Tuesday, January 21, 2025

గాజాను రెండుగా విభజించిన ఇజ్రాయెల్

- Advertisement -
- Advertisement -

డీర్‌అల్ బలా(గాజా): హమాస్‌ను భూస్థాపితం చేయడమే లక్షంగా గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న భీకర పోరులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాజాను నలువైపులా చుట్టుముట్టిన ఇజ్రాయెల్ దళాలు, ఈ నగరాన్ని రెండుగా విభజించినట్లు ప్రకటించాయి. గాజా నగరాన్ని మేము చుట్టుముట్టాం. ఇప్పుడు ఉత్తర గాజా, దక్షిణ గాజాగా విభజించాం. ఈ యుద్ధంలో ఇది కీలక దశ. మేము మరింత కీలకంగా దాడులు చేయబోతున్నాం’ అని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేవిడ్ హగారీ మీడియాకు తెలిపారు. ఇదిలా డగా ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికే గాజా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాయి. మరో 48 గంటల్లో అటువైపునుంచి గాజా బూభాగంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

మరో వైపు ఉత్తర గాజాలో భీకర దాడులు కొనసాగుతున్నాయి. గాజా ఉత్తర ప్రాంతంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలకు తలొగ్గి ఈ ప్రాంతంలోని దాదాపు 8లక్షల మంది సేఫ్ జోన్‌గా భావిస్తున్న దక్షిణ ప్రాంతానికి పారిపోయారు. అయితే ఆ ప్రాంతంపై కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం మధ్య, దక్షిణ గాజాప్రాంతాల్లో రెండు శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 53 మంది చనిపోయారు. మరో వైపు ఇజ్రాయెల్ దాడులతో గాజాలో మరోసారి కమ్యూనికేషన్ వ్యవస్థలు కొద్ది గంటల సేపు మూగబోయాయి. యుద్ధం మొదలైన తర్వాత గాజాలో కమ్యూనికేషన్ వ్యవస్థలు పని చేయకుండా పోవడం ఇది మూడో సారి.

మరో మార్గం లేదు: నెతన్యాహు
ఇదిలా ఉండగా బందీలను హమాస్ విడిచిపెట్టేంతవరకు కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాము మరోసారి స్పష్టం చేశారు.‘ మేం గెలిచే వరకు ఈ యుద్ధం కొనసాగిస్తాం. మాకు మరో మార్గం లేదు.ఈ యుద్ధాన్ని ప్రారంభించింది హమాసే.మమ్మల్ని అంతం చేయాలని ఆ ముఠా కోరుకుంది. హమాస్ చేసింది తప్పు. అందుకే దాన్ని సమూలంగా నాశనం చేయాలని అనుకుంటున్నాం’ అని నెతన్యాహు స్పష్టం చేశారు.

ఇరాక్‌లో బ్లింకెన్ ఆకస్మిక పర్యటన
గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రమైన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా పశ్చిమాసియాలో దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఆదివారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అనూహ్యంగా వెస్ట్‌బ్యాంక్‌కు వెళ్లి పాలస్తీనా అద్యక్షుడు మొహ్మద్ అబ్బాస్‌తో భేటీ అయ్యారు. అక్కడినుంచి ఇరాక్‌లో అనూహ్యంగా పర్యటించారు. బాగ్దాద్‌లో ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుదానీతో సమావేశమయ్యారు. అక్కడినుంచి టర్కీ బయల్దేరి వెళ్లారు.
ఉద్రిక్తంగా మారిన పాలస్తీనా మద్దతుదారుల ప్రదర్శన
కాగా బ్లింకెన్ టర్కీ రావడానికి కొద్ది గంటల ముందు దేశ రాజధాని అంకారాలో పాలస్తీనా ప్రజలకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ క్రమంలో నిరసనకారులు అంకారాలో అమెరికా సైనిక బలగాలు ఉన్న ఎయిర్‌బేస్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసుల వారిపై వాటర్ క్యానన్లు ప్రయోగించి చెదరగొట్టడానికి యత్నించారు. దీంతో మరింత రెచ్చిపోయిన నిరసనకారులు పోలీసులపైకి కుర్చీలు, రాళ్ల్లు విసిరారు. పరిస్థితులు మరింత విషమించడంతో పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News