Wednesday, January 22, 2025

గాజాలో జర్నలిస్టుల దురవస్థ

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్- హమాస్ తీవ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రారంభమై పది వారాలు కావస్తోంది. ఐక్యరాజ్యసమితి, అమెరికా, కొన్ని అరబ్ దేశాలు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పట్లో కాల్పుల విరమణ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. హమాస్‌ను పూర్తిగా అంతం చేసే లక్ష్యంతో గాజా లో ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో ఇప్పటి వరకు 20,057 మంది చనిపోయారని, 53,320 మంది గాయపడ్డారని అక్కడి వైద్యాధికారులు తెలిపారు. వీరిలో 65 శాతానికి పైగా మహిళలు, చిన్నారులే వున్నారని వెల్లడించారు. మరోవంక, ఇప్పటి వరకు 7 వేల మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చామని ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాలో 5.76 లక్షల మంది ప్రజలు తీవ్రమైన ఆకలి, కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్య సమితి ఆగేంసీఈలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు ప్రతి ఒక్కరూ తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొనే పరిస్థితులు నెలకొన్నట్లు హెచ్చరిస్తున్నాయి. ఈ మారణ హోమంలో జర్నలిస్టుల పరిస్థితి మరింత జటిలంగా మారుతున్నది. ఇంత వరకు ఇటువంటి ఘర్షణలతో మరెక్కడా జరగని విధంగా ఒక దేశంలో అత్యధికంగా జర్నలిస్టులు మృత్యువాతపడుతున్నారు. సగటున ప్రతి రోజు కనీసం ఒక జర్నలిస్ట్ చనిపోతున్నారు.

కమిటీ టు జర్నలిస్ట్స్ (సిపిజె) తాజా నివేదిక ప్రకారం ఘర్షణలు ప్రారంభమైన అక్టోబర్ 7 నుండి డిసెంబర్ 20, 2023 నాటికి కనీసం 68 మంది జర్నలిస్టులు, మీడియా కార్యకర్తలు హత్యలకు గురయ్యారు. వారిలో 61 మంది పాలస్తీనియన్లు, నలుగురు ఇజ్రాయెలీలు, ముగ్గురు లెబనీస్ వారున్నారు. సగం కంటే ఎక్కువ మరణాలు, అంటే 37 యుద్ధం ప్రారంభమైన మొదటి నెలలో సంభవించాయి.1992 నుండి ప్రపంచంలో జర్నలిస్టుల మరణాలను నమోదు చేస్తున్న సిపిజె ఇప్పటి వరకు ఒకే నెలలో, అదీ ఒకే దేశంలో అంత మంది జర్నలిస్టులు హత్యలకు గురవడం ఎక్కడా చూడలేదని సిపిజె అధ్యక్షుడు జోడీ గిన్స్‌బర్గ్ తెలిపారు. స్థానిక పాలస్తీనా జర్నలిస్టులు తమ ప్రాణాల పట్ల భయంతో జీవిస్తూనే గాజా నుండి వార్తా కథనాలు పంపుతున్నారని చెప్పారు. పారిస్‌కు చెందిన రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ‘మీడియా సిబ్బందిని రక్షించడానికి అంతర్జాతీయ సమాజం చేస్తున్న విజ్ఞప్తులను ఇజ్రాయెల్ పట్టించుకోకుండా గాజా స్ట్రిప్‌లో జర్నలిజం నిర్మూలన ప్రక్రియలో వుంది’ అని హెచ్చరించింది. అక్కడ విలేకరులకు సురక్షితమైన ఆశ్రయం లేదు. వెళ్ళడానికి మార్గం లేదు. ఒకరి తర్వాత ఒకరు హత్యలకు గురవుతున్నారు. అక్టోబర్ 7 నుండి పాలస్తీనా భూభాగం జర్నలిజం నిజమైన నిర్మూలనకు గురైంది అని పేర్కొంది.

