Sunday, October 20, 2024

యాహ్యా సిన్వర్ మరణానంతరం…

- Advertisement -
- Advertisement -

హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ ఇజ్రాయెల్ దాడిలో మరణించినట్లు 17వ తేదీన ధ్రువీకరణ అయిన తర్వాత గాజా యుద్ధంతో ప్రత్యక్ష సంబంధం గల ఆరు పక్షాల నుంచి తమ తమ స్పందనలు వినిపించాయి. ఆ పక్షాలు ఇజ్రాయెల్, హమాస్, గాజా ప్రజలు, ఇరాన్, హెజ్బొల్లా, అమెరికా. వారి స్పందనలను పరిశీలించినపుడు, సిన్వర్ మృతితో గాజా యుద్ధం ముగిసిపోవచ్చునా? లేక భవిష్యత్తు ఏ విధంగా ఉండగలదు? అనే ప్రశ్నలకు మనకు సమాధానాలు లభిస్తాయి. వారి స్పందనలను ఇపుడు చూద్దాము. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మాట్లాడుతూ, సిన్వర్ మరణంతో గాజా యుద్ధం ముగియలేదు, కొనసాగుతుందన్నారు. అయితే అది ముగియటానికి ఇది ఆరంభమని, ముగిసేందుకు రెండు షరతులున్నాయని ప్రకటించారు. ఒకటి, హమాస్ దళాలు ఆయుధాలను పూర్తిగా విడిచిపెట్టి లొంగిపోవటం. రెండు, తమ వద్ద గల ఇజ్రాయెలీ బందీలను వదలివేయటం. ఈ రెండు జరిగితే గాజాలో తమ యుద్ధం వెంటనే ఆగిపోతుంది.ఇందుకు బదులుగా హమాస్ ప్రతినిధులు, ముందుగా యుద్ధాన్ని ఆపటంతోపాటు ఇజ్రాయెలీ సైన్యం గాజా నుంచి నిష్క్రమిస్తే అపుడు బందీలను వదలగలమన్నారు.

ప్రత్యక్షంగా తలపడుతున్నది వీరిద్దరు అయినందున, మొదట వీరి ప్రకటనలలోని మంచి చెడులను విచారించి, పైన పేర్కొన్న తక్కిన నాలుగు పక్షాల విషయం ఆ తర్వాత చూద్దాము.
నెతన్యాహూ చెప్పిన దాని ప్రకారం హమాస్ రెండు షరతులకు అంగీకరించినట్లయితే గాజా ప్రజలకు లభించేదేమిటి? యుద్ధం ముగిసి వారు సుఖశాంతులతో జీవించగలగటం. అంతేతప్ప మరేమీలేదు. అక్కడి నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించటం, వెస్ట్ బ్యాంక్ సహా మొత్తం పాలస్తీనాపై తమ ఆధిపత్యాన్ని వదలటం, వెస్ట్ బ్యాంక్‌లో వేలాది యూదుల చట్టవిరుద్ధమైన సెటిల్మెంట్లను రద్దు చేయటం, స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుతో రెండు స్వతంత్ర దేశాల సృష్టికి అంగీకరించటం వంటివేవీ లేవు. ఇవన్నీ వెంటనే జరగకున్నా, ఆ దిశలో ముందుకు పోయేందుకు తమ షరతులు మొదటి అడుగులు కాగలవని అన్నట్లయితే అందుకు అర్థం ఉండేది.

మొత్తం పాలస్తీనా ఉద్యమంలో, ఘర్షణలలో వీటన్నింటికి పరస్పర సంబంధం ఉంది. మొదట యాసిర్ అరాఫత్ నాయకత్వాన పాలస్తీనా విమోచన సంస్థ (పిఎల్‌ఒ) నుంచి, ఆ వెనుక హమాస్ వరకు అందరి ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాల లక్షాలు స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు. ఈ మొత్తం చరిత్రలోకి ఇక్కడ వెళ్లలేము గాని, సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితి తీర్మానించిన ఈ ఏర్పాటును రకరకాల కుయుక్తులతో ఇజ్రాయెల్, దాని మద్దతుదారులైన అమెరికా కూటమి దశాబ్దాల తరబడి ఉల్లంఘిస్తూ రావటం వల్లనే, పరిస్థితి ఇంత విషమంగా మారింది. అటువంటి స్థితిలో, ఈ మౌలికమైన ప్రశ్నను, అందుకు పరిష్కార మార్గాన్ని ప్రస్తావించకుండా, తమ రెండు షరతులకు సమ్మతిస్తే గాజా ప్రజలు సుఖసంతోషాలతో జీవించవచ్చుననటంతోని కాపట్యం కనిపిస్తున్నదే.

