Monday, January 20, 2025

గాజాపై దాడులు ఉధృతం చేస్తాం: ఇజ్రాయెల్

- Advertisement -
- Advertisement -

రఫా:గాజా ప్రాంతంపై ఎడతెరిపి లేకుండా వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ తమ దాడులను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించింది. శనివారం రాత్ని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజాలోని మిటిటరీ టార్గెట్లపైన, సిరియాలోని రెండు విమానాశ్రయాలపైన, వెస్ట్ బ్యాంకులో మిలిటెంట్లు ఉపయోగిస్తున్న ఓ మసీదుపైనా బాంబుల వర్షం కురిపించాయి. మరో వైపు హమాస్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటినుంచీ ఇజ్రాయెల్ హమాస్‌కు మద్దతు పలుకుతున్న లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపుపైనా ప్రతి రోజూ దాడులు చేస్తూనే ఉంది. దీనికి తోడు వెస్ట్ బ్యాంకులోని రెండు శరణార్థి శిబిరాలపై మిలిటెంట్లే లక్షంగా వైమానిక దాడులు చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. భూతల దాడులకోసం తమ బలగాలు గాజాలోకి ప్రవేశించడానికి వీలుగా మెరుగైన పరిస్థితులు నెలకొల్పడమే తమ లక్షమని ఇజ్రాయెల్ ప్రకటించింది.

అత్యంత భద్రమైన పరిస్థితుల్లో తాము యుద్ధం తదుపరి దశలోకి అడుగుపెట్టాలనుకుంటున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్‌ఫోర్సెస్(ఐడిఎఫ్) అధికార ప్రతినిధి డేనియల్ హగారీ తెలిపారు. అందులో భాగంగా దాడులను మరింత పెంచి తమకున్న ముప్పును తగ్గించుకుంటామని పేర్కొన్నారు. గాజాపై హమాస్ నియంత్రణను అంతం చేయడమే లక్షంగా ముందుకు సాగుతున్న ఇజ్రాయెల్ మూడంచెల ఆపరేషన్‌ను చేపట్టింది.అందులో భాంగా ప్రస్తుతం రెండో దశకు సిద్ధమవుతున్నట్లు తాజా వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. అయితే భూతల దాడుల్లో భాగంగా గాజాలోకి ప్రవేశించినప్పుడు హమాస్ మిలిటెంట్లనుంచి గట్టి ప్రతిఘటన తప్పదని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో హమాస్‌నుంచి ఎదురయ్యే ఆకస్మిక దాడులకు సిద్ధంగా ఉండాలని ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ హెర్జీ హలేదీ తమ కమాండర్లకు సూచించారు. ‘ మేం గాజాలోకి ప్రవేశిస్తాం.

హమాస్ ఉగ్రవాదులను నాశనం చేసేందుకు ఆపరేషన్ చేపడతాం.వారి మౌలిక వసతులను ధ్వంసం చేస్తాం. రెండువారాల క్రితం ఇజ్రాయెల్‌లో వారు సృష్టించిన విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతాం. అయితే గాజా ప్రాంతం చాలా సంక్లిష్టమైనది. అక్కడ శత్రువులు అనేక వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. కానీ మేం వాటిని తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన అన్నారు.
తక్షణం ఖాళీ చేయండి

మరో వైపు గాజాలోని ఉత్తర భాగంనుంచి వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని అక్కడి పౌరులను ఐడిఎఫ్ కోరింది. లేదంటే అక్కడ ఉన్న వారందరినీ హమాస్‌తో సంబంధం ఉన్న వారిగా భావించి చర్యలు తీసుకోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇజ్రాల్ సైనికులు ఆ ప్రాంతంపై కరపత్రాలు జారవిడిచారు. గాజా ఉత్తరప్రాంతంలోని దాదాపు 11 లక్షల మందిలో ఇప్పటికే 7 లక్షలకు పైగా పౌరులు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లరు. అయితే ఇంకా చాలా మంది అక్కడే ఉంటున్నారు. మరో వైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా ప్రపంచ దేశాల నేతలు, అంతర్జాతీయసంస్థల ఒత్తిడికి తలొగ్గి రఫా సరిహద్దులను తెరవడానికి ఇజ్రాయెల్ అంగీకరించడంతో గాజాలోకి సహాయం అందడం ప్రారంభమైంది. శనివారం 20 ట్రకుల్లో సమాయ సామగ్రి గాజాలోకి ప్రవేశించింది. ఇంకా 200 ట్రక్కులు సామగ్రి సరిహద్దుల్లో వేచి ఉంది.

రాబోయే రోజుల్లో వాటినీ గాజాలోకి పంపిస్తారు. మరో వైపు ఆస్పత్రులు క్షతగాత్రులతో నిండిపోయి ఉన్నాయి. ఓ వైపు మందుల కొరత, మరో వైపు జనరేటర్లకు డీజిల్ కొరతతో కారణంగా డాక్టర్లు అనస్తేషియా లేకుండానే ఆపరేషన్లు నిర్వహించాల్సిన వస్తోంది. ప్రతిరోజూ డజన్ల సంఖ్యలో రోగులు ఆస్పత్రులకు వస్తూనే ఉండడంతో ఇప్పటికే కిక్కిరిసిన ఆస్పత్రులు అతికష్టం మీద వారికి చికిత్స అందించాల్సి వస్తోంది.. రెండు వారాల యుద్ధంలో గాజా సరిహద్దుకు ఇరువైపులా కలిసి 5 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గాయపడ్డారు. కాగా ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ యుద్ధ విమానాలువెస్ట్ బ్యాంక్ జెనిన్ పట్టణంలోని హమాస్ మిలిటెంట్లకు చెందినదిగా భావిస్తున్న ఓ మసీదుపై జరిపిన దాడిలో కనీసం ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News