Saturday, January 18, 2025

యుద్ధాలు విధ్వంసానికి ప్రతిరూపాలు

- Advertisement -
- Advertisement -

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న సంఘటనలు మారణహోమానికి దారితీస్తున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య గాజా విషయంలో సాగుతున్న సుదీర్ఘ పోరాటం, సిరియా సంక్షోభం, అంతర్యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం శాంతి కాముకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, జోర్డాన్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, లెబనాన్, సైప్రస్ తదితర దేశాలున్నాయి గాజా స్ట్రిప్, వెస్ట్‌బ్యాంక్‌లు ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు. వీటిపై యాసర్ అరాఫత్ వంటి యోధులు ఇజ్రాయెల్‌పై పోరాడి విఫలమైన సంగతి తెలిసిందే. అప్పట్లో భారత దేశం పాలస్తీనాకు వెన్నుదన్నుగా నిలిచింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో భారత్ ప్రస్తుతం ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నది. మధ్య ప్రాచ్యంలో సుమారు 371 మిలియన్ల జనాభా ఉంది. ఇందులో సుమారు 95% పైగా ముస్లిం జనాభా ఉంది.

మధ్యప్రాచ్యంలో దాదాపు 90% ఇస్లాం మతాధిక్యత గల ప్రజలున్నారు. ఇన్ని దేశాల మధ్యలో గల ఇజ్రాయెల్ ఒక చిన్నదేశం. ఇది యూదుల దేశం. అయినా ఆయుధ సంపత్తిలోను, ఆర్ధిక సంపత్తిలోను, సాంకేతికంగాను ఇజ్రాయెల్ అత్యంత శక్తివంతమైన దేశం. మధ్యప్రాచ్య దేశాలు చము రు సంపదలతో తులతూగుతున్నాయి. ముస్లిం దేశాలకు అమెరికాకు బద్ధవైరం కొనసాగుతున్న నేపథ్యంలో ముస్లిం వ్యతిరేక ఇజ్రాయెల్‌ను అడ్డం పెట్టుకుని లబ్ధి పొందాలనే అమెరికా ఆశ అక్కడ అప్పుడప్పుడూ ఉద్రిక్తతలకు దారితీస్తున్నది. అమెరికా అన్ని విషయాల్లోను ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తున్నది.ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత జరిగిందిదే.ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య ప్రస్తుతం తీవ్రమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.పెద్దన్నలా వ్యవహరించవలసిన అమెరికా ఇరుదేశాల మధ్య రగులుతున్న సమస్యకు ఆజ్యం పోస్తున్నది. హమాస్ దాడికి ప్రతీకారంగా ఇప్పటికే గాజాలో జరిగిన మారణహోమంలో పలువురు పాలస్త్తినీయులు మరణించిన విషయం విదితమే. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు తెగబడిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నది.

ఇరాన్ ఇజ్రాయెల్‌పై డ్రోన్లతో దాడి చేసిందని, అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్ పై క్షిపణి దాడులు జరిపిందని వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్‌ల మధ్య గత రెండు సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న యుద్ధం అమెరికా దన్నుతో రావణకాష్ఠంలా కొనసాగుతూనే ఉంది. అయితే ఆ ఇరుదేశాలు అణ్వాయుధాలను ప్రయోగించకపోవడం ప్రపంచానికి కొంత ఉపశమనంగానే భావించాలి. అయితే రష్యాఉక్రెయిన్ల మధ్య యుద్ధం వలన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఆర్ధికంగా చితికిపోయాయి. పాక్ అన్నమో రామచంద్రా అని అలమటిస్తున్నది. టూరిజంపై ఆధారపడిన శ్రీలంక నాటి పాలకుల చర్యలతో అంతకు ముందే ఆర్ధికంగా ఛిన్నాభిన్నమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ఇరాన్‌ల మధ్య రగిలిన కార్చిచ్చు వల్ల ఎన్ని దేశాలు ఆర్ధికంగా కుంగిపోతాయో ఇప్పుడే ఊహించలేము. అయితే ఈ దేశాల మధ్య సంధి కుదిరే మార్గాన్ని అన్వేషించడంలో ఐక్యరాజ్య సమితి విఫలం కావడం విడ్డూరం.