అంతేకాదు. హమాస్‌తో నిమిత్తం లేకుండా గత ఏడాదిగా సాగుతున్న తీవ్ర ఘర్షణలకు ముందు నుంచే నెతన్యాహూ మూడు ముఖ్యమైన వాదనలు చేస్తూ వస్తున్నారు. ఒకటి, స్వతంత్ర పాలస్తీనా సృష్టికి తాము అంగీకరించే ప్రసక్తి లేదు. రెండు, గాజాలో తమ సైనిక నియంత్రణ, పరిపాలనా నియంత్రణ కొనసాగుతాయి. మూడు, వెస్ట్ బ్యాంక్ ప్రాంతం ఇజ్రాయెల్‌లో ఒక భాగమే తప్ప వేరు కాదని, అందువల్ల అక్కడ యూదుల సెటిల్మెంట్లు కొనసాగుతాయని, అవి ఎంత మాత్రం చట్టవిరుద్ధం కాదని. ఈ మూడింటిపై వేరే వ్యాఖ్యానాలు అవసరం లేదు. ఈ వైఖరి తగదని అమెరికా సైతం అపుడపుడు సూచన మాత్రంగా అంటుంటుంది గాని, అందులో నటనలు తప్ప చిత్తశుద్ధి లేదని ఇజ్రాయెల్‌కు తెలుసు గనుక ఆ మాటలను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇక ఐక్యరాజ్య సమితి, ఇతరత్రా అంతర్జాతీయ చట్టాలపట్ల వారికి ఎన్నడూ లెక్కలేదు. ఈ స్థితిలో, నెతన్యాహూ రెండు షరతుల అర్థ తాత్పర్యాలేమిటో ఎవరైనా గ్రహించవచ్చు. అందుకు ఒకే ఒక అర్థం పాలస్తీనా ప్రజలు స్వతంత్ర దేశ లక్షాన్ని వదులుకొని, ఆయుధాలతో సహా తమకు లొంగిపోయి, ఇజ్రాయెల్‌లో భాగంగా మారి, ద్వితీయశ్రేణి పౌరులుగా అణిగిమణిగి జీవించాలి.

ఇక హమాస్ ప్రతినిధుల స్పందనలను గమనించినపుడు వారందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేరని అర్థమవుతుంది. యథాతథంగా వారన్నది మొదట ఇజ్రాయెల్ తన యుద్ధాన్ని నిలిపివేసి సైన్యాన్ని వాపస్ తీసుకున్నట్లయితే అపుడు బందీలను వదలగలమని. అందులో, పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించటమనే షరతు లేదు. అది వెంటనే జరిగేది కాదని, అంతకన్న ముఖ్యంగా ఇజ్రాయెల్ ఆ పని చేయబోదని వారికి తెలుసు. అటువంటపుడు, అసాధ్యమైన షరతుల విధింపులో వివేకం లేదు. చేయవలసింది తక్షణ సమస్య పరిష్కారం. ఇజ్రాయెల్‌కు కూడా తక్షణం కావలసింది బందీల విడుదల. ప్రస్తుత సమస్య మొదలైంది నిరుడు ఆగస్టులో హమాస్ దాడి జరిపి 1200 మందిని చంపి, 100 మందికి పైగా బందీలుగా తీసుకోవటంతో. ఇది తేలాలంటే, ఐక్యరాజ్య సమితిలో లేక మధ్యవర్తులకో ఆ బందీలను హమాస్ అప్పగించటం, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపి సైన్యాన్ని ఉపసంహరించటం ద్వారా జరపవచ్చు. మిగిలిన విషయాలు తర్వాత వస్తాయి. ఇపుడు అటువంటిది ఏమైనా జరగగలదో చూడాలి.

