Tuesday, March 4, 2025

కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ తూట్లు

- Advertisement -
- Advertisement -

యుద్ధోన్మాదంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సంధియత్నాలు రుచించడం లేదు. కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి అన్న చందంగా కాల్పుల విరమణ ఒప్పందానికి కొత్త భాష్యాలు చెబుతూ గాజాపై మరోసారి మారణహోమానికి పాల్పడేందుకు దారులు వెతుకుతున్నారు. మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగమైన తొలి దశ శనివారంతో ముగియగా, సరిగ్గా ఒక రోజు ముందు ఆయన అడ్డం తిరిగి, రెండో దశ ఒప్పందంపై చర్చలను అయోమయంలోకి నెట్టివేశారు. తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని రంజాన్ మాసం ముగిసేవరకూ కొనసాగించాలంటూ కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.

అంతేకాదు, రెండో దశ ఒప్పందంపై చర్చలు మొదలుపెట్టిన తొలి రోజునే హమాస్ తన వద్ద ఉన్న బందీల్లో సగం మందిని విడచిపెట్టాలని పట్టుబడుతున్నారు. హమాస్ అధీనంలో ఇప్పటికీ 59మంది బందీలు ఉన్నారు. వీరిలో 24మంది సజీవంగా ఉండగా, మిగిలిన 35మందిని ఏనాడో హమాస్ ఉగ్రవాదులు హతమార్చారు. ఆరువారాల మొదటి దశ కాల్పుల విరమణ మార్చి 1తో ముగిసింది. ఈలోగా గాజానుంచి ఇజ్రాయెల్ దళాలు పూర్తిగా వైదొలగి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చెట్టుకొకరు, పుట్టకొకరుగా తరలిపోయిన గాజావాసులు స్వస్థలాలకు తరలివచ్చేందుకు మార్గం సుగమం చేయాలన్నది ఇరువర్గాల మధ్య కుదిరిన ఒడంబడిక. అలాగే గాజాకు మానవతాసాయం పెంచాలన్నది కూడా ఒప్పందంలో ఒక భాగం.

అయితే, ఇప్పటికీ గాజాలోని కొన్ని ప్రాంతాలనుంచి సైనిక దళాల ఉపసంహరణ చేపట్టకుండా నాన్చుడు ధోరణి కనబరుస్తున్న ఇజ్రాయెల్, మరికొంతకాలం గాజాను తమ అధీనంలో ఉంచుకునేందుకే ఈ ఎత్తుగడ వేసిందన్నది హమాస్ ఆరోపణ. తమ కొత్త ప్రతిపాదన అమలు దిశగా హమాస్ పై ఒత్తిడి పెంచేందుకు గాజాకు అందుతున్న మానవతాసాయాన్ని ఇజ్రాయెల్ ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. అంతేకాదు, గాజా-ఈజిప్ట్ సరిహద్దుల్లో మోహరించిన తమ సైన్యాన్ని వెనక్కు రప్పించే యోచనను విరమించుకుంటున్నట్లు కూడా ప్రకటించింది. ఈ పరిమాణం పట్ల ఐక్యరాజ్య సమితి సైతం ఆగ్రహం వెలిబుచ్చినా నెతన్యాహు ఖాతరు చేయడం లేదు.

కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన ఈ ఆరువారాల్లోనూ అందు కు ఇజ్రాయెల్ పూర్తిగా కట్టుబడిన దాఖలాలు కూడా లేవు. అనేక సందర్భాల్లో గాజాపై వైమానిక దాడులు జరపడం, స్వస్థలాలకు చేరుతున్న పాలస్తీనియన్లకు అడుగడుగునా అడ్డుపడటం వంటి అకృత్యాలకు పాల్పడుతూనే ఉంది. తమ తాజా ప్రతిపాదనకు అమెరికా మద్దతు ఉందని నెతన్యాహు చెప్పుకుంటున్నప్పటికీ, ఈ విషయంలో అగ్రరాజ్యం తన వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదు. తనను తాను శాంతిదూతగా అభివర్ణించుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్.. ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం తాలూకు ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నారు.

ఈ నేపథ్యంలో తాజా పరిణామాల పట్ల ఆయన వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. మిత్రదేశాలతోనూ కోరి శత్రుత్వం కొని తెచ్చుకుంటున్న అగ్రరాజ్యాధినేత, తన చిరకాల మిత్రదేశం ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒడంబడికకు తూట్లు పొడుస్తుంటే సహిస్తారా లేక చీవాట్లు పెడతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామంటూ తెలివిమాలిన ప్రకటనలు చేస్తూ, గందరగోళాన్ని మరింత పెంచిపోషిస్తున్న ట్రంప్ మహాశయుడు కాల్పు ల విరమణకు కట్టుబడేలా ఇజ్రాయెల్ ను దారికి తెస్తే, శాంతికాముకుల ప్ర శంసలు పొందగలుగుతారనడంలో సందేహం లేదు.

అయితే స్వప్రయోజనాలకు, స్వలాభాలకు మాత్రమే పెద్దపీట వేస్తున్న ట్రంప్ గాజావాసుల మనోభావాలను అర్థం చేసుకుంటారని, ఒప్పందానికి కట్టుబడేలా ఇజ్రాయెల్ మెడలు వంచుతారనీ ఆశించలేం. రష్యాతో యుద్ధానికి తెరదించేలా ఉక్రెయిన్ పై ఒత్తి డి తెచ్చి, పనిలో పనిగా ఆ దేశంలో అరుదైన ఖనిజాల వెలికితీత పనుల తాలూ కు కాంట్రాక్టును సాధించేందుకు ప్రయత్నించిన ట్రంప్.. ఇజ్రాయెల్‌తో కోరి విభేదాలు కొని తెచ్చుకునే అవకాశం లేదు. హమాస్ తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్, గత ఏడాదిన్నర కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయల ఆయుధాలను అమెరికానుంచి కొనుగోలు చేసిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. మరో విషయం ఏమిటంటే, గాజాలో శాశ్వత శాంతి కోసం చర్చలు జరుగుతు న్న ప్రస్తుత సమయంలో 300 కోట్ల డాలర్ల విలువైన ఆయుధ సంపత్తిని ఇజ్రాయెల్ కు విక్రయించేందుకు అమెరికా అంగీకరించడం తాజా పరిణామం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News