భారత్ లాంటి విదేశాంగ విధానాన్ని అనుసరించడమే అన్ని దేశాలకు శరణ్యమని వర్తమాన ప్రపంచ చరిత్ర నిరూపిస్తున్నది. భారత్ కూడా ఇతర దేశాల వలన, పొరుగు దేశాల వలన సుదీర్ఘ కాలం నుండి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. అయితే మన దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానం మన సార్వభౌమత్వాన్ని కాపాడుతున్నదనే చెప్పాలి. భారత దేశానికి, ఇతర దేశాలకు విదేశాంగ విధానాల్లో చాలా వ్యత్యాసముంది. అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి ఉండడం కూడా భారత్‌కు ప్రపంచంలో విశ్వసనీయత సంపాదించి పెట్టింది. అదే సందర్భంలో భారత దేశ శాంతి వచనాలు పరాయి పాలకులు అసమర్ధతగా భావించారు. అయితే క్రమేపీ భారత్ కూడా ఈ వాస్తవాన్ని గ్రహించి దూకుడుగా ముందుకు సాగతున్నది. చైనాపై దలైలామా పోరాటం చేయడం, విఫలం కావడం శరణార్ధిగా దలైలామా భారత్‌కు రావడం చైనాకు నచ్చడం లేదు. టిబెట్‌తో పాటు అరుణాచల్‌ప్రదేశ్ కూడా తమదేనంటూ చైనా ఆరోపించడాన్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది.

ఒకప్పుడు టిబెట్ స్వతంత్ర రాజ్యం. తర్వాత చైనా ఆధ్వర్వంలోని స్వయం ప్రతిపత్తిగల ప్రాంతంగా మారింది. అఫ్ఘానిస్తాన్‌లోని తాలిబన్ల మాదిరిగా చైనా కూడా బౌద్ధరామాలను ధ్వంసం చేసింది. భారత దేశానికి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇతర దేశాల వల్ల పీడించబడ్డ వారికి ఆశ్రయం కల్పించిన నేపథ్యం ఉంది. బంగ్లాదేశ్ విమోచనలో కీలక భూమిక పోషించడంలోను, టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ఆశ్రయం కల్పించడంలోను, అప్పటి పాలస్తీనా నాయకుడు దివంగత యాసర్ అరాఫత్‌కు మద్దతు ఇవ్వడంలోను, ఎల్‌టిటిఇ దాడుల నుండి శ్రీలంకను కాపాడంలోను భారత దేశం పోషించిన పాత్ర శ్లాఘనీయం. మన దేశ ప్రయోజనాలను సైతం ప్రక్కనబెట్టి బలహీన దేశాల పట్ల భారత దేశం చూపించిన ఔదార్యం చరిత్రకు అందని త్యాగాల సమాహారం. భారత దేశం అణ్వస్త్ర దేశమైనప్పటికీ మొదటగా తాను ఏ దేశంపైనా అణ్వస్త్రాలను ప్రయోగించబోనని భారత్ స్వీయ నియంత్రణ విధించుకుంది.

సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అడుగడుగునా భారత్ భద్రత కు ముప్పుగా మారిన పాకిస్తాన్‌తో ఎన్నో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుంది. పాక్ పాలకులు అన్ని ఒప్పందాలను కాలరాస్తూ భారత్‌ను ఇబ్బందులకు గురి చేశారు. పంజాబ్, కశ్మీర్‌లలో పాక్ దురాగతాలను చరిత్ర మరవదు. కశ్మీర్ యువతను రెచ్చగొట్టి భారత్‌పై విద్వేషాలను రగిలించడం, జిహాద్ పేరుతో ఉగ్రవాదులను తయారు చేసి ప్రజల ధన, మాన, ప్రాణాలతో చెలగాటమాడిన పాక్‌కు భారత ప్రభుత్వం సరైన గుణపాఠాలే నేర్పింది. ఉగ్రవాదుల కారణంగా జమ్మూకశ్మీర్ ఇప్పటికీ అభివృద్ధికి దూరంగా నెట్టబడింది. ఈ పరిస్థితుల దృష్ట్యా క్లిష్టతరమైనా కశ్మీర్ ప్రజలను ఇతర భారత ప్రజలతో సమానంగా జనజీవన స్రవంతిలో కలపాలనే ఆకాంక్షతో, అభివృద్ధి పథంలోకి కశ్మీర్ యువతను మళ్ళించాలనే ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నది. మన భూభాగాలను మనం కాపాడుకోవడానికి, ఉగ్రవాద పీడిత ప్రాంతాల ప్రజలకు శాంతి సుస్థిరతలతో కూడిన అభివృద్ధిని అందించడానికి జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం అనుసరించిన విధానం సరియైనదే.

