Monday, December 23, 2024

హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టి.. బందీలను విడిపించిన ఇజ్రాయెల్ సైన్యం(వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్ సైన్యం డేరింగ్ ఆపరేషన్
మిలిటెంట్లకు ఎదురేగి 250 మంది బందీలకు విముక్తి
60 మంది హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టిన ఆర్మీ
సామాజిక మాధ్యమాల్లో ఐడిఎఫ్ వీడియో వైరల్
టెల్‌అవీవ్: హమాస్ మిలిటెంట్ల దాడి తర్వాత గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే 1500 మందికి పైగా మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు ప్రకటించింది. గాజాకు నీరు,విద్యుత్, ఇంధన సరఫరాలను సైతం పూర్తిగా నిలిపి వేసి హమాస్ స్థావరాలే క్షంగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సైనికులు హమాస్‌తో ఏ విధంగా పోరాటం చేస్తూ ఉన్నారో తెలియజేసే ఓ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్( ఐడిఎఫ్) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.‘ శనివారం ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందిని హమాస్ బందీలుగా చేసుకుంది. గాజా సరిహద్దుల్లో వారిని బంధించిందనే సమాచారంతో ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడిఎఫ్)హమాస్ మిలిటెంట్ స్థావరాలపై దాడి చేసి బందీలను సురక్షితంగా విడిపించాయి.

ఈ దాడులో ్ల60 మంది మిలిటెంట్లను ఐడిఎఫ్ మట్టుబెట్టింది.హమాస్ దక్షిణ నేవీ కమాండర్ డిప్యూటీ కమాండర్ ముహమ్మద్ అబూ ఆలీ సహా 26 మంది మిలిటెంట్లను మా దళాలు అదుపులోకి తీసుకున్నాయి’ అని ఆ ట్వీట్‌లో తెలిపింది.ఐడిఎఫ్ దళాలు ఉగ్రవాదులు నక్కి ఉన్నగదుల్లోకి తూటాల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. అనంతరం వారిని బైటికి రప్పించడానికి గ్రనేడ్‌తో దాడి చేసి బంధించాయి. దాడిలో పాల్గొన్న ఓ ఇజ్యాల్ సైనికుడి బాడీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డు అయ్యాయి. ఈ వీడియోను ఇజ్రాయెల్ సైన్యం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైరల్ అయింది.

24 గంటల్లో గాజాను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్ హెచ్చరిక
ఇదిలా ఉండగా హమాస్ చెరలో ఇంకా దాదాపు 150 మంది ఇజ్రాయెల్, ఇతర దేశాల పౌరులు బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని టన్నెళ్లలో బంధించినట్లు తెలుస్తోంది. వారికి విడిపించడానికి ఇజ్రాయెల్ గౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే గాజాలోని పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 24 గంటల్లో ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షల మంది పౌరులు ఆ ప్రాంతాన్ని వీడాలని ఐడిఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. హమాస్ మిలిటెంట్లు పౌరులను రక్షణ కవచాలుగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని, రాబోయే రోజుల్లో గాజానగరంపై ఐడిఎఫ్ దాడులను పెంచనుందని, ఇందులో అమాయకులైన పౌరులకు నష్టం వాటిల్లకూడదని కోరుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ విషయాన్ని తాము ఐక్యరాజ్య సమితికి కూడా తెలియజేసినట్లు పేర్కొంది. ఈ ప్రకటన ఇప్పటికే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న పాలస్తీనియన్లలో మరింత భయాందోళనలను రేకెత్తిస్తోంది. అయితే ఈ ఆదేశాలపై ఐక్యరాజ్య సమితి తీవ్ర అభ్యంతరాలు తెలియజేసింది. ఈ పరిణామాలు దారుణమైన మానవతా సంక్షోభాన్ని సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో స్కూళ్లు, క్లినిక్‌లు నడుపుతున్న ఐరాస కేంద్రాలు, సిబ్బంది కూడా ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి ఉంటుందని, ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామని ఐరాస పేర్కొంది.

అంతేకాకుండా ఆస్పత్రుల్లోని క్షతగాత్రులను, ఇతర రోగులను తక్షణం తరలించడం సాధ్యం కాని పనని వైద్యులు అంటున్నారు. ఉత్తర గాజాలో హమాస్ మిలిటెంట్లు టన్నెళ్లలో దాగి ఉన్నారని, వారిని పట్టుకునేందుకే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఐడిఎఫ్ పేర్కొంది. తాజా పరిణామాలను గమనించినట్లయితే గాజాపై గ్రౌండ్ ఆపరేషన్‌కే ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఆస్పత్రులు, సూళ్లు, పౌరనివాసాలపై దాడులు జరపకుండా సైన్యం రక్షణ కల్పిస్తుందా అన్న విలేఖరుల ప్రశ్నలకు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి హగరీ సమాధానమిస్తూ అది ‘వార్ జోన్’ అని చెప్పారు. కాగా ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటికే దాదాపుగా 4.23 లక్షల మంది గాజా ప్రాంతంలోని తమ ఇళ్లను చేసి పారిపోయారని ఐరాస వర్గాలు అంటున్నాయి.