ఈ నెల ప్రారంభంలో అల్ జజీరా కెమెరా ఆపరేటర్ సమీర్ అబుదాకా డ్రోన్ దాడిలో గాయపడి ఐరాస పాఠశాలలో చిక్కుకున్నాడు. ప్రజలు అబుదాకాను రక్షించి చికిత్స కోసం తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పుడు వారిని కూడా కాల్చారు. అతను చాలా గంటల తర్వాత ఆ గాయాలతో మరణించాడు. హ్యూమన్ రైట్స్ వాచ్, ఇతర సమూహాలు దక్షిణ లెబనాన్‌లో రాయిటర్స్ జర్నలిస్టు ఇస్సామ్ అబ్దల్లాను హతమార్చిన, మరో ఆరుగురిని గాయపరిచిన ఇజ్రాయెల్ దళాల దాడి బహుశా పౌరులపై చేసిన ఉద్దేశపూర్వక దాడి అని పేర్కొన్నారు. అయితే, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొంటున్నట్లు వస్తున్న ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది. తాము హమాస్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నట్లు పేర్కొంటున్నారు. జర్నలిస్టుల ప్రాణనష్టం కేవలం నెల రోజుల యుద్ధంలో మాత్రమే అంత భారీ సంఖ్యలో వుండటం ఆందోళన కలిగిస్తోంది. గాజాలోని సాధారణ ప్రజలను కాపాడేందుకు పోరాడుతున్న వారంతా అందుకోసం జర్నలిస్టులు చెల్లిస్తున్న భారీ మూల్యాన్ని గుర్తెరగాలి. పైగా ఇజ్రాయెల్ సైన్యం జర్నలిస్టులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని సాగిస్తున్న ప్రత్యేక దాడులపట్ల సిపిజె మరింతగా ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

కనీసం ఒక సందర్భంలో ఎటువంటి ఘర్షణలు జరగని ప్రదేశంలో స్పష్టంగా మీడియా గుర్తింపు వస్త్రాలు ధరించిన ఓ జర్నలిస్ట్ హత్యకు గురవడాన్ని ప్రపంచం గుర్తించింది. కనీసం మరో రెండు ఇతర సందర్భాల్లో తమ కుటుంబ సభ్యులు హత్యలకు గురవడానికి ముందు ఇజ్రాయెల్ అధికారులు ఆ దేశ సైనికాధికారుల నుండి బెదిరింపులు అందుకున్నారు. గతంలో జరిగిన ఘర్షణల్లో జర్నలిస్టులు, మీడియా కార్యకర్తల హత్యలతో పోల్చితే ఈ యుద్ధాన్ని కవర్ చేస్తున్న జర్నలిస్టుల ప్రమాదకర పరిస్థితులు పోల్చలేనంతగా వుందని చెప్పవచ్చు. ‘ఇజ్రాయెల్- గాజా యుద్ధంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి’ అని సిపిజె మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ షెరీఫ్ మన్సూర్ పేర్కొన్నారు. ‘ఇజ్రాయెల్ సైన్యం 10 వారాలలో ఎక్కువ మంది జర్నలిస్టులను చంపింది. ప్రపంచంలో మరే ఇతర సైన్యం, దేశం కూడా ఏ ఒక్క సంవత్సరంలోనైనా అంత మందిని చంపిన ఘటనలు లేవు. ఇటువంటి ప్రమాదకర వాతావరణంలో యుద్ధానికి సంబంధించిన వార్త కథనాలను అందించడం జర్నలిస్టులకు కత్తిమీద సాముగా వుంది’ అని స్పష్టం అవుతున్నది. ఈ విషయంలో ఇరాక్ మాత్రమే కొంత మేరకు గాజాకు దగ్గరగా వుందని చెప్పవచ్చు. 2006 లో ఆ దేశంలో 56 మంది జర్నలిస్టులు హత్యలకు గురయ్యారు.

