టెల్ అవీవ్ : గాజా స్ట్రిప్‌లోకి అన్ని వస్తువుల ప్రవేశాన్ని, సప్లయిలను ఇజ్రాయెల్ ఆదివారం నిలిపివేసింది. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించాలన్న కొత్త ప్రతిపాదనను హమాస్ ఒప్పుకోకపోతే ‘మరిన్ని పరిణామాలు తప్పవు’ అని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందాన్ని భగ్నం చేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని హమాస్ ఆరోపించింది. సహాయాన్ని నిలిపివేయాలన్న ఇజ్రాయెల్ నిర్ణయం ‘చౌకబారు దోపిడీ, యుద్ధ నేరం, శాంతిపై దాడి’ అని హమాస్ విమర్శించింది. ఏడాది పైగా సంప్రదింపులు సాగిన అనంతరం జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, ఆ ఒప్పందం ముగిసిందని చెప్పకుండా ఉభయ పక్షాలు పరస్పర ఆరోపణలకు దిగాయి.
మానవతావాద సహాయం పెంపు కూడా భాగంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశ శనివారం ముగిసింది. రెండవ దశపై ఉభయ పక్షాలు సంప్రదింపులను ఇంకా ప్రారంభించవలసి ఉంది. రెండవ దశలో ఇజ్రాయెలీ సేనల ఉపసంహరణ, చిరకాల కాల్పుల విరమణకు ప్రతిగా తమ వద్ద ఇంకా మిగిలి ఉన్న డజన్ల కొద్దీ బందీలను హమాస్ విడుదల చేయవలసి ఉంది. ప్రస్తుత ఒప్పందాల కింద సంప్రదింపులు సంతృప్తికరంగా లేవని తాము భావించిన పక్షంలో మొదటి దశ తరువాత ఇజ్రాయెల్ యుద్ధాన్ని తిరిగి ప్రారంభించవచ్చునని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. హమాస్ బందీలను విడుదల చేసి, ‘ఉచిత మధ్యాహ్న భోజనాలు ఇక ఎంత మాత్రం ఉందవ’ని తన మంత్రివర్గంతో చెప్పినట్లయితేనే కాల్పుల విరమణ కొనసాగుతుందని నెతన్యాహు స్పష్టం చేశారు.