జెరూసలెం: పదిహేను నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఇజ్రాయెల్‌హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చినట్టు అధికారిక వర్గాలు వెల్లడించిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ గాజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమలు లోకి రానున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ గాజాపై పెద్ద ఎత్తున విరుచుకుపడడం స్థానికులు భయభ్రాంతులకు గురైనట్టు సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది. దాడిలో పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలగా, పలువురు గాయపడినట్టు పేర్కొంది.
ఇజ్రాయెల్ దాడుల్లో ఇంతవరకు 46 వేల మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ యుద్ధాన్ని నివారించడానికి అనేక దేశాలు కృషి చేస్తున్నాయి. ఖతార్ మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్టు హమాస్ తెలిపింది. అయితే ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. మరోవైపు తాజా ఒప్పందానికి నెతన్యాహు క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమలు లోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ప్రకటించారు.