Thursday, January 23, 2025

ఇంధనం, ఎరువులపై యుద్ధ ప్రభావం

- Advertisement -
- Advertisement -

మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చినా వెంటనే అది పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 1 శాతం పెరిగాయి. మార్కెట్‌లో స్థిరత్వం కోసం ఒపెక్ చమురు దేశాలు సరఫరాని కొంత తగ్గించాయి. ధరల్లో పెద్దగా మార్పు లేకపోయినా, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ సంఘర్షణలతో చమురు ధరలు కచ్చితంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ భూభాగంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం, ఇజ్రాయెల్ ఆయిల్ ట్యాంకర్‌పై దాడి తదితర సంఘటనలు తాజాగా చోటు చేసుకోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతల జ్వాలలు చెలరేగి విదేశీ చమురు, సహజ వాయువుల సరఫరాపై ఆధారపడిన భారత్‌కు అగ్నిపరీక్ష ఎదురైంది.

భారత్ రోజూ 4.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును, అంటే తన అవసరాల్లో 88%, అలాగే 47% సహజ వాయువు డిమాండ్ కోసం ధ్రువీకృత సహజవాయువు (లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్)ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. చాలా వరకు ఈ అవసరాలు రెండు సముద్ర మార్గాల మీదుగా నౌకల ద్వారా భారత్‌కు చేరుకొంటుంటాయి. ఈ సముద్ర మార్గాల్లో ఒకటి హౌముజ్ జలసంధి కాగా, రెండవది ఎర్రసముద్రం (రెడ్‌సీ). ఎందుకంటే చైనా, అమెరికా మాదిరిగా భారత్‌కు రవాణా పైపులైన్లు లేవు. గాజాపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా యెమెన్ కేంద్రంగా ఉన్న హోతీ రెబెల్స్ దాడులతో జనవరి నుంచి ఎర్ర సముద్రం నౌకా రవాణా మార్గం తీవ్ర ఒత్తిడులను ఎదుర్కొంటోంది.

ఇప్పుడు హౌముజ్ జలసంధి కూడా తీవ్ర అలజడులకు గురవుతోంది. పర్షియా జలసంధికి, ఒమన్ జలసంధి, అరేబియా సమద్ర మార్గానికి అనుసంధానమైన హౌముజ్ జలసంధి ప్రపంచంలోనే అతి కీలకమైన చమురు రవాణా మార్గం. ఇప్పుడు పశ్చిమాసియా సంఘర్షణల వ్యాప్తితో సంక్లిష్ట పరిస్థితితో సతమతమవుతోంది. ఇరాన్ రోజుకు 3.2 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తుంది. అంతేకాక హౌముజ్ జలసంధిపై నియంత్రణ ఇరాన్‌దే. 30 శాతం చమురు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. అలాగే 70% చమురు నౌకలు దీని ద్వారా ఆసియాకు రవాణా అవుతుంటాయని ముంబైకు చెందిన వాణిజ్య వర్గాలు పేర్కొన్నాయి. ఏది ఉద్రిక్తత పెరిగినా ఇరాన్ చమురు ఉత్పత్తిపైనా హౌముజ్ జలసంధి రవాణా పైనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితంగా ఏప్రిల్‌లో బ్యారెల్ ఒక్కింటికి ముడి చమురు 90 డాలర్ల వరకు పెరగ్గా, ఇప్పుడు 100 డాలర్ల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

గత సెప్టెంబర్ నుంచి ఇది అత్యధిక స్థాయి అని చెబుతున్నారు. భారత్‌కు భారీగా చమురు సరఫరా చేసే రష్యా గత ఏప్రిల్ 14 వరకు భారత్‌కు కావలసిన ఇంధనంలో 34% మేరకు సుయెజ్ కెనాల్ ద్వారా సరఫరా చేయగలిగింది. భారత్‌కు డీజిల్ వంటి ఉత్పత్తుల ఎగుమతులకు ఎర్ర సముద్రం కూడా కీలకమైన రవాణా మార్గం. అయితే హోతీ దాడుల ఫలితంగా జనవరిలో ఈ మార్గం తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. భారత్‌కు కావలసిన ముడి చమురు ఉత్పత్తుల్లో మరో 46% హౌముజ్ జలసంధి ద్వారా గల్ఫ్ దేశాల నుంచి రవాణా అవుతుంటాయి. కానీ హౌముజ్ జలసంధి సమీపాన కంటైనర్ షిప్ ఎంఎస్‌సి ఏరియెస్‌ను ఇరాన్ ఏప్రిల్ 13న దాడి చేసి పట్టుకున్న తరువాత ఈ మార్గంలో నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాల సముద్ర రవాణాల్లో నాలుగో వంతు కన్నా ఎక్కువ హౌముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. అలాగే లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్ రవాణాలో అయిదో వంతు ఈ జలసంధి ద్వారానే జరగడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో భారత్‌లోని చమురు నిల్వలు కొన్ని రోజుల వరకే సరిపోతాయి.

ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ముడి చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వాణిజ్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. బ్యారెల్‌కు 90 డాలర్ల వంతున ధరలు పెరిగితే బారత రిఫైనర్లు అమ్మకాల్లో చాలా నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ముడి చమురు వాణిజ్యం బ్యారెల్‌కు 80 డాలర్ల వంతున పెరిగి ఉందని గమనించాలి. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన సమయంలో కూడా ఇంధనం, ఎరువుల సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని భారత్ ఎదుర్కోవలసి వచ్చింది. ఇక నేచరల్ గ్యాస్ దిగుమతిపై భారత్ రష్యా, ఇరాన్ వంటి ఇతర దేశాలపై ఆధారపడవలసి వస్తోంది. ఎరువుల తయారీకి ప్రాధాన్యం ఇచ్చి స్వదేశీయంగా సబ్సిడీ ధరకు గ్యాస్ లభిస్తేనే ఎరువులు ఉత్పత్తి అవుతాయి. ఆ తరువాత ఇళ్లకు, రవాణాకు గ్యాస్ కేటాయింపు ప్రాధాన్యం లభిస్తుంది. ఈ రీతి లో ప్రాధాన్యం లభిస్తే ఎల్‌ఎన్‌జి దిగుమతి మరింత పెరుగుతుంది.

ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ దేశాలు రణజ్వాలల్లో ఉండడంతో వాటి నుంచి భారత్‌కు చమురు, ఎరువులు రావడం కష్టమవుతోంది. ఈ దేశాల రీజియన్ నుంచి మొత్తం మీద 43 శాతం పొటాష్ సరఫరా అవుతుంది. ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే యూరియాలో 14% ఒక్క రష్యా నుంచే సరఫరా అవుతోంది. డిఎపిలో రష్యా సరఫరా దాదాపు 10 శాతం వాటాతో రెండో ఉత్పత్తిదారుగా రష్యా ఉంటోంది. ప్రపంచ దేశాలకు గ్యాస్ ఎగుమతిలో రష్యా వాటా 25% కన్నా ఎక్కువగా ఉంటోంది. రష్యా నుంచి ఐరోపా యూనియన్ దేశాలు 40 శాతం వరకు గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. అలాగే చమురు ఉత్పత్తిలో ప్రపంచం మొత్తం మీద మూడో ఉత్పత్తిదారుగా రష్యా ఉంటోంది. ముడి చమురు ఉత్పత్తిలో 12 శాతం రష్యా నుంచే వస్తోంది. భారత్ విషయానికి వస్తే పొటాష్‌లో కావలసినవి 50 శాతం రష్యా, బెలారస్ నుంచే రప్పించుకోక తప్పదు. భారత్ డిఎపి డిమాండ్‌లో దాదాపు 60 శాతం చైనా, సౌదీ అరేబియా నుంచే లభిస్తోంది. గ్యాస్ గురించి చూస్తే భారత్‌కు సరఫరా అయ్యే మార్గాలు 10 శాతం నుంచి రష్యా నుంచే కాకుండా వైవిధ్యంగా ఉంటున్నాయి.

యుద్ధం తీవ్రమవుతోన్న దశలో రష్యా తదితర దేశాల నుంచి సరఫరాలకు భారీ అంతరాయం కలుగుతోంది. ఐరోపా యూనియన్ , అమెరికా దేశాల ఆర్థిక ఆంక్షలు గనుల తవ్వకం నుంచి ఉత్పత్తి, ఉత్పత్తి నుంచి రోడ్డు, సముద్ర రవాణా మార్గాలు అనుకూలంగా ఉండడం లేదు. నల్లసముద్రంలో యుద్ధ నౌకలు స్థావరం కావడంతో సముద్ర రవాణా స్తంభించి పోతోంది. మరికొన్ని నెలల వరకైనా ఈ ఆటంకాలు ఎదురుకావచ్చు. భారత దేశానికి సరఫరాలో ఇబ్బందులే కాకుండా దిగుమతుల వ్యయం బిల్లు కూడా అమాంతంగా పెరిగే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. పొటాష్ సరఫరాలో ఈ ఆటంకాలు బాగా ఉంటాయి. రష్యా, బెలారస్ వల్ల మన అవసరాలు 50 శాతం తీరుతున్నా, ఈ రీజియన్‌లో మనం ఆధారపడడం తక్కువే అయినా సరఫరాలో భారీ కోత కారణంగా భారత్ దిగుమతి బిల్లు అత్యధికంగా చెల్లించవలసి వస్తోంది. స్వేచ్ఛా విపణిలో ఈ పరిశ్రమ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు.

పి. వెంకటేశం
9985725591

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News