పోతే, సిన్వర్ మరణంతో తమ పోరాటం ఆగదని, ఆయన స్థానంలో మరొకరి ఎంపిక జరుగుతుందని కూడా హమాస్ ప్రకటించింది. ఆ విధమైన ఆ సంస్థ స్పందనను, సిన్వర్ వీరుని వలే ప్రాణత్యాగం చేశాడని ఆయన నుంచి తాము స్ఫూర్తిని పొంది స్వతంత్ర పాలస్తీనా పోరాటాన్ని కొనసాగించగలమని గాజాలో, వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్ల నుంచి వినవచ్చిన మాటలను గమనించినపుడు, ఇవన్నీ భవిష్యత్తుకు సూచనలవుతున్నట్లు ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అనగా, 1948లో మొదలై 74 సంవత్సరాలుగా నిరంతరాయంగా సాగుతున్న పాలస్తీనా ప్రజల ఉద్యమం సిన్వర్ మరణంతో ఆగబోవటం లేదన్నమాట.
మరొక వైపు ఇరాన్, హెజ్బొల్లాల నుంచి కూడా ఇదే విధమైన స్పందనలు వెలువడ్డాయి. వాస్తవానికి పరిస్థితి ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరగవచ్చునేమో అన్నంత ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడి తర్వాత, ఇక తామెందుకు తీవ్రమైన ప్రతీకారం తీర్చుకొనగలమని నెతన్యాహూ ప్రకటించారు కూడా. వారి దాడులు ఇరాన్ చమురు బావులపైననా, అణు కేంద్రాలపైననా, నగరాలపైననా లేక ఇరాన్ అగ్ర నాయకులపైననా అనే ఊహాగానాలు ఇప్పటికీ సాగుతున్నాయి. ఒకవేళ అటువంటిది జరిగితే తాము ఇజ్రాయెల్‌తోపాటు, దాని మద్దతుదారు అయిన సౌదీ అరేబియా చమురు బావులపై దాడులు చేయగలమని ఇరాన్ హెచ్చరించింది. ఇదంతా వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ఏ విధంగా పరిణమించవచ్చునన్నది అట్లుంచితే, సిన్వర్ మృతి తర్వాత ప్రస్తుతానికి మాత్రం, ఇరాన్ నాయకత్వం ఆయన త్యాగాన్ని పొగిడి, పాలస్తీనా పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందని ప్రకటించింది. హెజ్బొల్లా ప్రకటన కూడా అదే విధంగా ఉంది.
వాస్తవానికి హమాస్, ఇరాన్, హెజ్బొల్లాలకు ఇజ్రాయెల్‌పై, అమెరికా సామ్రాజ్యవాదంపై ఉమ్మడిగా పోరాడటం మినహా మార్గాంతరం లేదు. వేర్వేరు కారణాలతో ఈ ముగ్గురి ఆత్మరక్షణలు, ఇతర ప్రయోజనాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. తొలి దశలో పాలస్తీనాతో అరబ్ దేశాలకు సంఘీభావం ఉండేది. అందువల్ల వారు ఒకటై ఇజ్రాయెల్‌తో యుద్ధాలు చేశారు.

కాని క్రమంగా అరబ్ దేశాలలో కొత్తతరం నాయకత్వాలు, వారికి కొత్త తరహా ఆర్థికాది ప్రయోజనాలు ఏర్పడటంతో, పాలస్తీనాతో ప్యాన్ అరబిజం అనే సంఘీభావం బలహీనపడ సాగింది. అమెరికాతో, యూరప్‌తో, తద్వారా ఇజ్రాయెల్‌తో అనుబంధాలు పెరిగాయి. ఆ విధంగా పాలస్తీనా ఇంచుమించు ఏకాకి అయింది. ఈ కొత్త పరిస్థితులలో, అమెరికా ఇరాన్ వైరమన్నది పాలస్తీనియన్లకు ఇరాన్‌తో పాటు హెజ్బొల్లా, హూతీ, ఇరాకీ, సిరియా, లెబనాన్ వంటి కొత్త మిలిటెంట్ గ్రూపులను మద్దతుదారులు చేసింది.
యాహ్యా సిన్వర్ మృతితో నిమిత్తం లేకుండా పాలస్తీనియన్ల ఉద్యమం కొనసాగుదలకు ఈ పరిస్థితులు తోడ్పడుతాయి. నామమాత్రమే అయినప్పటికీ వివిధ అంతర్జాతీయ సంస్థలతో పాటు అనేక ప్రపంచ దేశాలు, ప్రజల సానుభూతి ఉండనే ఉన్నది. ఇజ్రాయెల్, అమెరికా శిబిరాలు ఈ విషయంలో ఏకాకులు కావటం ఇందుకొక గుర్తు వంటిది. చివరగా అమెరికా స్పందన గురించి చెప్పుకోవాలి.

అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ, సిన్వర్ మరణం ఇజ్రాయెల్‌కు, ప్రపంచానికి కూడా శుభవార్త అన్నారు. దీనిని నెతన్యాహూ ఒక అవకాశంగా తీసుకుని గాజా యుద్ధం ముగించేందుకు మార్గాన్ని వెతకాలని సూచించారు. పైన పేర్కొన్న నెతన్యాహూ రెండు షరతులలో బైడెన్ ఈ సూచన ప్రతిఫలించటం కనిపిస్తున్నదే. నెతన్యాహూ వలెనే ఆయన కూడా, పాలస్తీనా మౌలిక సమస్య పరిష్కారం గురించి మాట్లాడలేదు. కాని అందులో ఆశ్చర్యం లేదు. పాలస్తీనాను ఉద్దేశపూర్వకంగా రెండు ముక్కలు చేసి ఇజ్రాయెల్‌ను సృష్టించటం మొదలుకొని, రెండు స్వతంత్ర దేశాల ఏర్పాటుకు ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాన్ని భంగపరచటం నుంచి, అడుగడుగునా ఒప్పందాల పేరిట నటనల నుంచి ఇజ్రాయెల్ మారణకాండలకు ఆయుధాలు, ధన సహాయాలు చేయటం వరకు అమెరికా తన ప్రయోజనాల పరిరక్షణకే పని చేస్తూ వస్తున్నదనేది ఈ సుదీర్ఘ విషాదంలోని అంతిమ సత్యం.

టంకశాల అశోక్
9848191767

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News