Wednesday, January 22, 2025

హమాస్ ఉనికి ఎప్పటి నుంచి?

- Advertisement -
- Advertisement -

టివిలు, పత్రికల్లో ప్రస్తుతం హమస్ అనే సంస్థ గురించి వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా తాజా పరిణామాలపై ఎన్నో అవాస్తవాలు, వక్రీకరణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం. చరిత్రనంతటినీ ప్రస్తావించటం ఇక్కడ సాధ్యం కాదు గనుక క్లుప్త వివరణకే ఇది పరిమితం. ఈ రోజు మనం పాలస్తీనా అని చెబుతున్న ప్రాంతం లేదా చరిత్రలో ఉందని భాష్యం చెబుతున్న ఇజ్రాయెల్ గానీ ఎన్నడూ ఒక స్వతంత్ర దేశంగా లేవు. ఏదో ఒక సామ్రాజ్యంలో భాగాలుగా చేతులు మారుతూ వచ్చాయి. క్రీస్తు పూర్వమే ఈ రెండు పేర్లూ వాడుకలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. తొలుత క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో అస్సీరియన్లు యూదుల మీద దాడి చేసి జుడా రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. యూదులను తరిమివేశారు. తరువాత క్రీస్తుశకం మధ్యయుగాల్లో మత యుద్ధాల్లో యూదులు అనేక ప్రాంతాలకు పారిపోయారు. నాడు పేరు ఏదైనా అవి ఏదో ఒక సామ్రాజ్యంలో భాగాలు, సామంతదేశాలే. రోమన్ లేదా ఒట్టోమన్ మాదిరి యూదుల సామ్రాజ్యం అనేది లేదు.

చరిత్రలో పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రాంతం చివరిగా టర్కీ కేంద్రంగా పాలన సాగించిన ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. ప్రపంచమంతటినీ ఆక్రమించిన బ్రిటీష్, ఫ్రెంచి ఇతర సామ్రాజ్యవాదులకు అది స్వాధీనం కాలేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో దాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బ్రిటీష్ పాలకులు అనేక పాచికలను వాడారు. వాటిలో ఒకటి ఒట్టోమన్ సామ్రాజ్యం నుంచి స్వాతం త్య్రం కోరుతున్న అరబ్బులకు పాలస్తీనాను ఏర్పాటు చేస్తామని ఒక వైపు ఆశ చూపారు. మరోవైపు యూదులకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని వారి మద్దతును కూడగట్టేందుకు పూనుకున్నారు. ఎందుకంటే అనేక దేశాల్లో యూదులు బ్యాంకర్లుగా, ఇతరత్రా ధనవంతులుగా ఉన్నారు కనుక వారి అవసరం ఉన్నందున అలా చేశారు. ఆ బ్రిటీష్ వారు, తరువాత వారి స్థానాన్ని ఆక్రమించిన అమెరికన్ సామ్రాజ్యవాదులు పెట్టిన చిచ్చే పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం.

మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం పతనమైన తరువాత సామ్రాజ్యవాదుల పంపకాల్లో పాలస్తీనా ప్రాంతాన్ని బ్రిటీష్ వారు తీసుకున్నారు. అప్పటికే పశ్చిమాసియాలో చమురు నిల్వలు, ఇతర ప్రాంతాల్లో సహజ సంపదలను గమనించి ఆ ప్రాంతంలో తమకు నమ్మకమైన బంటు ఉండాలంటే ఇజ్రాయెల్ ఏర్పాటు ఒక సాధనంగా భావించిన బ్రిటీష్ వారు. అనేక దేశాల్లో దాడులకు గురైన యూదులందరినీ పాలస్తీనాకు అక్రమంగా రప్పించారు. అక్కడ వారు నివాసాలను ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. స్థానికంగా వున్న అరబ్బులను వారి ప్రాంతాల నుంచి గెంటివేయటం అప్పుడే ప్రారంభమైంది. బ్రిటీష్ వారి కుట్రను గమనించేలోగా రెండవ ప్రపంచ యుద్ధం, తరువాత యూదుల వలసలు మరింత పెరిగాయి. తరువాత పాలస్తీనా ప్రాంతాన్ని మూడుగా విభజించి పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలుగా ఏర్పాటు, జెరూసలెం పట్టణం, పరిసరాలను ఐరాస ఆధీనంలో ఉంచాలంటూ చేసిన ప్రతిపాదనకు ఐరాస సాధారణ అసెంబ్లీలో 1947 నవంబరు 29న మెజారిటీ ఆమోదం వచ్చేట్లు సామ్రాజ్యవాదులు చూశారు.

