Wednesday, January 22, 2025

గాజా అంధకారం

- Advertisement -
- Advertisement -

గాజాను తలచుకొంటేనే గుండె బేజారెత్తుతోంది. అక్కడున్న 20 లక్షలకు పైగా పాలస్తీనా ప్రజలు కనీస మానవీయ సౌకర్యాలైన మంచినీరు, విద్యుత్తు, ఇంధనం, మందులకు, తిండికి కూడా నోచుకోకుండా, పసి పిల్లలను ఎలా సాకాలో తెలియని హృదయ విదారక స్థితిలో ఎలా బతుకుతున్నారో ఊహించడం కష్టం. ఈ నెల 7న హమాస్ తనపై జరిపిన భీకర దాడికి ప్రతీకారంగా దానిని నిర్మూలించే పనిలో భాగంగా గాజా జనావాసాల విధ్వంసానికి ఇజ్రాయెల్ సమకట్టింది. దాని దాడుల్లో అక్కడి భవనాలు నేలమట్టమవుతున్నాయి. వెంటనే గాజాను ఖాళీ చేయవలసిందిగా ఇజ్రాయెల్ చేసిన హెచ్చరిక మేరకు 10 లక్షలకు పైగా పాలస్తీనియన్లు ఇళ్ళు విడిచి రోడ్డున పడ్డారని వార్తలు చెబుతున్నాయి. వీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఆశ్రయం ఇస్తారు అనేవి ఇంకా స్పష్టం కాలేదు. వీరికి ఈజిప్టు ఆశ్రయమిస్తుందని, సరిహద్దుల్లోని రఫా అనే చోట దారి ఏర్పాటు చేస్తుందని అనుకొన్నారు. కాని అది ఇంకా అమలు కాలేదు. ఎటు పోదామన్నా ఇజ్రాయెల్ వైమానిక దాడులు తెరిపి ఇవ్వడం లేదని పాలస్తీనియన్లు వాపోతున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలోని దాదాపు 3000 మంది ఇప్పటి వరకు దుర్మరణం పాలయ్యారు.

1948లో లక్షలాది మంది పాలస్తీనియన్లను వారి భూభాగాల నుంచి ఇజ్రాయెల్ తరిమివేసిన ‘నక్బా’ (మహా మానవ ప్రళయం) తిరిగి చోటు చేసుకొంటున్న దృశ్యాలు గాజాలో కనిపిస్తున్నాయి. అప్పుడు పాలస్తీనాను విడిచి వెళ్ళిన వారు పలు అరబ్ దేశాలలో ఎక్కడెక్కడో స్థిరపడిపోయారే గాని, స్వస్థలాలకు తిరిగి చేరుకోలేదు. ఇప్పుడు కూడా అలాగే జరిగే ప్రమాదం కనిపిస్తున్నది. అయితే గాజాను ఆక్రమించుకొనే ఆలోచన చేయవద్దని ఇజ్రాయెల్‌కు అమెరికా హెచ్చరించిందని చెబుతున్నారు. కాని అది వినాలి కదా, వినకపోతే దానిని అమెరికా ఏమైనా చేయగలదా? ఇజ్రాయెల్‌ను వెనక్కి లాగే సదుద్దేశం అమెరికాలో బొత్తిగా కనిపించడం లేదు. ఈ సమస్యకు దౌతపరిష్కారం లేదని సైనిక మార్గమే శరణ్యమని అది భావిస్తున్నట్టు రూఢి అవుతున్నది. అదే జరిగితే ఇజ్రాయెల్ ఎంత మంది పాలస్తీనియన్లనైనా బలి తీసుకొనే ప్రమాదం వుంది. అదే సమయంలో ప్రస్తుతానికి అమెరికా మాటను కాదనలేక లోలోపల రగులుతున్న అరబ్ దేశాలు ఊరకే చేతులు ముడుచుకొని కూచుంటాయా? హమాస్‌ను తీవ్రంగా ఖండించాలని వాటిని అమెరికా కోరినట్టు తెలుస్తున్నది. అందుకు వెనకాడిన ఆ దేశాలు మధ్య మార్గంగా హమాస్‌ను, ఇజ్రాయెల్‌ను ఒకే గాటన కడుతూ అమాయక జనాన్ని బలి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశాయి.

కాని గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులు ముష్కరంగా కొనసాగే కొద్దీ అవి దానితో యుద్ధానికి సిద్ధపడే అవకాశాలే కనిపిస్తున్నాయి. అది జరిగితే విస్తృత స్థాయి ప్రాంతీయ యుద్ధం చెలరేగడం ఖాయం. ఇప్పటికే ఈజిప్టు, ఇరాన్, టర్కీ, సూడాన్ వంటి దేశాలు పాలస్తీనియన్లకు, గాజాకు గట్టి మద్దతును ప్రకటించాయి. అలాగే సౌదీ అరేబియా, కతార్‌లు కూడా గాజాకు మద్దతు తెలిపినట్టు వార్తలు చెబుతున్నాయి. పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ వైఖరిని ఈ దేశాలు విమర్శించాయి. ఇంతేకాదు కెనడా కూడా గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతు తెలిపింది. అయితే ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని అది ఖండించింది. పాలస్తీనియన్ల కోసం కెనడా 10 మిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని కూడా ప్రకటించింది. గాజాకు ప్రపంచ దేశాల్లో మద్దతు పెరుగుతున్న కొద్దీ ఇజ్రాయెల్ ఇరుకున పడుతుంది. అమెరికా కూడా పునరాలోచన చేయక తప్పని పరిస్థితి తలెత్తవచ్చు. వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనా ప్రభుత్వానికి భిన్నంగా హమాస్ హింసా మార్గంలోనే ముందుకు వెళుతుంది. దానిని పూర్తిగా తుడిచి పెట్టాలన్న ఇజ్రాయెల్ లక్షం నెరవేరడం కష్టం. దశాబ్దాలుగా తీవ్రమైన అణచివేతకు, హింసాయుత దాడులకు గురి అవుతూ కాళ్ళ కింది నేల కదిలిపోతున్న పాలస్తీనియన్లలో పోరాట లక్షణం పెరుగుతుందే గాని తరగదు.

ఎంత మంది హమాస్ సభ్యులను హతమార్చినా వారు మళ్ళీ మరింతగా తయారయ్యే అవకాశాలే వున్నాయి. హమాస్ వద్ద కొన్ని వందల మంది ఇజ్రాయెలీలు బందీలుగా వున్నట్టు తెలుస్తున్నది. వీరి విడుదల అనే దానికే ఇజ్రాయెల్‌ను అదుపులో వుంచగల శక్తి వుంటుంది. ఈ విషయంలో హమాస్‌ను ఒప్పించడానికి ఐక్యరాజ్యసమితి కృషి చేస్తున్నట్టు తెలుస్తున్నది.అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ దాడులకు స్వస్తి చెప్పాల్సి వుంటుం ది. అమెరికాపై అరబ్ దేశాలు కలిగించే ఒత్తిడికి కూడా విశేష ప్రాధాన్యం వుంది. అందరి శక్తియుక్తులు ఫలించి గాజాలో పూర్వపు పరిస్థితి తిరిగి నెలకొనాలని ఆశిద్దాం. అయితే అమెరికా అదే పనిగా ఇజ్రాయెల్‌ను వెనకేసుకొని వెళడం ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తుంది. పాలస్తీనా భూభాగాల్లో దాని దురాక్రమణ, విస్తరణ శాశ్వతంగా ఆగనంత వరకు ఆ ప్రాంతం ఇలాగే అంటించిన బాంబుల గుట్ట మీద కూచొని వుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News