పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య 43 రోజుల పాటు జరిగిన యుద్ధంలో జరిగిన మారణ హోమం ప్రపంచాన్ని కదిలించింది. ఖతార్, ఈజిప్ట్ వంటి దేశాల చొరవతో నాలుగు రోజుల పాటు విరామం లభించిన యుద్ధానికి, మరో రెండు రోజుల పాటు విరామం పొడిగించారు. ‘ఈ విరామం తరువాత బలాన్నంతా ఉపయోగించి పాలస్తీనాలో పదహారేళ్ళ హమాస్ పరిపాలనను అంతమొదిస్తాం’ అని ఇజ్రాయెల్ ప్రకటించడంతో చిగురిస్తున్న శాంతి ఆశలపై నీళ్ళు చల్లినట్టయింది. గాజాపై అణుబాంబును ప్రయోగించాలన్న కొందరు ఇజ్రాయెల్ పార్లమెంటు సభ్యుల హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. ఈ యుద్ధం వెనుక పశ్చిమ దేశాల పెట్రో దాహం, ఆయుధాల లాభం ఉన్నదనేది బహిరంగమే. తొలి నుంచి పాలస్తీనాకు వెన్నుదన్నుగా ఉన్న భారత ప్రభుత్వం ప్రస్తుతం ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపుతోంది. ఈ పరిణామం ఈ రోజుకీ రోజు కొత్తగా వచ్చింది కాదు. బాబ్రీ మసీదును 1992లో విధ్వంసం చేసినప్పటి నుంచి, దేశంలో మతోన్మాద శక్తులు బలం పుంజుకోవడంతో ఈ మార్పు మొదలైంది.
కారణం లేకుండా హమాస్ దాడి చేయలేదని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుట్టర్ అన్న మాటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ యుద్ధం ఎక్కడ మొదలైందీ తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. మక్కా తరువాత అంత పవిత్ర స్థలంగా భావించే జెరూసలెంలోని అల్‌ఇక్బాల్‌కు అరబ్బులు వెళుతుండగా ఇజ్రాయెల్ సైన్యం వారిని అడ్డుకోవడంతో మర్నాడు హమాస్ ఈ దాడికి పాల్పడడంతో 1200 మంది ఇజ్రాయెల్ దేశస్థులు మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడిలో 13,300 మంది పాలస్తీనీయులు మృతి చెందారు. ఇదొక పెను విషాదం. మొదటి ప్రపంచ యుద్ధానంతరం పాలస్తీనా బ్రిటిష్ వారి వశమైంది. ఈ భూభాగాన్ని 1948లో పాలస్తీనా, ఇజ్రాయెల్‌గా విభజించి బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు. ఇలా విభజించడాన్ని భారత్ గట్టిగా వ్యతిరేకించింది. ఈ విభజన వల్ల అరబ్బులకు అన్యాయం జరుగుతుందని నాటి ప్రభాని నెహ్రూ ప్రకటించారు. గాంధీజీ కూడా విభజనను వ్యతిరేకిస్తూ, యూదులు, అరబ్బులు కలిసి జీవించాలని పిలుపునిచ్చారు.
ఈ వాదనకు భిన్నంగా అంబేద్కర్ యూదులకు ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఏర్పడడాన్ని సమర్థించారు. పాలస్తీనా విమోచనా సంస్థ అధినేత యాసర్ ఆరాఫత్‌ను పాలస్తీనా ప్రజల నిజమైన ప్రతినిధిగా 1975లో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు. పాలస్తీనాను గుర్తించిన భారత దేశం ఆనాటి రాజధాన్ని గాజాలో తన రాయబార కార్యాలయాన్ని తెరిచింది. పాలస్తీనాను గుర్తించిన ముస్లిమేతర దేశాల్లో భారతదేశం తొట్ట తొలి దేశంగా నిలిచిపోయింది. భారత ప్రభుత్వం ఇందిరా గాంధీ అంతర్జాతీయ శాంతి అవార్డును తొలి సారిగా పాలస్తీనా విమోచనా సంస్థ నాయకుడు యాసర్ ఆరాఫత్‌కు ఇచ్చి ఆయన్ని ఘనంగా సత్కరించింది. పాలీస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్య సమితిలో భారత్ మొదటి నుంచి సూచిస్తూ వస్తోంది.
