గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా మళ్లీ అట్టుడుకుతోంది. హమాస్ కీలక ఆయుధ స్థావరాలు, నేతలే లక్షంగా ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. గురువారం ఐడీఎఫ్ కు చెందిన విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు హమాస్‌కు చెందిన 40 స్థావరాలపై దాడులు నిర్వహించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇందులో హమాస్ స్పెషల్ ఫోర్స్ టెల్ సుల్తాన్ బెటాలియన్ కమాండర్ అహ్మద్ ఐయాద్ మహమ్మద్ ఫర్హాత్ హతమైనట్టు వెల్లడించారు. మహమ్మద్ ఫర్హాత్ హమాస్ ఇజ్రాయెల్‌పై అనేక దాడులకు పథక రచన చేసినట్టు, సైన్యాన్ని ముందుండి నడిపినట్టు తెలుస్తోంది.
అతడిని హతమార్చడంతో ఇజ్రాయెల్ మరో విజయం సాధించిందని ఐడీఎఫ్ పేర్కొంది. రఫా, ఖాన్ యూనిస్, మొరాగ్ కారిడార్ ప్రాంతాల్లో తమ దళాలు దాడులు చేయగా, పలువురు హమాస్ కార్యకర్తలు మృతి చెందినట్టు వెల్లడించింది. పెద్ద మొత్తంలో భూగర్భ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని తెలిపింది. బుధవారం వైమానిక దాడాలో కూడా దాదాపు 40 హమాస్ లక్షాలను నాశనం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటికే గాజాలో 50 శాతం భూభాగాన్ని అధీనం లోకి తెచ్చుకున్నట్టు పేర్కొంది