దానిని ఆ ప్రాంత దేశాలు, అరబ్బులు అంగీకరించలేదు. ఐరాస తీర్మానం సాకుతో అప్పటికే సాయుధంగా సిద్ధంగా వున్న యూదులు తీర్మానాన్ని పక్కనపెట్టి పాలస్తీనా ప్రాంతాలను కూడా ఆక్రమించి అరబ్బులను తరిమివేశారు. దాంతో అరబ్బులు ప్రతిఘటన ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు పాలస్తీనా ఏర్పడలేదు. ఇజ్రాయెల్ ముందుగా వేసుకున్న పథకం ప్రకారం పాలస్తీనా ప్రాంతాల ఆక్రమణకు పూనుకోవడంతో పక్కనే ఉన్న ఈజిప్టు, సిరియా, జోర్డాన్, ఇరాక్ పాలస్తీనా ప్రాంతాలను దురాక్రమణ నుంచి కాపాడి కొన్నింటిని తమ అదుపులోకి తీసుకున్నాయి. ఐరాస తీర్మానాన్ని గుర్తించేందుకు ఇజ్రాయెల్ నిరాకరిస్తోంది. తన భద్రతకు కొన్ని పాలస్తీనా ప్రాంతాలు కావాలని చెబుతోంది. దానికి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మద్దతు పలుకుతున్నాయి.

పాలస్తీనా విముక్తి కోసం పిఎల్‌ఒ ఏర్పడింది. అది శాంతియుత, సాయుధ పద్ధతుల్లో పోరాడుతోంది. 1980 దశకం నాటికి అరబ్బుల్లో అసహనం పెరిగింది. పిఎల్‌ఒ సమర్థవంతంగా ఎదుర్కోవడం లేదనే అసంతృప్తి ఉంది. ఈ పూర్వరంగంలో హమాస్ అనే సంస్థ 1987లో ఉనికిలోకి వచ్చింది. దాన్ని ఏర్పాటు చేయడంలో మత పెద్దలు కూడా ఉన్నారు.1973లో ముస్లిం బ్రదర్ హుడ్ అనే సంస్థ ఈజిప్టులో ఏర్పడింది. దానిలో పాలస్తీనా ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు. ఆ సంస్థలో చీలిక వచ్చి హమస్ ఏర్పడింది. 1988 ఆగస్టున హమస్ ప్రణాళిక పేరుతో తొలిసారిగా ఆ పేరును వెలుగులోకి తెచ్చారు. అప్పటి నుంచి అది ఇజ్రాయెల్ పోలీసులు, భద్రతా దళాల దుశ్చర్యలకు ప్రతిగా తానూ దాడులు జరుపుతోంది. అది సరైందా కాదా అంటే పౌరుల మీద ఎవరు దాడులు జరిపినా సమర్థించనవసరం లేదు. ఇజ్రాయెల్ యూదులు సామాన్యపౌరులమీద బాంబులు విసురుతుంటే పాలస్తీనా అరబ్బులు రసగుల్లాలు విసురుతారా?తమ ప్రభుత్వం మీద పోరాడే ప్రతివారినీ ఉగ్రవాద ముద్రవేసి ఇజ్రాయెల్ అణచివేస్తున్నది.

అంతకు ముందు పిఎల్‌ఒ, తరువాత హమాస్ ఇతర సంస్థలనూ అదే మాదిరి పరిగణించింది. 1994 ఫిబ్రవరిలో రంజాన్ ప్రార్ధనలు చేస్తున్న ముస్లింలను 29 మందిని గోల్డ్ స్టెయిన్ అనే యూదు దురహంకారి మిలిటరీ దుస్తులతో వెళ్లి పశ్చిమ గట్టు ప్రాంతంలోని హెబ్రాన్ నగరంలోని ఒక మసీదులో కాల్చి చంపాడు. తరువాత జరిగిన ఉదంతాలలో మరో 19 మంది పాలస్తీనియన్లను భద్రతా దళాలు చంపి వేశాయి. సామాన్య పౌరులు, మిలిటెంట్లకు తేడా చూపకుండా ఇజ్రాయెల్ చర్యలు ఉన్నందున తాము కూడా అదే బాట పడతామని హెబ్రాన్ ఉదంతం తరువాత హమాస్ ప్రకటించింది. ఇదే సమయంలో పిఎల్‌ఒ, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఓస్లో ఒప్పందాన్ని అది వ్యతిరేకించింది. దానిలో భాగంగానే 1996లో జరిగిన పాలస్తీనా ఎన్నికలను, 2005లో పాలస్తీనా అధ్యక్ష ఎన్నికను బహిష్కరించింది. యాసర్ అరాఫత్ మరణించిన తరువాత 2006లో జరిగిన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసింది.