ఆరు రోజుల్లో ఆరు వేల బాంబులు
ఇప్పటివరకు గాజాలోని 3,600 హమాస్ స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. ఆరు రోజుల్లోనాలుగు వేల టన్నుల బరువున్న 6,000కు పైగా బాంబులను గాజాపై జారవిడిచినట్లు తెలిపింది. మరో వైపు యుద్ధంలో ఇజ్రాయెల్ వైట్ ఫాస్పరస్ బాంబులను ఉపయోగిస్తున్నట్లు న్యూయార్క్‌కు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ అనే సంస్థ ఆరోపించింది. ఇవి పౌరులపై దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ నెల 10న లెబనాన్‌పై, 11న గాజాపై ప్రయోగించిన ఆయుధాలకు సంబంధించిన వీడియోలను పరిశీలించామని, వీటిలో వైట్ ఫాస్పరస్ ఆనవాళ్లు ఉన్నాయని ఆ సంస్థ ఆరోపించింది. అయితే ఇజ్రాయెల్ సైన్యం మాత్రం తాము గాజాలో వైట్‌ఫాస్ఫరస్ బాంబులను ప్రయోగించలేదని తెలిపింది. ఇదిలా ఉండగా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 13 మంది బందీలు మృతి చెందినట్లు హమాస్ ప్రకటించింది. వారిలో విదేశీయులు కూడా ఉన్నట్లు తెలిపింది. అయితే వారి జాతీయతను వెల్లడించలేదు. ఈ ప్రకటనపై ఇజ్రాయెల్ సైతం స్పందించాల్సి ఉంది.

శవాలతో నిండిపోయిన గాజా ఆస్పత్రి శవాల గది
మరో వైపు ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా చనిపోతున్న వారి మృతదేహాలతో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన షఫియా ఆస్పత్రి శవాల గది నిండి పోయింది. మృతదేహాలను బంధువులు తీసుకువెళ్లేదానికన్నా వస్తున్న శవాల సంఖ్య కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోవడంతో ఆస్పత్రి శవాల గది ఇప్పుడు ఓ స్మశాన వాటికలా మారిపోయిందని ఆస్పత్రిలో పని చేసే ఎలియాస్ షొబాకీ అనే నర్సు చెప్పారు. ఆస్పత్రి శవాల గదిలో మృతదేహాలు ఒకదాని పక్కన ఒకటిగా ఎక్కడ పడితే అక్కడ పడి ఉండడం కనిపిస్తోంది. మరో వైపు గాజా ప్రాంతానికి ఇజ్రాయెల్ నీరు, విద్యుత్‌తో పాటుగా ఇంధన సరఫరాలు సైతం నిలిపివేయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. అంబులెన్స్‌లు క్షతగాత్రుల వద్దకు వెళ్లలేకపోతున్నాయని, క్షతగాత్రులు ఆస్పత్రులకు, మృతి చెవదిన వారు శవాల గదికి వెళ్లలేని పరిస్థితి ఉందని గాజా ఆరోగ్య శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.

అమెరికా అన్ని విధాలా సాయం
ఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌హమాస్ పోరు మరింత ఉధృతం అవుతున్న నేపథ్యంలో అమెరికా తన మిత్రుడైన ఇజ్రాయెల్‌కు అవసరమైన సాయమల్లా చేస్తోంది. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతానికి ఒక యుద్ధ నౌకను తరలించిన అమెరికా మరో విమాన వాహక నౌకను కూడా పంపిస్తోంది వర్జీనియాలోని నోర్ఫోక్‌నుంచి ఇది శుక్రవారం బయలుదేరుతోంది. మధ్య ప్రాచంలోని అమెరికా మిలిటరీ స్థావరాలకు ఈ నౌక చేరుకోనుంది. లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంపట్ల, ఇరాన్, ఇతర దేశాలు పరిస్థితిని తమకు అనుకూలంగా మల్చుకోకుండా చూడడం కోసమే ఈ యుద్ధ నౌకలను అమెరికా పంపిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే డజన్ల సంఖ్యలో యుద్ధ విమానాలు, పెద్ద సంఖ్యలో ఆయుధాలను కూడా అమెరికా ఇజ్రాయెల్‌కు అందజేస్తోంది. మరో వైపు ఇజ్రాయెల్ అవసరాలను తెలుసుకోవడం కోసం అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ శుక్రవారం ఇజ్రాయెల్‌కు వస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ఆర్డర్ ఇచ్చిన ఆయుధాల తయారీ, అప్పగింతను వేగవంతం చేయాలని అమెరికాలోని రక్షణ కంపెనీలను ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది. వీటిలో ప్రధానంగా ఐరన్‌డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News