Monday, December 23, 2024

ఎంతగా నష్టపోతున్నా యుద్ధం ఆగదు: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

- Advertisement -
- Advertisement -

టెల్‌అవీవ్ : తమ వైపు ఎంతటి బాధాకరమైన నష్టాలు జరిగినా హమాస్‌పై దాడులు ఆపేది లేదని, హమాస్ నిర్మూలన వరకూ సాగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. తాము సాగిస్తున్న దాడులలో బుధవారం హమాస్ కమాండర్ ఒక్కరు హతులు అయినట్లు తెలిపారు. హమాస్‌పై పూర్తి విజయం వరకూ తమ పోరు సాగుతుందని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రజలను ఉద్ధేశించి ఆయన టీవీల ద్వారా ప్రసంగించారు. యుద్ధంలో మన సుశిక్షిత సైనికులు మృతి చెందుతున్నారు. మంగళవారం 11 మంది సైనికులు మృతి చెందినట్లు నిర్థారణ అయింది. ఈ భూమి నుంచి హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడమే ఇజ్రాయెల్ లక్షం అని, ఇందుకు కారణాలు ఏమిటనేవి అందరికీ తెలిసిందేనని ప్రధాని చెప్పారు. భూతల దాడులతో ఇజ్రాయెల్ సేనలు ఇప్పుడు పలు ప్రాంతాలకు చొచ్చుకు వెళ్లాయని, యుద్ధం ఇప్పుడు కీలక దశకు చేరుకుందని, ఈ క్రమంలో ఇజ్రాయెల్‌కు బాధాకరమైన రీతిలో కొందరు సైనికులు బలి కావడం జరుగుతోందని, అయితే పోరు ఆపేది లేదని ఆయన తెలిపారు.

గాజాపై ఇజ్రాయెల్ దాడులతో ఇప్పుడు పూర్తి స్థాయిలో కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు పాలస్తీనియా టెలికమ్యూనికేషన్ల సంస్థ పాల్టెల్ తెలిపింది. గాజాలోని అతిపెద్ద శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ విమానాలు జరిపిన దాడిలో పలువురు మృతి చెందారని, వీరిలో ఏడుగురు బందీలు కూడా ఉన్నారని, విదేశీ పాస్‌పోర్టులు ఉన్న వారు ముగ్గురు ఉన్నారని పాలస్తీనియా మిలిటెంట్లు తెలిపారు. ఈ వాదనపై ఇజ్రాయెల్ ప్రధాని పెద్దగా స్పందించలేదు. ఇది చాలా క్లిష్టమైన యుద్ధం, సుదీర్ఘంగానే సాగుతుంది, ఇప్పటికిప్పుడు విజయం అసాధ్యం. అయితే విజయం ఇజ్రాయెల్‌దే అని నెతన్యాహు తెలిపారు. ఇందులో అన్ని కోణాలు ఉంటాయని, నష్టాలు, లాభాలు గాయాలు ఉండనే ఉంటాయని ముందుకు సాగాల్సిందేనని ఈ దశలో ప్రధాని తమ సేనలకు పోరు పిలుపు మరింత స్పష్టంగా ఇచ్చారు. బలి అయిన ఇజ్రాయెల్ సైనికుల కుటుంబాలను దేశం అంతా సాదరంగా చూసుకుంటుంది. సహోదరత్వం చాటుతుందని తెలిపారు.

సరిహద్దులలో వేచి ఉన్న విదేశీయులు
గాజా నుంచి ఈజిప్టు ద్వారా ఇతర దేశాలకు వెళ్లేందుకు పలువురు విదేశీయులు పాస్‌పోర్టులతో సరిహద్దులలో వేచి ఉన్నారు. వీరిలో అనేకులు గాయపడ్డవారే, ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం అవుతూ ఉండటంతో ఇక తమకు ఎక్కడా రక్షణ లేదని భావించి విదేశీయులు ఏదో విధంగా సరిహద్దులు దాటేందుకు యత్నిస్తున్నారు. దీనితో రాఫా ఇతర ప్రాంతాలలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు గాజా అంతటా కమ్యూనికేషన్స్ బ్లాకౌట్ ఏర్పడింది. దీనితో ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఎటువంటి సమాచారం లేక గాజాలోని ప్రజల ఇక్కట్లు మరింత తీవ్రతరం అయ్యాయి. ఇప్పుడు కమ్యూనికేషన్ బ్లాకౌట్‌తో తాము ఇంతకు ముందటిలాగా సహాయక చర్యలకు పాల్పడలేకపోతున్నట్లు ఐరాస ఇతరత్రా సహాయక బృందాలు తెలిపాయి. ఇజ్రాయెల్ కాల్బలం పలు వైపుల నుంచి దూసుకురావడం, మరో వైపు ఇజ్రాయెల్ వైమానిక దాడులు తీవ్రతరం అవుతూ ఉండటంతో శరణార్థులు క్యాంప్‌ల్లో ఉండలేక, వీధుల్లోకి రాలేక విలవిలలాడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News