Saturday, December 21, 2024

ఎంఎన్‌సిలకు యుద్ధం సెగ!

- Advertisement -
- Advertisement -

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంట ఇదేనేమో! ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో హమాస్‌కు ఇజ్రాయెల్‌కు మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ముస్లిం దేశాలన్నీ కలిసి పాశ్చాత్య దేశాల వస్తువులను కొనుగోలు చేయరాదని నిర్ణయించాయి. దీని ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిపెద్ద బహుళ జాతి సంస్థలపై పడింది. అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. దీంతో పలు దేశాల్లో ఉద్యోగాల్లో కోత విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి సుమారు 1,200 మందిని చంపి.. 250 మందిని కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మద్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఇజ్రాయెల్ గాజాను నేల మట్టం చేసింది. సుమారు 30 వేల కంటే ఎక్కువే మంది చనిపోయారు. వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. అలాగే లక్షలాది మంది గాయపడ్డారు. ప్రస్తుతం వారికి వైద్య సదుపాయాలు లేవు. తినడానికి తిండి లేదు. ఉండటానికి ఇళ్లు లేకుండా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన గుడారాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

ఇవన్నీ ముస్లిం దేశాలకు ఆగ్రహం తెప్పిస్తాయనడంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. దీంతో ముస్లిం దేశాలు ఎక్కువగా ఉండే ఆగ్నేయాసియా, పశ్చియ ఆసియా ప్రజలు పాశ్చాత్య దేశాల వస్తువులను బాయ్‌కాట్ చేయాలని పిలుపు ఇచ్చారు. దీంతో బహుళ జాతి కంపెనీల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. బాయ్‌కాట్ ఎంఎన్‌సి పిలుపుఇవ్వడంతో స్టార్‌బక్స్, మెక్‌డొనాల్డ్ యూనీలీవర్ వ్యాపారం ఆగ్నేయాసియా, పశ్చిమ ఆసియాలో బాగా పడిపోయాయి. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాకు చెందిన ఫ్రాంచైజీ ఆపరేటర్ అమ్మకాలు తగ్గడంతో సిబ్బందిని తగ్గించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. గాజా వార్ ప్రభావం తమ సేల్స్‌పై కనిపిస్తోందని వివరించారు. కేవలం స్టార్‌బక్స్ మాత్రమే కాదు. మెక్‌డొనాల్డ్ యూనీలీవర్‌ల అమ్మకాలు కూడా బాగా తగ్గిపోయాయి. గాజాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డం చూసిన తర్వాత ముస్లిం దేశాలు పాశ్చాత్య దేశాల ఉత్పత్తుల కొనుగోలు చేయరాదని నిర్ణయించాయి. దీంతో పాశ్చాత్య దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. ఉదాహరణకు స్టార్‌బక్స్, మెక్‌డొనాల్డ్ యూనీలీవర్ అమ్మకాలు పశ్చిమాసియాతో పాటు ఇతర ఇస్లామిక్ దేశాలతో పాటు ఆగ్నేయాసియాలో అమ్మకాలు బాగా తగ్గిపోయాయి.

ఈ దేశాల్లోని ప్రజలు అతి పెద్ద కంపెనీల ఉత్పత్తుల కొనుగోళ్లను నిలిపి వేశారు. దీంతో కంపెనీలు కూడా పెద్ద ఎత్తున లే ఆఫ్‌లు ప్రకటించేశాయి. ఉదాహరణకు కువైట్‌కు చెందిన అల్‌షయా గ్రూపును తీసుకుంటే దేశంలోని తమ స్టోర్‌లలో పెద్ద ఎత్తున లే ఆఫ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గత బుధవారం నాడు కంపెనీ సిఇఒ సిఎన్‌ఎన్‌కు చెప్పారు. గాజాలో పరిస్థితులు దారుణంగా తయారైన తర్వాత ఈ పరిస్థితి మొదలైంది అన్నారు. వాస్తవానికి గత మంగళవారం నాడు రాయిటర్స్ వార్తా సంస్థ అల్‌షయా గ్రూపు కంపనీ స్టార్‌బక్స్ బ్రాండ్ ఫ్రాంచైజీ తమ సంస్థ నుంచి సుమారు 2,000 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అల్‌షయా గ్రూపు మాత్రం ఈ సంఖ్యను నిర్ధారించలేదు. కాగా ఈ కంపెనీలో సుమారు 50 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కనీసం 4% మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉందని కంపెనీ వర్గాలే చెబుతున్నాయి. ఇక స్టార్‌బక్స్‌ను తీసుకుంటే మధ్యప్రాచ్యంతో పాటు ఉత్తర ఆఫ్రికాలోని 11 దేశాల్లో సుమారు 1,900 స్టోర్‌లు నిర్వహిస్తోంది. సుమారు 19 వేల మంది ఈ స్టోర్‌లలో పని చేస్తున్నారు. అయితే ఈ ఏడాది జనవరిలో స్టార్‌బక్స్ వార్షిక అమ్మకాల అంచనాను గణనీయంగా తగ్గించుకుంది.

