హెజ్‌బొల్లా లక్షం పేరిట ఇజ్రాయెల్ బుధవారం లెబనాన్‌పై దాడికి దిగింది. వైమానిక దాడిలో కనీసం 21 మంది పౌరులు మృతి చెందారని అధికారులు తెలిపారు. పలు చోట్ల దాడులు జరిగాయి. ఇందులో దక్షిణాది పట్టణం క్వానాలోనే 15 మంది వరకూ బాంబుల దాడితో దుర్మరణం చెందారని వెల్లడైంది. లెబనాన్ లోతట్టు ప్రాంతాలపై తరచూ ఇజ్రాయెల్ సేనలు దాడికి దిగుతూనే ఉన్నాయని , పౌర ప్రాంతాలను కూడా వదిలిపెట్టకుండా అరాచకం సాగుతోందని విమర్శలు వెల్లువెత్తాయి. దాడులలో పౌరుల దుర్మరణం చీకటి అధ్యాయం అని నిరసనలు వ్యక్తం అయ్యాయి. నబటియె నగరంలో ఇప్పుడు ఆరుగురు మృతి చెందారు.
ఇంతకు ముందు ఈ నగరంపై ఇజ్రాయెల్ ముప్పేట దాడితో శతాబ్దాల చరిత్ర ఉన్న మార్కెట్ ధ్వంసం అయింది. అప్పటి దాడిలో నగర మేయర్ కూడా మృతులలో ఉన్నారు. ఇజ్రాయెల్ కావాలనే ఉద్ధేశపూరిత దాడులకు దిగుతోందని లెబనాన్ ఆపద్ధర్మ ప్రధాని నేజీబ్ మికతి మండిపడ్డారు. సహాయ చర్యల గురించి సమీక్షించేందుకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉండగా, దీనిపై కూడా బాంబుల వర్షం కురిపించారని చెప్పారు ఇటువంటి చర్యలపై అంతర్జాతీయ సమాజం కిమ్మనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జరిగిన దాడులపై ఇజ్రాయెల్ సైన్యం నుంచి ఎటువంటి అధికార స్పందన వెలువడలేదు.