Saturday, January 18, 2025

ఆగని విధ్వంసకాండ

- Advertisement -
- Advertisement -

పశ్చిమాసియాలో ఏడు నెలల కిందట రగుల్కొన్న రావణకాష్టం ఇప్పట్లో చల్లారేటట్లు లేదు. హమాస్ దాడులను సాకుగా చేసుకుని గాజా, రఫా నగరాలను సర్వనాశనం చేసేంతవరకూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగేటట్లు లేరు. యుద్ధ విరమణ దిశగా తాజాగా చేపట్టిన చర్చలు ఒక కొలిక్కి వచ్చాయనుకుంటున్న సందర్భంలో, మళ్లీ ఇజ్రాయెల్ పాత పాటే పాడటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఈజిప్టు, ఖతార్ ప్రతినిధుల మధ్యవర్తిత్వంలో కైరోలో జరిగిన చర్చల్లో ఆశాజనకమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మధ్యవర్తులు ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ సమ్మతి తెలపడంతో ఇక యుద్ధానికి తెర దిగిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఉరమని పిడుగులా ఆఖరి నిమిషంలో ఇజ్రాయెల్ అడ్డం తిరిగింది.

తాము ఆశించిన డిమాండ్లు నెరవేరే విధంగా చర్చలు సాగనందున ఈ ప్రతిపాదనలు తమకు సమ్మతం కావని, రఫాలో హమాస్ లక్షిత దాడులు కొనసాగుతాయని తెగేసి చెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, తదుపరి చర్చలకు తమ ప్రతినిధులను పంపుతామనడం ఆయనలోని రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. గాజా నుంచి తమ సేనలు వైదొలగితే హమాస్ దళాలు తమ సాయుధ, మిలిటరీ సంపత్తిని పెంపొందించుకుని, మళ్లీ ఇజ్రాయెల్ పౌరులపై దాడులకు దిగుతాయన్నది నెతన్యాహు వాదన. రఫాపై దాడులకు ఇజ్రాయెల్ మంత్రివర్గం ఏకగ్రీవ ఆమోదం తెలపడంతో నెతన్యాహు తన సేనలను రఫా దిక్కుగా నడపిస్తున్నారు. ఇప్పటికే గాజాస్ట్రిప్ వైపున ఉన్న రఫా సరిహద్దులను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్ సేనలు హమాస్ ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా దాడులకు సిద్ధపడుతోంది. ఇందులోభాగంగా రఫాలో తలదాచుకుంటున్న శరణార్థులలో లక్షమందిని ఖాళీ చేయిస్తోంది. దాడులు తీవ్రతరమైతే, గాజా మాదిరిగానే రఫాలోని అమాయక ప్రజలు సమిధలవుతారన్నది నిర్వివాదాంశం.

‘ఏ దేశం సహకరించకపోయినా, అంతర్జాతీయ వేదికలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మమ్మల్ని మేం రక్షించుకోకుండా ఎవరూ ఆపలేరు’ అంటూ నిస్సిగ్గుగా ప్రకటించిన ఇజ్రాయెల్ అధినేతకు నియంత, నిరంకుశుడు వంటి బిరుదులు చాలకపోవచ్చు. ఒకవైపు చర్చలు జరుగుతున్న సమయంలో ఉభయ పక్షాలూ సంయమనం పాటించడం కనీస ధర్మం. అయితే హమాస్ ఇందుకు తిలోదకాలు వదలి, కీరమ్ షెలోమ్ సరిహద్దు క్రాసింగ్‌పై క్షిపణులు ప్రయోగించింది. ఈ సంఘటనలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు బలికావడంతో సహజంగానే పొరుగు దేశం భగ్గుమంది. రఫా వైపు నుంచి 14 రాకెట్లతో తమ సరిహద్దుల వైపు దాడి చేశారని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ దాడికి తమదే బాధ్యతని హమాస్ అంగీకరించిన నేపథ్యంలో ఆ సరిహద్దులను ఇజ్రాయెల్ మూసివేసింది.ఆకలితో అలమటిస్తున్న గాజావాసులకు ఆహారాన్ని, ఇతర సహాయక సంపత్తిని అందజేసేందుకు ప్రస్తుతం ఇదొక్కటే ప్రధాన మార్గం కాగా, దీనిని కూడా ఇజ్రాయెల్ మూసివేయడంతో గాజావాసుల పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలోకి పడినట్లయింది.

ప్రస్తుత పరిణామాలతో, ఇంతవరకూ ఇజ్రాయెల్‌కు కొమ్ముకాసి, అపార ఆయుధ సంపత్తిని సరఫరా చేసిన అమెరికా పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది. రఫాపై ఇజ్రాయెల్ దాడులు చేసి నరమేధం సాగించిన పక్షంలో ఆ పాపంలో తాను కూడా భాగం పంచుకోవలసి వస్తుందని, ప్రపంచ దేశాలనుంచి నిరసనలు ఎదురవుతాయని భావించడంతో మిత్రదేశంపై ఆంక్షలు విధించే దిశగా ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ రక్షణ బలగాలలోని ఓ విభాగంపై ఆంక్షలు విధించిన అగ్రదేశం, మరికొన్ని సంస్థలపైనా కొరడా ఝళిపించేందుకు ఆయత్తమవుతోంది. రఫాలో భూతల దాడులకు దిగితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని, ఇకపై తమ సహకారం ఏమాత్రం ఉండబోదని కూడా మిత్రదేశాన్ని హెచ్చరించింది.అయితే, దేశంలో అంతర్గత రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకున్న నెతన్యాహు రఫాపై దాడులు కొనసాగించేందుకే నిర్ణయించుకున్నారు. ఎవరు సహకరించినా లేకపోయినా ముందుకే వెళ్తామంటూ ఆయన చేసిన ప్రకటన అందులో భాగమే.

రఫాపై ఇజ్రాయెల్ జరిపే దాడులవల్ల మారణహోమం తప్పదని ఐక్యరాజ్య సమితి అందోళన చెందుతోంది.వివిధ అంతర్జాతీయ సంస్థలనుంచి అందుతున్న ఆహార, ఔషధాల నిల్వలను రఫాలోని గోదాములలో నిల్వ చేశారు. అక్కడి ఆస్పత్రులు కూడా క్షతగాత్రులతో నిండి ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులు మొదలుపెడితే ఈ గోదాములు, ఆస్పత్రులు కూడా ధ్వంసం కాక మానవు. అదే జరిగితే రఫాలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ జరిగే ప్రాణనష్టం ఊహించుకోవడానికే భయంగా ఉంది. రఫాలోని హమాస్ స్థావరాలపై మాత్రమే దాడులు జరుపుతామని, అమాయకుల ప్రాణాలకు హాని తలపెట్టబోమని ఇజ్రాయెల్ చెబుతున్నా శ్మశానాన్ని తలపిస్తున్న గాజా నగరాన్ని చూశాక, ఇజ్రాయెల్ రఫాలో మడి కట్టుకుని కూర్చుంటుందంటే నమ్మే వెర్రివాళ్లెవరూ లేరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News