Wednesday, January 22, 2025

బీరుట్ విధ్వంసమే లక్ష్యమా?

- Advertisement -
- Advertisement -

గాజాలో సుమారు 40 వేల మందిని పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్, ఇప్పుడు లెబనాన్ రాజధాని బీరుట్‌పై పడింది. నేరుగా బాంబు దాడులకు పాల్పడుతూ రోజూ కొన్ని వందల మందిని హతమారుస్తోంది. ఉగ్రవాదుల ఏరివేత పేరిట జరుగుతున్న ఈ జనహననాన్ని అడ్డుకునే నాథుడెవరూ కనుచూపు మేరలో కనిపించడం లేదు. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్‌ను డ్రోన్ దాడిలో హతమార్చాక, హెజ్బొల్లాను సర్వనాశనం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రెట్టించిన ఉత్సాహంతో ప్రకటించారు.

ముఖ్యంగా హెజ్బొల్లాకు ఆర్థిక వనరులు సమకూర్చిపెట్టే ‘అల్ ఖర్ద్ అల్ హసన్’ అనే గ్రే మార్కెట్ బ్యాంక్‌ను దెబ్బకొట్టడం ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 30కి పైగా బ్రాంచీలు కలిగిన ఈ సంస్థకు, ఒక్క బీరుట్‌లోనే సగానికి పైగా శాఖలు ఉన్నాయి. వీటిపై దాడులకు ఉపక్రమించిన నెతన్యాహు, హెజ్బొల్లాకు ఆర్థిక సహకారం అందజేస్తున్న సంస్థలకు సమీపంలో ఉన్నవారు తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో భీతిల్లిన బీరుట్ ప్రజానీకం పిల్లాపాపలతో సురక్షిత ప్రదేశాలకు బయల్దేరుతుండగా, వారికి తగిన వ్యవధి అయినా ఇవ్వకుండా బాంబు దాడులు మొదలు పెట్టడం ఇజ్రాయెల్ తెంపరితనానికి నిదర్శనం.

గాజాలో హమాస్ పైన, లెబనాన్‌లో హెజ్బొల్లా పైన విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, ఈక్రమంలో వేలాది అమాయక ప్రజలు కన్నుమూస్తున్నా ఏమాత్రం పట్టనట్టు వ్యవహరించడం శోచనీయం. పశ్చిమాసియాలో తలెత్తిన ఎన్నో యుద్ధాలలో పైచేయి సాధించిన చరిత్ర కలిగిన ఇజ్రాయెల్ తిరుగులేని విధంగా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, శత్రువులెవరూ తనపై తేరిపారి చూసేందుకు కూడా భయపడే విధంగా ఎదిగింది. అయితే తాజాగా ఇజ్రాయెల్ అమలు చేస్తున్న యుద్ధ వ్యూహాలు బెడిసికొట్టే విధంగా ఉండటమే ఇక్కడ ఆశ్చర్యకరం. హమాస్, హెజ్బొల్లా అగ్రనేతలను పథకం ప్రకారం హతమార్చి, వాటి వెన్ను విరచాలన్న ఇజ్రాయెల్ పథకం పారేటట్లు కనిపించడం లేదు. వెస్ట్ బ్యాంక్‌లో హమాస్ మిలిటరీ వింగ్ నేత సలేహ్ అల్ అరౌరీను జనవరి 2న బీరుట్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. హమాస్‌కే చెందిన మరో అగ్రనేత ఇస్మాయిల్ హనియేను ఇరాన్ రాజధాని టెహరాన్‌లో జులై 30న హతమార్చింది. అదే రోజు రాత్రి హెజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫౌద్ షుక్‌న్రు బాంబు దాడి జరిపి చంపింది. ఆ తరువాత దాడుల ఉధృతిని పెంచి పలువురు హెజ్బొల్లా అగ్రనేతలను హతమారుస్తూ వస్తోంది.

తాజాగా యాహ్యా సిన్వర్‌ను సైతం మట్టుబెట్టింది. అయితే వీటివల్ల ఉగ్రవాదం సద్దుమణుగుతుందనుకోవడం భ్రమ మాత్రమే. అణచివేతలపై తిరుగుబాటు చేసే లక్ష్యంతో హమాస్, హెజ్బొల్లా సంస్థలు ఆవిర్భవించాయి. కేవలం అగ్రనేతలను హతమార్చినంత మాత్రాన అవి తుడిచిపెట్టుకుపోతాయనుకోవడాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం తప్పుపడుతున్నారు. దాడులు ఆగిన మరుక్షణం ఉగ్రవాదం మళ్లీ ఊపిరి పోసుకుంటుంది.ఉగ్రవాదులకు అఫ్ఘానిస్తాన్ కేంద్ర స్థావరంగా మారిందంటూ ఆ దేశాన్ని బాంబుదాడులతో ధ్వంసం చేసి, అల్‌ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చిన అమెరికా, చివరకు సాధించిందేమిటి? తిరిగి ఆ దేశాన్ని తాలిబన్ల చేతిలో పెట్టి తాను తప్పుకుంది. ఇప్పుడు తాలిబన్ల పాలనలో అక్కడి ప్రజలు కనీస సౌకర్యాలు సైతం మృగ్యమై దీనస్థితిలో జీవనం గడుపుతున్నారు. కేవలం స్వల్ప రాజకీయ ప్రయోజనాలను ఆశించి సాగిస్తున్న ఈ దమనకాండకు ఇకనైనా స్వస్తి పలకాలి.

ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్నా, బందీలను విడిపించుకోవాలన్నా చర్చలే సరైన పరిష్కార మార్గమని ఇజ్రాయెల్ ఇకనైనా గుర్తెరగాలి. బందీలను విడుదల చేస్తే తక్షణమే యుద్ధం ఆగుతుందని నెతన్యాహు చేసిన ప్రకటన నమ్మకం కలిగించేలా లేదు. హమాస్, హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థలను తుదముట్టిస్తానంటూ నెతన్యాహూ చేస్తున్న ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టడానికేనంటూ ఆ దేశ సైనిక రియర్ అడ్మిరల్ జనరల్ స్వయంగా వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం. ఉగ్రవాదుల ఏరివేత పేరిట సాగిస్తున్న యుద్ధంలో అమాయక ప్రజలు సమిధలుగా మారుతున్నా సభ్యదేశాలు మౌనం వహించడాన్ని చూస్తుంటే మనం నాగరిక ప్రపంచంలోనే ఉన్నామా అనే అనుమానం కలగకమానదు. బందీల విడుదలే తన ప్రధాన ధ్యేయమైతే, ఇకనైనా చర్చల ప్రక్రియకు సహకరించడం ద్వారా ఇజ్రాయెల్ తన నిజాయితీని నిరూపించుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News