ప్రాంతీయ యుద్ధంపై భయాందోళనలు
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడి
హెజ్బొల్లా రాకెట్లను అడ్డుకున్న ఇజ్రాయెల్
‘వెనుకకు తగ్గాలని’ ఇరాన్‌ను కోరిన బైడెన్
టెల్ అవీవ్ : మధ్య ప్రాచ్యంలో యుద్ద మేఘాలు కమ్ముకొంటున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ఇజ్రాయెల్‌పై తాము డజన్ల కొద్దీ రాకెట్లు ప్రయోగించినట్లు హెజ్బొల్లా శనివారం (స్థానిక కాలమానం ప్రకారం) వెల్లడించింది. ఈ వారారంభంలో టెహ్రాన్‌లో హమాస్ రాజకీయ అధినేత ఇస్మాయిల్ హనియెహ్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్, దాని మిత్ర పక్షాలు సన్నద్ధం అవుతున్నాయి.
ఆ ప్రాంతంలో యుద్ధం గురించిన భయాందోళనలు వ్యక్తం అవుతుండగా, ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించినప్పటికీ ‘వెనుకకు తగ్గుతుందన్న’ ఆశాభావాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యక్తం చేశారు. హమాస్ మాదిరిగా ఇరాన్ దన్ను ఉన్న హెజ్బొల్లా ఇజ్రాయెల్‌లోని మొషావ్ బీట్ హిల్లెల్‌పై తమ రాకెట్ దాడుల్లో పౌరులు గాయపడినట్లుగా వెల్లడించిందని ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ తెలియజేసింది.
లెబనాన్‌లో కఫార్ కెలా, దైర్ సిరాయనెపై ఇజ్రాయెల్ దాడులకు, బీరూట్‌లో ఇజ్రాయెలీ దాడిలో ఫువద్ షుకర్ మృతి తరువాత తాము జరిపిన ప్రతీకార దాడి అది అని కూడా హెజ్బొల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ చెప్పారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ సోమవారం తెల్లవారు జామున దాడి చేయవచ్చునని తాము భావిస్తున్నట్లు యుఎస్, ఇజ్రాయెలీ అధికారులు ముగ్గురు చెప్పినట్లు ‘ఏక్షియస్’ తెలియజేసింది.
హెజ్బొల్లా ప్రయోగించిన చాలా రాకెట్లను తమ ప్రసిద్ధ డోమ్ వ్యవస్థ అడ్డుకున్నదని ఇజ్రాయెల్ వెల్లడించింది. బీట్ హిల్లెల్ సమీపాన దాడుల ప్రభావం కనిపించిందని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. స్థానిక మీడియా ప్రకారం, ఆ ప్రాంతంలో అగ్ని జ్వాలలు కూడా రేగాయి. మరొక వైపు తమ సిబ్బంది పరిరక్షణ కోసం మధ్య ప్రాచ్యంలో తమ సైనిక ఉనికిని పెంచుతున్నామని, ఆ యూదు దేశానికి అండగా నిలుస్తామని యుఎస్ తెలియజేసింది. ఆ ప్రాంతంలో యుద్ధ భయం నేపథ్యంలో వెంటనే లెబనాన్‌ను వీడవలసిందిగా తమ ప్రజలను బీరూట్‌లోని యుఎస్ రాయబార కార్యాలయం కోరింది.