ఇజ్రాయెల్‌ను కూడా భారత ప్రభుత్వం 1950లో గుర్తించినప్పటికీ, 1992 వరకు ఆ దేశంతో దౌత్యసంబంధాలు నెరపలేదు. దేశంలో ఎమర్జెన్సీ అనంతరం జనతా పార్టీ ప్రభుత్వం కొలువ దీరాక, జాతీయ అంతర్జాతీయ విధానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జనతా పార్టీ ఆవిర్భావం నుంచి అందులో భాగమైపోయిన బిజెపి పూర్వరూపమైన జనసంఘ్ ఒక ప్రబలమైన శక్తిగా బలపడడంతో పాలస్త్తీనాభారత్ సంబంధాల్లో మార్పు మొదలైంది. బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత ముస్లిం వ్యతిరేకతతో పాలస్తీనాకు దూరమవుతున్న భారత ప్రభుత్వం, ఇజ్రాయెల్‌కు దగ్గరవడం మొదలు పెట్టింది. ఇజ్రాయెల్ కూడా ముస్లిం వ్యతిరేకత వున్న దేశాలతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం ప్రారంభించింది. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఖండించడంలో భారత ప్రభుత్వం గొంతు తగ్గించడం కోసం, భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో ఇజ్రాయెల్ భారత దేశానికి పెద్ద ఎత్తున ఆయుధ సహాయం చేసింది. ఇజ్రాయెల్‌ను 2017లో సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గుర్తింపు పొందారు.
నరేంద్ర మోడీ ఇజ్రాయెల్‌కు తన వెంట గుజరాత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం అదానీని వెంట బెట్టుకుని వెళ్ళారు. అక్కడి రెండవ అతిపెద్ద ఓడరేవు నిర్వహణ బాధ్యత అదానీకి దక్కింది. ఇప్పటికీ ఆ ఓడరేవు అదానీ నిర్వహణలోనే వుంది. పాకిస్తాన్ తీవ్రవాదులు 2008లో ముంబయి తాజ్ హోటల్ పైన దాడి చేసినప్పుడు మరణించిన 166 మందిలో ఇజ్రాయెల్ దేశస్థులు కూడా ఉన్నారు. ఈ దారుణ సంఘటనకు బాధ్యులుగా భావిస్తున్న లష్కరే తాయిబా అనే పాకిస్తానీ ఉగ్రవాద సంస్థను నిషేధిస్తున్నట్టు పదిహేనేళ్ళ తరువాత ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇజ్రాయెల్ సాంకేతికంగా, వైజ్ఞానికంగా అభివృద్ధి చెందడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బాగా ఆకర్షించింది. చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 1999లో ఇజ్రాయెల్ వ్యవసాయాన్ని ప్రవేశపెట్టారు. ఇజ్రాయెల్‌కు చెందిన బ్రైట్‌హషిత్ కంపెనీకి కోట్ల రూపాయలు చెల్లించి వ్యవసాయాన్ని ఆధునీకరించే బాధ్యతను దానికి అప్పగించారు. దీనికి పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. బ్రైట్‌హషిత్ కంపెనీకి ప్రభుత్వం కన్సెల్టెన్సీ ఫీజు కింద కోట్ల రూపాయలు చెల్లించింది. కాంట్రాక్టు తీసుకున్న ఈ కంపెనీ కొన్ని రోజులకు ఉడాయించింది. ఇజ్రాయెల్ సేద్యంతో కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, రామకుప్పం, గుడుపల్లి, వి.కోట రైతులు కుప్పకూలిపోయారు. ఇజ్రాయెల్ అనగానే పెగాసిస్ స్పైవేర్ గుర్తుకొస్తుంది.
ఇజ్రాయెల్ కు చెందిన ఎన్.ఎస్.ఓ కంపెనీ ఈ గూఢచర్య వైరస్‌ను తయారు చేసింది. ఈ వైరస్‌ను ఎవరి సెల్‌ఫోన్లలోకైనా పంపిస్తే వారి అనుపానులన్నీ తెలుసుకోవచ్చు. పెగాసెస్ వైరస్ తొలి దశలో భారత్, ఫ్రాన్స్ దేశాల్లో ప్రయోగించినట్టు వెల్లడైంది. ఫ్రాన్స్ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించి, తన పౌరుల వ్యక్తిగత గోప్యత రక్షణ కోసం వెంటనే రంగంలోకి దిగింది.ఫ్రాన్స్‌లో మొరాకోకు చెందిన వ్యక్తి ఆ ప్రభుత్వం పేరుతో ఈ గూఢచర్యానికి పాల్పడినట్టు గుర్తించి, ఆ దేశానికి తన నిరసనను తెలిపింది. ఫ్రాన్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం గల మొరాకో వెంటనే నాటి ఇజ్రాయెల్ ప్రధాని నఫ్టాలి బెన్నెత్‌కు ఫోన్ చేసి ఈ గూఢచర్యానికి సమాధానం చెప్పాలని నిలదీసింది. భారత దేశంలో ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రచయితల సెల్‌ఫోన్లలోకి పెగాసెస్ వైరస్‌ను పంపినట్టు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ల్యాబ్‌లో నిర్ధారణ జరిగింది. నిజానికి పెగాసెస్ వైరస్‌ను తయారు చేసిన ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఒ దీన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించదు.