ఎందుకంటే పశ్చిమాసియాలో గాజా- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి సేల్స్ అంచనాను కుదించాయి. అంతేకాకుండా 2023- 24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను కూడా చేరుకోలేకపోయింది. సియాటెల్ ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న ఈ కాఫీ చెయిన్ దిగ్గజం గత కొంత కాలం నుంచి తాము ఇజ్రాయెల్‌కు అనుకూలం కాదని పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పిస్తున్నా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. తమ వెబ్‌సైట్‌లో ఎఫ్‌ఎక్యూ సెక్షన్‌లో తమ కంపెనీకి టెల్ అవీవ్‌తో ఎలాంటి సంబంధాలు లేవని.. అక్కడి ప్రభుత్వానికి తమ మద్దతు లేదని కూడా వివరణ ఇచ్చుకుంది. అయినా అమ్మకాలు మాత్రం పుంజుకోవడం లేదు కదా మరింత తగ్గుముఖం పడుతున్నాయి. ఈ సెగ కేవలం స్టాక్‌బక్స్‌కు మాత్రమే కాదు. ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు మెక్‌డొనాల్డ్ యూనీలీవర్‌కు కూడా తాకింది. యూనీలీవర్ బ్రాండ్‌లు అయిన డోవ్, సన్‌సిల్క్, రెక్సోనా అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. యూనీలీవర్ ఆగ్నేయాసియా అమ్మకాలు ఇండోనేషియాలో రెండంకెల్లో తగ్గాయని కంపెనీ ఈ నెల 8వ తేదీన ఎర్నింగ్ కాల్స్‌లో వెల్లడించింది. ఇండోనేషియాలో నాలుగో త్రైమాసికంలో అమ్మకాలు డబుల్ డిజిట్‌లో తగ్గుముఖం పడతాయని బహుళ జాతి కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.అలాగే మెక్ డొనాల్డ్ కంపెనీ సిఈఒ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మధ్యప్రాచ్య దేశంలో పాటు ఇతర ముస్లిం దేశాలు ఉదాహరణ మలేషియా, ఇండోనేషియాలో అమ్మకాలు తగ్గాయని మెక్ డొనాల్డ్ సిఈఒ క్రిస్ కెంప్‌జినికి తెలిపారు. గాజా, ఇజ్రాయెల్ యుద్ధం జరిగినంత కాలంలో పరిస్థితులు మెరుగుపడే అవకాశాల్లేవని మెక్‌డొనాల్డ్ సిఇఒ భావిస్తున్నారు. ప్రస్తుతం గాజాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ప్రభావం తమ బ్రాండ్‌లపై కనిపిస్తోందన్నారు. ఇదే ప్రభావం స్టాక్‌బక్స్‌పై పడింది. మలేషియాలోని స్టార్ బక్స్ ప్రాంచైజీ ఆపరేటర్ బెర్జాయా ఫుడ్‌బెర్హాడ్ 2022 డిసెంబర్‌తో పోల్చుకుంటే 2023 డిసెంబర్‌తో ముగిసి త్రైమాసికంలో తమ అమ్మకాలు 38.3 శాతం తగ్గాయని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెర్జాయ ఫుడ్ క్యూ2 ఫలితాలను ప్రకటించింది. ఇక రెవెన్యూ విషయానికి వస్తే డిసెంబర్ 31, 2023 నాటికి చూస్తే 182.5 మిలియన్ ఆర్‌ఎం స్థానిక కరెన్సీకి పడిపోయింది. ఇవన్నీ ఇలా ఉంటే అమెరికాలో పటేల్ బ్రదర్స్‌కు కూడా ముస్లింల నుంచి సెగ తగిలింది. గత వారం చికాగోని ముస్లింలు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి పటేల్ బ్రదర్స్‌లో వస్తువుల కొనుగోలు చేయరాదని పెద్ద భారీ ప్రదర్శనే నిర్వహించారు. ఇక అమెరికాలోని ప్రతి నగరంలో పటేల్ బ్రదర్స్ గ్రాసరీ స్టోర్స్ అంటే కిరాణా స్టోర్ కనిపిస్తుంటాయి.

తాజాగా గాజా- ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఇక్కడి ముస్లింలు కూడా పటేల్ బ్రదర్స్‌కు వ్యతిరేకంగా గళం ఎత్తారు. దేశంలోని ముస్లింలు పటేల్ బ్రదర్స్ వస్తువులు కొనుగోలు చేయరాదని పెద్ద ఎత్తున చికాగో ప్రదర్శన నిర్వహించి ముస్లిం ప్రజలను అప్రమత్తం చేశారు. మొత్తానికి చూస్తే గాజా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం బహుళ జాతి కంపెనీల బ్యాలెన్స్ షీట్లను బలహీనం చేస్తున్నాయనేది మాత్రం వాస్తవం. యుద్ధం వల్ల స్థానిక పౌరులు ఇబ్బంది పడ్టమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనడానికి ఇదో చక్కటి ఉదాహరణ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News