ఏదిఏమైనప్పటికీ భారత్‌తో పాక్ శత్రుత్వం కొనసాగించడం, చైనాతో దాయాది దేశం గాఢమైన స్నేహం పాము పడగ నీడలో సేదతీరడం లాంటిది. భారత్ తో శత్రుత్వం పెట్టుకుని దశాబ్దాల తరబడి భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ చైనాతో అంటకాగడం వలన పాక్‌కు ఒనగూడిన ప్రయోజనం శూన్యం. తన దేశ ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని దుస్థితిలో పాకిస్తాన్ ఆర్ధిక సాయం కోసం ప్రపంచం ముందు సాగిలపడింది. భారత్ కు సరిహద్దునున్న పాక్, చైనాలు అణ్వస్త్ర సామర్ధ్యం కలిగి ఉన్నాయి.పాక్ తాను నాశనమైనప్పటికీ భారత్‌ను నాశనం చేయడానికి చైనాతో చేతులు కలిపింది. పాక్, చైనాకు ఒక సామంత రాజ్యంగా మారింది. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టుగా ఇండియా,- పాక్ విభేదాలతో పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా చైనా ఉచ్చులో పాక్ చిక్కుకుపోయింది.

భారత దేశానికి పొరుగునున్న శ్రీలంకలోకి అడుగుపెట్టాలని కూడా చైనా ప్రయత్నించిన మాట వాస్తవం. గతంలో ఎల్‌టిటిఇని అదుపు చేయాలనే నెపంతో శ్రీలంకలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నించిన చైనాకు అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. చైనాను నిలువరించి భారత దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవాలనే లక్ష్యంతోనే అప్పటి రాజీవ్ ప్రభుత్వం తన శాంతి సైన్యాన్ని శ్రీలంకకు పంపడం జరిగింది. భారత దేశం ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలనే కోరుకుం టున్నది. అయినప్పటికీ పొరుగు దేశాలు ఈర్ష్యాద్వేషాలతో భారత్ సమగ్రతకు చేటుగా పరిణమించడం శోచనీయం. కొట్లాటల వలన, యుద్ధాల వలన ఎవరికీ ఒనగూడే ప్రయోజనం ఉండదు.

ప్రజలే పరాజితులుగా మిగులుతారు. గతంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల పరిణామాలు ఈ విషయాన్నే నిరూపించాయి. ప్రాచీన కాలం లో యుద్ధాలన్నీ సంప్రదాయమైన ఆయుధాలతో జరిగేవి. ప్రస్తుతం అలాంటి పరిస్థితులులేవు. మరో ప్రపంచ యుద్ధం కనుక సంభవిస్తే అది మహాప్రళయానికే దారితీస్తుంది. ఇప్పటికే ప్రపంచంలో అనేక యుద్ధాలు జరిగాయి. రెండు మహా ప్రపంచ సంగ్రామాల పరిణామాలను ప్రపంచం చవిచూసింది. యుద్ధాల వలన ఏ దేశం బాగుపడిన చరిత్ర లేదు.అయినప్పటికీ జరిగిన యుద్ధాలను ఏ దేశమూ గుణపాఠంగా తీసుకోవడం లేదు.కొన్ని బలమైన దేశాలు బలహీన దేశాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం, మరి కొన్ని దేశాలు అసూయతో వర్ధమాన దేశాలను ఆర్ధికంగా ఎదగనీయకుండా అడ్డుకోవడానికి యత్నించడం యుద్ధ వాతావరణానికి కారణమవుతున్నది. ఇకనైనా యుద్ధాలకు స్వస్తి వాక్యం పలకాలి. ప్రపంచ దేశాలన్నీ అహం విడనాడి, తమ ప్రజలకు ఉత్తమ జీవన ప్రమాణాలను అందించడానికి కృషి చేయాలి.

సుంకవల్లి సత్తిరాజు
9704903463

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News