగా మార్చింది.

ఇజ్రాయెల్, ఇరాన్ ఈ నెలారంభంలో ప్రత్యక్షంగా దాడులు సాగించుకున్నాయి. దీర్ఘకాలిక శత్రువుల మధ్య యుద్ధం ప్రజ్వరిల్లుతుందనే భయాలు కలిగించాయి. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఇద్దరు పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైనికులు హతమార్చారు. ఆ ఇద్దరు ఆదివారం తెల్లవారు జామున దక్షిణ వెస్ట్ బ్యాంక్ పట్టణం హెబ్రాన్ సమీపంలో ఒక బాకు, తుపాకితో చెక్‌పాయింట్ వద్ద దాడి జరిపారని మిలిటరీ తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News