Monday, December 23, 2024

స్వతంత్ర పాలస్తీనా వైపు…?

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో కూడా ‘రెండు దేశాల’ పరిష్కారానికి వ్యతిరేకత వ్యక్తం చేసి ఎన్నికల్లో విశేష విజయాన్ని చూరగొన్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే నాటకమాడుతున్నాడు. అధికారంలో కొనసాగడానికి గాజాపై దాడులు కొనసాగిస్తున్నాడు. ఎన్నికలకు వెళ్ళవలసి వస్తే ప్రజాభిమానం పొందడానికి పాలస్తీనాపై రాజీలేని వైఖరిని ప్రదర్శిస్తున్నాడు. మూడు మాసాలకు పైగా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై సాగిస్తున్న దాడుల్లో ఇప్పటికే మృతుల సంఖ్య 25000 కి చేరుకొన్నది. మొన్న సోమవారం నాడు ఇజ్రాయెల్ సేనలు గాజాలోని రెండు ఆసుపత్రుల్లో చొరబడి క్షతగాత్రులకు చికిత్స అందకుండా చేసి సృష్టించిన అమానుషం అంతా ఇంతా కాదు.ఈ నెలలోనే అత్యంత బీభత్సమైన ఈ దాడిలో 50 మంది పాలస్తీనియన్లు మరణించారని సమాచారం.

ఇంకొకవైపు గత అక్టోబర్ 7 నాటి దాడిలో హమాస్ పట్టుకొని తీసుకెళ్లిన ఇజ్రాయెలీ బందీల బంధువులు సోమవారం నాడు జెరూసలెంలో పార్లమెంటరీ కమిటీ సమావేశ మందిరం ఎదుట ప్రదర్శన చేపట్టారు. హమాస్ నిర్బంధం నుంచి తమ బంధువులను తక్షణమే విడిపించాలని డిమాండ్ చేశారు. ఒక మహిళ సమావేశ మందిరంలోకి చొచ్చుకొనిపోయి బందీలుగా ఉన్న తమ బంధువులు ముగ్గురిలో కనీసం ఒక్కరినైనా విడుదల చేయించాలని వేడుకొన్నారు. అక్టోబర్ 7 నాడు జరిపిన దాడిలో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ నుంచి 253 మందిని బందీలుగా తీసుకువెళ్లారు. నవంబర్‌లో కుదిరిన స్వల్పకాల కాల్పుల విరమణ సమయంలో కొంత మంది విడుదల సాధ్యం కాగా, ఇంకా 130 మంది హమాస్ వద్ద ఉన్నారు. ఇజ్రాయెల్ తన వద్ద గల హమాస్ మిలిటెంట్లు సహా వేలాది మంది పాలస్తీనియన్ బందీలను విడుదల చేసినప్పుడు మిగతా ఇజ్రాయెలీ బందీలను వదిలిపెడతామని హమాస్ స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్‌కు తగిన రక్షణ హామీలు కల్పిస్తూ గాజాను స్వతంత్ర పాలస్తీనాగా ప్రకటించడం ద్వారా రెండు దేశాలు ఇరుగు పొరుగున మనుగడ సాగించేలా శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాలను అమెరికా, ఖతార్, ఈజిప్ట్‌లు ప్రారంభించినట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, విదేశాంగ మంత్రి బ్లింకెన్, ఇతర ఉన్నతాధికారులు గత వారం ఇజ్రాయెల్‌ను సందర్శించారు. బైడెన్‌తో మాట్లాడిన తర్వాత నెతన్యాహు ఎక్స్ (ట్విట్టర్)లో ఏకవాక్య పోస్టింగ్ పెట్టాడు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని ప్రకటించాడు. గాజాకు స్వాతంత్య్రం ఇజ్రాయెల్ భద్రతను బలి తీసుకొంటుందని, అందుకు తాను సిద్ధంగా లేనని నెతన్యాహు వెల్లడించాడు.

కాని రెండు దేశాల ఏర్పాటు ఒక్కటే ఆ ప్రాంతంలో శాశ్వత శాంతిని నెలకొల్పగలదని అమెరికా గట్టిగా భావిస్తున్నట్టు సమాచారం. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటర్రెస్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాల ప్రతిపాదనను, పాలస్తీనాకు గల స్వతంత్ర దేశంగా మనుగడ సాగించే హక్కును వ్యతిరేకించడం ఆమోదయోగ్యం కాదని ఆయన ప్రకటించారు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తే ఇజ్రాయెల్ ఆక్రమణలను ఖాళీ చేయవలసి వస్తుంది. జోర్డాన్ నది పశ్చిమ దిశలో ఇజ్రాయెల్, ఆక్రమిత వెస్ట్ బాంక్, హమాస్ ఆధీనంలోని గాజా ఉన్నాయి. పశ్చిమాసియాలో శాంతి సాధనకు స్వతంత్ర పాలస్తీనా సృష్టి ఒక్కటే పరిష్కారమని యూరోపియన్ యూనియన్ కూడా ప్రకటించింది. ఈ ప్రతిపాదనను నెతన్యాహు వ్యతిరేకించడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.

ఏదో విధమైన రెండు దేశాల ఒడంబడికకు నెతన్యాహును ఒప్పించవచ్చునని జో బైడెన్ వెలిబుచ్చిన ధీమా గమనించదగినది. ఆయనతో ఫోన్ సంభాషణలో రెండు దేశాల పరిష్కారానికి తాను వ్యతిరేకిని కానని నెతన్యాహు చెప్పినట్టు సమాచారం. గాజాను ఇజ్రాయెల్ ఇంతగా పీక్కొని తిన్న తర్వాత, వేలాది మంది బాలలను బలి తీసుకొన్న పిమ్మట పాలస్తీనా దేశాన్ని నిరాకరించినా, ఇజ్రాయెల్ రక్త దాహానికి అడ్డుకట్ట వేయకపోయినా పశ్చిమాసియా అణుబాంబు పేలినట్టు పేలే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఇరాన్ అగ్గి మీద గుగ్గిలం మాదిరిగా ఉన్నది.

ఎర్ర సముద్ర నౌకా రవాణా మార్గంపై హౌతీల దాడులు ఆగడం లేదు. యెమెన్ లోని హౌతీల మూలాలపై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. రోజు రోజుకూ ఆశాంతి పెరుగుతున్నది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెంచి జనజీవనాన్ని దుర్భరం చేస్తుంది. కొవిడ్‌తో ఛిద్రమైన దేశదేశాల ఆర్ధిక వ్యవస్థలు మరింత దెబ్బ తింటాయి. అందుచేత అమెరికా, ఖతార్, ఈజిప్ట్ చేస్తున్నాయని చెబుతున్న పరిష్కార యత్నాలు ఫలించాలని కోరుకొందాము. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు అనేక మార్గాలు ఉన్నాయని, సైన్యం లేని దేశంగా కూడా పాలస్తీనాను నెలకొల్పవచ్చని బైడెన్ అన్నట్టు తెలుస్తున్నది. అటువంటప్పుడు దాని రక్షణ బాధ్యతను ఇజ్రాయెల్‌కి అప్పగిస్తే ఆశిస్తున్న మార్పురాదు. పులి రక్షణలో మేకలను ఉంచినట్టే అవుతుంది. విజ్ఞతాయుతమైన పరిష్కారం వైపు అడుగులు పడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News