Wednesday, January 22, 2025

గాజా గజగజ.. జనం విలవిల

- Advertisement -
- Advertisement -

విద్యుత్ కేంద్రంమూతతో అంధకారం
ఆహారం, మందులు, ఇంధన సరఫరాలకు బ్రేక్
సరిహద్దుల ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు
ఘర్షణ దశలో ముగ్గురు జర్నలిస్టులు హతం

గాజా : స్థానికంగా ఉండే ఏకైక విద్యుత్ కేంద్రం ఇప్పుడు పనిచేయకుండా పోయింది. దీనితో బుధవారం ఈ ప్రాంతం అంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని స్థానిక హమాస్ మీడియాను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. రెండు రోజుల క్రితమే గాజాస్ట్రిప్ మొత్తం బ్లాకేడ్ చేస్తామని హెచ్చరించింది. గాజాకు ఆహారం, ఇంధనం ఇతరత్రా సరఫరాలన్ని వెళ్లకుండా దిగ్బంధిస్తామని తెలిపింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ప్రాంతం ఇప్పుడు విద్యుత్ సరఫరాలేకపోవడంతో అంధకారం అయింది. విద్యుత్ కేంద్రం నిర్వహణకు అవసరం అయిన ఇంధన నిల్వలు క్రమేపీ అయిపోవడంతో ఈ స్టేషన్ ఇప్పుడు స్తంభించింది. ఇక ఇప్పుడు పాలస్తీనియా ప్రాంతంలో విద్యుత్ ఉండదు.

ఆహారధాన్యాలు అందవు, ఇంధన సరఫరా లేదని, అన్నీ నిలిచిపోతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ తెలిపారు. ఈ నెల 7వ తేదీన హమాస్ దాడుల తరువాత ఇజ్రాయెల్ గాజాస్ట్రిప్‌పై ఉక్కుపాదం మోపింది. ఓ వైపు ఈ 40 కిలోమీటర్ల విస్తీర్ణపు గాజాపట్టిపై ఎడతెగని రీతిలో వైమానిక దాడులు సాగిస్తూ వస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా ఇక్కడికి చివరికి మంచినీరు, ఔషధాలు కూడా అందకుండా చేయడంతో సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరం అయింది. గాజాకు సమీపంలోని ప్రాంతాలన్నింటిని పూర్తిగా నేలమట్టం చేసిన ఇజ్రాయెల్ సేనలు వీటిని కైవసం చేసుకుని, తాము విధించదల్చుకున్న బ్లాకేడ్‌ను మరింత కట్టుదిట్టం చేశాయి. దీనితో పాలస్తీనియన్లు తమ భూభాగంలో దాడులు తట్టుకోలేకుండా, బయటకు వెళ్లలేక చిక్కుపడ్డారు.

ఈజిప్టు, ఇజ్రాయెల్, మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని ఉండే ప్రత్యేక భౌగోళిక స్థితిని సంతరించుకుని ఉన్న గాజాస్ట్రిప్‌లో దాదాపు 23 లక్షల మంది పాలస్తీనియన్లు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతానికి ఈజిప్టు వైపు నుంచి మిగిలిన ఒక అనుసంధాన మార్గాన్ని కూడా ఇజ్రాయెల్ సేనలు మంగళవారం రాత్రిపూట జరిపిన వైమానిక దాడులలో ధ్వంసం చేశారు. దీనితో ఇతర ప్రపంచానికి గాజాస్ట్రిప్ ప్రాంతానికి సంబంధాలు తెగిపొయ్యాయి. పొరుగున ఉండే సురక్షిత ప్రాంతాలు దెబ్బతినడంతో పాలస్తీనియన్లు ఇప్పుడు కిక్కిరిసి ఉన్న ఐరాస స్కూళ్లు, ఇతరత్రా శిబిరాలలో తలదాచుకుంటున్నారు. శరణార్థులుగా మారిన పాలస్తీయన్లు తగు విధంగా సహాయం చేసేందుకు అవసరం అయిన మార్గాలను ఏర్పాటు చేయాలని మావవీయ సంస్థలు ఇజ్రాయెల్‌ను , హమాస్‌ను వేడుకుంటున్నాయి.

క్షతగాత్రులతో ఆసుపత్రులలో రద్దీ ఏర్పడింది. సరైన మందులు , ఆక్సిజన్ సరఫరాలు లేకుండా పోతున్నాయి. ఇప్పుడు తాము ఎక్కడికి వెళ్లినా భద్రంగా ఉండలేని పరిస్థితి ఏర్పడిందని , సామాన్యుడి పరిస్థితి మరీ దారుణంగా ఉందని జర్నలిస్టు హసన్ జాబర్ తెలిపారు. మంత్రులు, మీడియా అధికారులు, హోటల్స్ ఎక్కువగా ఉండే డౌన్‌టౌన్‌పై ఇజ్రాయెల్ కురిపించిన బాంబులతో ముగ్గురు పాలస్తీనియా జర్నలిస్టులు మృతి చెందారు. ఇప్పుడు తనకు తన ఉనికి గురించి భయం పట్టుకుందని జర్నలిస్టు జాబర్ చెప్పారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొన్ని ఇండ్లు, ఆసుపత్రులు, కార్యాలయాలలో జనరేటర్లు వాడుతున్నారు. అయితే ఇవి కూడా ఎక్కువ సమయం పనిచేయని స్థితి ఏర్పడింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News