తమ వృత్తికి సంబంధించి మరో 48 మంది మరణించారు. అయితే మరో ఎనిమిది మరణాలలో పరిస్థితులను సిపిజె నిర్ధారించలేకపోయింది. ఆ తర్వాత ఫిలిప్పీన్స్‌లో 2009లో 33 మంది జర్నలిస్టులు, మీడియా ఉద్యోగులు ఒకే మారణకాండలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత సిరియాలో 2018లో 32 మంది, అఫ్ఘానిస్తాన్‌లో 2018లో 15 మంది, ఉక్రెయిన్‌లో 2022లో 13 మంది, సోమాలియాలో 2012లో 12 మంది జర్నలిస్టులు అత్యధికంగా మృతి చెందినట్లు నమోదయింది.
తమ విధి నిర్వహణలో జర్నలిస్టుల ప్రాణాలకు గాజాలో రక్షణ కల్పించేందుకు అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా తమవంతు కృషి చేయాలి. గాజాకు మానవతా సహాయం, ప్రాథమిక సామాగ్రితో పాటు గాజా, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని జర్నలిస్టులకు హెల్మెట్‌లు, ఫ్లాక్ జాకెట్‌ల వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలను సురక్షితంగా అందించడానికి తక్షణ ఏర్పాట్లు కావించాలి. మీడియా గుర్తింపు, పత్రికా చిహ్నాలు గౌరవించబడే విధంగా అన్ని పార్టీలు అంతర్జాతీయ మానవతాచట్టాన్ని అనుసరించే విధంగా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోకుండా లేదా హాని చేయవద్దని సంయమనం పాటించే విధంగా సంబంధిస్తులపై అంతర్జాతీయంగా వొత్తిడి తీసుకు రావాలి.

ప్రస్తుతం అంతర్జాతీయ వార్తా సంస్థలకు గాజాలో ప్రవేశానికి, ప్రవేశించినా తమ వార్తా కథనాలను పంపేందుకు అవసరమైన సదుపాయాలు అందుబాటులో లేకుండా కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్‌లను పాటిస్తున్నారు. ఈ పరిస్థితుల నుండి జర్నలిస్టులకు ఉపశమనం కల్పించడంతో పాటు వార్తా సంస్థలను మూసివేయడానికి అనుమతించే కొత్త నిబంధనలను రద్దు చేసేందుకు ఎటువంటి నేరారోపణ లేకుండా జైలు చేస్తున్న జర్నలిస్టుల ‘అడ్మినిస్ట్రేటివ్ నిర్బంధాన్ని’ విరమించుకొనే విధంగా వొత్తిడులు తీసుకు రావాలి. మే, 2023లో ‘డెడ్లీ ప్యాటర్న్‘ సిపిజె విడుదల చేసిన నివేదికలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జర్నలిస్టుల పట్ల ఏ విధంగా ప్రాణాంతక బలంగా మారా యో సవివరంగా పేర్కొన్నది. ఈ నివేదిక ప్రకారం గత 22 సంవత్సరాలలో 20 మంది జర్నలిస్టులను దారుణంగా చంపింది. ఆ 20 మంది జర్నలిస్టులలో కనీసం 13 మంది చనిపోయే సమయంలో మీడియా సంస్థలకు చెందిన వారని తెలిపే గుర్తింపు చిహ్నాలను కలిగిన వాహనాలలో ప్రయాణం చేస్తున్నట్లు వెల్లడైంది.ఈ యుద్ధంలో జర్నలిస్టుల మరణాలపై దర్యాప్తు జరపాలని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్, రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసిసి) ప్రాసిక్యూటర్‌లను కోరింది.

ఐసిసి చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ ఇప్పటికే ఆ ప్రాంతాన్ని సందర్శించారు. 2014లో జరిగిన ఇజ్రాయెల్- హమాస్‌కు సంబంధించి అప్పటి ఇజ్రాయెల్, పాలస్తీనా అధికారుల చర్యలపై ఐసిసి ప్రాసిక్యూషన్ కార్యాలయం ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుత యుద్ధంలో జరిగిన నేరాల ఆరోపణలను కూడా ఈ విచారణ పరిగణించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News