గాజా ప్రాంతంలో మెజారిటీ సీట్లు తెచ్చుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వెస్ట్ బాంక్ ప్రాంతంలో ఫతా అధికారంలో ఉంది.మన దేశంలో రాష్ర్ట ప్రభుత్వాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉండదు, అలాగే గాజాలోని హమాస్ ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు లేదు, ఎందుకంటే అది పాలస్తీనాలోని ఒక ప్రాంత ప్రభుత్వం మాత్రమే. హమాస్ ప్రభుత్వానికి మిలిటరీలేదు, హమాస్ గెరిల్లాలు మాత్రమే దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్ మిలిటరీ ఆ గెరిల్లాలను అణచేపేరుతో జనావాసాలపై దాడులు చేసి పౌరులను హతమారుస్తున్నది. విమానాలతో బాంబులు వేస్తున్నది, గాజా వాసులకు మంచినీరు, విద్యుత్, ఆహారం, ఔషధాల సరఫరాలను నిలిపివేసిందంటే సామాన్య పౌరుల మీద దాడి తప్ప మరొకటి కాదు. గాజా ప్రాంతం నుంచి తప్పుకున్నా 2006 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ పది సార్లు మిలిటరీ దాడులు జరిపింది.

పాలస్తీనాకు చెందిన గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక నిర్బంధ శిబిరంగా మార్చి వేసింది. దాని చుట్టూ సరిహద్దులో మనుషులు దాటడానికి వీలులేని ఆరు మీటర్ల ఎత్తున పెద్ద ఇనుప ముళ్ల కంచెను ఏర్పాటు చేసింది. దాని పొడవు 65 కిలోమీటర్లు, డ్రోన్లు, రిమోట్ కంట్రోలు మెషిన్‌గన్లు, కెమెరాలు దానికి అమర్చి ఉంటాయి.ఏదైనా అలజడి సమాచారం ఉంటే ఐదు నిమిషాల్లో దాడులు చేసే హెలికాప్టర్లు సిద్ధంగా ఉంటాయి. బుల్డోజర్లతో తప్ప ఆ కంచెను ధ్వంసం చేయలేరు. దాన్ని దాటి 400 మంది హమాస్ గెరిల్లాలు ట్రాక్టర్ల మీద వచ్చారని చెబుతున్నారు. ఒకవైపు ఈజిప్టు, మరోవైపు మధ్యధరా సముద్రం, రెండు వైపులా ఇజ్రాయెల్ మిలిటరీ ఉంటుంది. గాజా వాసులు వెలుపలికి రావాలంటే ఇజ్రాయెల్ అనుమతి లేకుండా కుదరదు. హమాస్ గెరిల్లాలు కంచెను దాటి కొందరు క్షిపణులు ప్రయోగించారు. కొన్ని చోట్ల కంచె లోపలి నుంచే వదిలారు. దీన్ని ఇజ్రాయెల్ పసిగట్టలేకపోయింది.

ఏదో జరగబోతోందని ముందే తాము హెచ్చరించామని ఈజిప్టు నిఘా అధికారులు చెప్పారు. తాము కూడా మిలిటరీని హెచ్చరించామని ఇజ్రాయెలీ గూఢచారులు కూడా చెబుతున్నారు. తమకెలాంటి సమాచారమూ లేదని మిలిటరీ చెప్పింది. ఇది ఒక రహస్యంగా మిగిలిపోయింది. పాలస్తీనా ప్రాంతాల మీద ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో అనేక సార్లు దాడులు చేసింది. తమ వ్యతిరేకులను అణచివేసినట్లు చెప్పుకుంది. ఇప్పుడు కూడా అదే చెబుతోంది. హమాస్ లేదా మరొక తిరుగుబాటుదార్లను అణచివేయడం నిజంగా సాధ్యమవుతుందా? ప్రజల మీద దాడులు కొనసాగినంత కాలం ప్రతిఘటన వీరులు పుడుతూనే ఉంటారన్నది చరిత్ర చెప్పిన సత్యం. హమస్‌గాకపోతే మరొక పేరుతో మరో సంస్థ పుట్టుకు వస్తుంది. హమాస్ కంటే ముందుకు కూడా సాయుధ దాడులు చేసిన వారు ఉన్నారు కదా! పాలస్తీనాకు 1947 తీర్మానం ప్రకారం దాని ప్రాంతాలను దానికి అప్పగిస్తేనే ఇజ్రాయెల్ మీద తిరుగుబాటు లేదా ఆత్మరక్షణ దాడులు నిలిచిపోతాయి.

లేకుంటే మరో ఏడు దశాబ్దాలు గడిచినా చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. వందల సంవత్సరాల నాడు, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు హిట్లర్ యూదులను లక్షల సంఖ్యలో హతమార్చినా వారు అంతరించలేదు. అలాంటిది పాలస్తీనియన్లు లేదా అరబ్బులను అణచివేయటం, పూర్తిగా తుడిచిపెట్టడం సాధ్యమవుతుందా? ఈ పాఠాన్ని యూదులు, వారిని సమర్ధించేవారు మరచిపోతే ఎలా ?

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News