Sunday, December 22, 2024

పశ్చిమాసియా యుద్ధం మరింత విస్తారితం

- Advertisement -
- Advertisement -

ఇప్పటికీ ఇరువైపులా 3వేల మంది బలి
లెబనాన్, సిరియాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు
ఇక గాజాస్ట్రిప్ నేలమట్టానికి సంసిద్ధం
సైన్యానికి పూర్తి అధికారాలు
సరిహద్దుల్లో రక్షణ మంత్రి భేటీలు

టెల్‌అవీవ్ / గాజాస్ట్రిప్ : పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రతరం, భయానకం అయ్యి విస్తారించుకునే పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా దిగ్బంధం అయిన గాజాస్ట్రిప్‌పై దాడులు సాగిస్తూనే సమీపంలోని ప్రాంతాలపై కూడా ఇజ్రాయెల్ సేనలు వైమానిక దాడులను ముమ్మరం చేశాయి. హమాస్ చోరబాటు దాడులు తదనంతర ఇజ్రాయెల్ భీకర ముమ్మర దాడులతో ఇప్పటివరకూ మృతుల సంఖ్య మూడువేలు దాటింది. అత్యధిక సంఖ్యలో జనం గాయపడ్డారు. గాజాలో ఎక్కడ చూసినా శిథిలాలు , వాటికింద మృతదేహాలు కన్పిస్తున్నాయి.

ఇప్పటివరకూ వైమానిక దాడులకు దిగుతూ వస్తున్న ఇజ్రాయెల్ అన్ని విధాలుగా గాజాస్ట్రిప్‌ను కట్టడి చేసి, ఇప్పుడు భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లడానికి సంసిద్ధం అయినట్లు వార్తలు వెలువడ్డాయి. హమాస్ దాడికి ప్రతిగా తాము ఈ ప్రాంతం అంతటిని ధ్వంసంచేసేస్తామని తెలిపిన ఇజ్రాయెల్ హమాస్ చేతుల్లో ఉన్న వందలాది మంది బందీల పరిస్థితిపై ఇప్పటివరకూ భూ స్థాయి దాడులపై తటపటాయిస్తోంది. అయితే బందీల విషయాన్ని విస్మరించి పూర్తి స్థాయిలో ఇప్పుడే ఈ భూభాగాన్ని పూర్తిగా దెబ్బతీయాల్సిందేనని ఇజ్రాయెల్ అధికారిక వ్యవస్థపై సైనికాధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. బందీల విషయంలో రాజీకి దిగితే తిరిగి హమాస్ నుంచి దాడులు తీవ్రతరం అవుతాయని సైన్యం భావిస్తోంది.

హమాస్‌ను కట్టడిచేసే దశలో ఇజ్రాయెల్ ఉత్తర దిక్కున సరిహద్దులలో లెబనాన్ , సిరియాల్లోని మిలిటెంట్లపై కూడా ఇజ్రాయెల్ సేనలు కాల్పులు జరుపుతూ రావడంతో ఇక్కడి ఘర్షణ చివరికి ప్రాంతీయ యుద్ధంగా మారే అవకాశం ఏర్పడింది. హమాస్‌పై ఇప్పుడు సాగుతోన్న దాడుల దశలో ఇతర దేశాలు , ఇతర సాయుధ బృందాలు జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇటీవలే అమెరికా అధ్యక్షులు జో బైడెన్ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు ఇప్పుడు అమెరికా నుంచి భారీ స్థాయిలో సాయం అందుతోంది.

ఇజ్రాయెల్‌కు అమెరికా నుంచి అధునాతన ఆయుధాలు , మిలిటరీ సామాగ్రితరలించింది. మధ్యధరా సముద్రం తూర్పు ప్రాంతంలోకి ఓ యుద్ధనౌకను ఇజ్రాయెల్‌కు రక్షణ కోసం తరలించింది. ఇక తాము అన్ని కట్టుబాట్లను ఎత్తివేస్తున్నామని, తమ దేశ పిల్లలను, మహిళలను , వృద్ధులను కనికరం లేకుండా చంపేసిన హమాస్ పట్ల రాజీ ప్రసక్తే లేదని , సైన్యానికి అవసరంఅయిన అధికారం కల్పిస్తామని దక్షిణ సరిహద్దులలో సైన్యంతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ తెలిపారు. మనతో తలపడే ప్రతి ఒక్కరిని మట్టుపెట్టాల్సిందే, ఇప్పుడు సైన్యం తన పరిధిలో ఏదైనా చేయవచ్చునని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News