Monday, December 23, 2024

గాజా అల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి

- Advertisement -
- Advertisement -

గాజా: గాజాలో హమాస్ ఉగ్రవాదులను తుడిచిపెట్టాలన్న దృఢ సంకల్పంతో ఆ నగరంపై ఎడతెరిపి లేకుండా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యాలు శుక్రవారం నగరంలో అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిపై బాంబుదాడులతో విరుచుకుపడింది. ఈ ఆస్పత్రి దిగువన హమాస్ ప్రధాన కమాండ్ స్థావరం ఉందని, దాన్ని గుర్తించామని ఇజ్రాయెల్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఈ ఆస్పత్రిపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో అక్కడ తలదాచుకుంటున్న పాలస్తీనియన్లలో ఒకరు చనిపోగా, పలువురు గాయపడినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. ఈ ఆస్పత్రిపైనే కాకుండా నగరంలోని ఇండోనేసియా ఆస్పత్రి, రంటిస్సీ చిన్న పిల్లల ఆస్పత్రి,

క్యాన్సర్ ఆస్పత్రిపైన కూడా ఇజ్రాయెల్ దాడులు చేసిందని, ఈ దాడుల్లో ఆ ఆస్పత్రులు కొంత మేరకు దెబ్బ తిన్నాయని కూడా ఆ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులు చాలా దూరం వెళ్లాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. ఇజ్రాయెల్ విరామం లేకుండా జరుపుతున్న దాడుల్లో పాలస్తీనియన్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని అన్న ఆయన అమాయక ప్రజలకు హానిని తక్కువ చేసి, మానవతా సాయం వారికి చేరడం ఎక్కువ చేయాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. మరో వైపు గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 11,078కి చేరిందని హమాస్ అధీనంలోని గాజా ప్రభుతం ప్రకటించింది.

యుద్ధం విస్తరణ అనివార్యమే: ఇరాన్
ఇదిలా ఉండగా గాజాలో ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల కారణంగా గాజాలో అమాయక పౌరుల మరణాలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితులను చూస్తుంటే యుద్ధం మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం ఖాయంగానే కనిపిస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్దుల్లా హెచ్చరించారు.‘ గాజాలో పౌరుల నివాసాలపై ఇజ్రాయెల్ తమ దాడులను నానాటికీ విస్తరిస్తోంది.అటు అమెరికా దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తూనే మరో వైపు తమ నౌకాదళాన్ని తూర్పు మధ్యధరా సముద్రంలో మోహరిస్తోంది. ఇదంతా చూస్తుంటే యుద్ధం మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం అనివార్యంగా కనిపిస్తోంది’ అని ఇరాన్ మంత్రి అన్నారు. ఖతర్ విదేశాంగ మంత్రితో ఫోన్‌లో సంభాషణ సందర్భంగా అమిరబ్దులాల ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News