కేవలం సార్వభౌమాధికారం ఉన్న ప్రభుత్వాలకు మాత్రమే అమ్మాలనే నిబంధన పెట్టుకుంది. ఫ్రాన్స్‌లో పెగాసెస్ ద్వారా గూఢచర్యానికి పాల్పడిన మొరాకో వ్యక్తి ఆ ప్రభుత్వం పేరుతో దాన్ని కొని ఉపయోగించాడు. మరి భారత దేశంలో ఈ వైరస్‌ను ఎవరు కొని ఉపయోగించారన్నది ప్రశ్న. ఈ వైరస్‌ను ఉపయోగించారనడానికి ఆధారాలేమిటని ప్రభుత్వం ప్రశ్న వేసింది. దీనిపై ప్రతిపక్షాలు పార్లమెంటులో లేవదీస్తే, చర్చకు ప్రధాని మోడీ అంగీకరించలేదు. పౌరుల వ్యక్తిగత గోప్య త అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ హక్కుకు భంగం కలిగించారంటూ సుప్రీం కోర్టులో కుప్పతెప్పలుగా ఫిర్యాదులు వచ్చా యి. దేశంలో 121 మంది సెల్‌పోన్లలోకి పెగాసెస్‌ను పంపినట్టు ఫిర్యాదులు వచ్చినప్పడు ప్రభుత్వం ఎందుకు విచారించలేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.
దీని పైన కమిటీ వేసి ప్రభుత్వ అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు కోరింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కనుక, బైటపెట్టకూడదని కేంద్ర ప్రభుత్వం దాటవేసింది. అసలీ పెగాసెస్‌ను ఉపయోగించారా లేదా అని చెప్పడానికి కూడా భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఆరోపణ రాగానే విచారణ చేసి, మొరాకో ప్రభుత్వానికి నిరసన తెలిపిన ఫ్రెంచి ప్రభుత్వం లాగా భారత ప్రభుత్వం విచారణకు ఎందుకు ఆదేశించలేదు? రాజ్యాంగం కల్పించిన గోప్యత హక్కుకు భంగం కలిగించేలా ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, రచయితలు, మేధావులు మానవ హక్కుల కార్యకర్తల సెల్‌ఫోన్లలోకి ఈ వైరస్‌ను చొప్పించడంలో భారత ప్రభుత్వం ఇజ్రాయిల్ బంధం పూర్తిగా బలపడిందని స్పష్టమవుతోంది.
జాతి వివక్షతోనే బలపడుతున్న బంధం
మోడీ నాయకత్వంలో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి మైనారిటీ వ్యతిరేక చర్యలు చేపడుతోంది. ముస్లింలే ధ్యేయంగా పౌరసత్వ సవరణ చట్టం తేవడం, ఆందోళన చేస్తున్న వారి ఇళ్ళను బుల్డోజర్లతో నేలమట్టం చేయడం, శ్రీరామనవమి సందర్భంగా సంఘ్ పరివార్ శక్తులు శోభాయాత్ర పేరుతో ముస్లింలు నివసించే ప్రాంతాల్లో, వారి మసీదుల వద్ద కత్తులు, కాషాయ జెండాలతో ఊరేగింపులు జరిపి రెచ్చగొట్టడం, అల్లర్లను సృష్టించడం, కశ్మీరుకు స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం, అక్కడ అణచివేతకు పాల్పడడం వంటి చర్యల ద్వారా దేశంలో మైనారిటీ వ్యతిరేకతను పెంచి పోషిస్తోంది. మణిపూర్‌లో ఆరు నెలలుగా జాతి వైరంతో ఘర్షణలు జరుగుతుంటే, మెజారిటీ మెయితీల వైపు నిలబడి, వారు ఆయుధాలను ఎత్తుకుపోతుంటే కళ్ళప్పగించి చూస్తూ, మైనారిటీలైన కుకీల అణచివేతకు ఊతంగా నిలవడం బిజెపి ప్రభుత్వం జాతి వివక్షకు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వ బంధం జాతి వ్యతిరేక ప్రాతిపదికగానే రోజురోజుకూ బలపడుతోందనడానికి ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
రాఘవశర్మ
9493226180