Friday, December 20, 2024

గాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడి

- Advertisement -
- Advertisement -

హమాస్ వైమానిక దళ కమాండర్ హతం: ఐడిఎఫ్
9,800 దాటిన మృతుల సంఖ్య
కాల్పుల విరమణకు అంగీకరించే ప్రసక్తే లేదు: నెతన్యాహు

డీర్ అల్ బలా(గాజా) హమాస్ ఉగ్రసంస్థ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడులతో విరుచుకుపడుతోంది. వారం రోజులుగా గాజాపై విరుచుకుపడుఉన్న ఇజ్రాయెల్ హమాస్‌ను తుదముట్టించడమే లక్షంగా యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఇక ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలోని దాదాపు 8 లక్షల మంది పాలస్తీనియన్లు ఉత్తర ప్రాంతాన్ని వదిలిపెట్టి తూర్పు ప్రాంతానికి పారిపోయారు. ఇక ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య 9,800 దాటడం ఆందోళన కలిగిస్తోంది.అక్టోబర్ 7 ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడుల అనంతరం మూడు వారాలుగా జరుగుతున్న దాడులు, ప్రతిదాడుల్లో వేలాది మంది మరణించారు. వీరిలో హమాస్ దాడుల అనంతరం ఇజ్రాయెల్‌లో 1400 మంది చనిపోగా, గాజాపై గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర వైమానిక, భూతల దాడుల్లో పాలస్తీనాలో 8,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇదిలా ఉండగా, గాజాపై మంగళవారం ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు జరిపిన దాడుల్లో ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై దాడులకు పథక రచన చేసిన హమాస్ కమాండర్‌ను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాల( ఐడిఎఫ్)అధికార ప్రతినిధి డేనియల్ హగారీ ఎక్స్(గతంలో ట్విట్టర్)లో పోస్టు చేశారు.‘షిన్‌బెట్ అందించిన ఇంటెలిజన్స్ సమాచారం ఆధారంగా హమాస్ మిలిటెంటు గ్రూపు కీలక స్థావరాలపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు దాడి చేశాయి. ఈ దాడుల్లో హమాస్ నార్తర్న్ డివిజన్ కమాండర్ నసీమ్ అబు అజినా మరణించినట్లు ఇజ్రాయెల్ ఇంటెలిజన్స్ వర్గాలు ధ్రువీకరించాయి.అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోని కిబ్బుట్జ్,నెతివ్ హసారా ప్రాంతాలపై హమాస్ మిలిటెంట్ల దాడుల వెనుక మాస్టర్‌మైండ్ నసీమ్’ అని ఆ ట్వీట్‌లో తెలిపారు.నసీమ్ అబు హమాస్ వైమానిక దళానికి నాయకత్వం వహిస్తున్నాడని ఐడిఎఫ్ తెలిపింది. ఇతని పర్యవేక్షణలోనే అక్టోబర్ 7న పారా గ్లైడర్లు, డ్రోన్ల సాయంతో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేశారని వెల్లడించింది.

కాల్పుల విరమణకు నో: నెతన్యాహు
మరో వైపు హమాస్ మిలిటెంట్లతో కాల్పుల విరమణకు అంగీకరించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.అదే జరిగితే ఉగ్రవాదుల ముందు ఇజ్రాయెల్ లొంగిపోవాలని చెప్పినట్లవుతుందని అన్నారు.హమాస్ ఉగ్రవాదులను తుదముట్టించే ప్రయత్నంతోనే ముందుకు సాగుతామని ఆయన పునరుద్ఘాటించారు. ఏ యుద్ధమైనా సామాన్య పౌరుల ప్రాణాలను కోరుకోదన్నారు. గాజాలో ఇజ్రాయెల్ చేస్తోన్న యుద్ధం నాగరికతకు, అనాగరికతకు మధ్య జరుగుతున్న పోరని ఆయన చెప్పారు.హమాస్‌తో యుద్ధం జరుగుతున్న వేళ ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రవేశపెట్టిన ‘మానవతా సంధి’ తీర్మానం లోపభూయిష్టంగా ఉందని నెతన్యాహు పేర్కొన్నారు.ఇజ్రాయెల్‌లో జరిగినటువంటి దారుణాలను ఏనాగరిక దేశమూ సహించదని అన్నారు. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News