Friday, December 20, 2024

ఇక బహుముఖ గ్రౌండ్ అటాక్….3…2..1

- Advertisement -
- Advertisement -

ఇక బహుముఖ గ్రౌండ్ అటాక్ ….3…2..1
ఉత్తర గాజాపై భూతల దాడికి ఇజ్రాయెల్ సిద్ధం
మూడుగంటల గడువు ..సరిహద్దులో సైన్యం సన్నద్ధం
గ్రీన్‌లైట్ వెలిగితే హమాస్ స్థావరాలపై దాడులు
ప్రజలు వెళ్లకుండా అడ్డుకుంటున్న మిలిటెంట్లు
మందులు దొరకని కిక్కిరిసిన ఆసుపత్రులు
ఆహారం నీటి కోసం జనం ఆరాటం
ప్రాణాల రక్షణకు ఉరుకులు పరుగులు
టెల్ అవీవ్: గాజాపై భారీ స్థాయిలో భూతల క్షేత్రస్థాయి దాడికి ఇజ్రాయెల్ సైన్యం సర్వం సన్నద్ధం అయింది. ఓ వైపు గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్ భీకర వైమానిక శతఘ్నుల దాడులతో లక్షలాదిగా సామాన్య ప్రజలు దారుణ స్థితిలో అనుక్షణ సంకట పరిస్థితి ఎదుర్కొంటుండగా సరిహద్దులలో అత్యధిక సంఖ్యలో ఇజ్రాయెల్ సైన్యం మొహరించింది. ఏ క్షణంలో అయినా బహుముఖ స్థాయి భూతల దాడులు జరుగుతాయని, పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు వెలువడ్డాయి. అయితే పౌరులు ఎటూ కదలకుండా హమాస్ బలగాలు నివారిస్తున్నాయి. ఈ దశలో ఇక తాము దాడికి అవసరం అయిన గ్రీన్‌లైట్ సంకేతానికి ఎదురుచూస్తున్నట్లు, తమ గ్రౌండ్ అటాక్ ఆరంభం కానుందని ఇజ్రాయెల్ సైనిక వర్గాలు ఆదివారం మధ్యాహ్నం సరిహద్దులలో తెలిపాయి.

హమాస్ మిలిటెంట్ల ఏరివేతనే లక్షంగా కీలక స్థాయి యుద్ధం ఉంటుందని తెలిపిన ఇజ్రాయెల్ సైన్యం పౌరులకు మూడు గంటల సమయం ఇచ్చింది. గాజా ఉత్తర ప్రాంతంలో ముందుగా తమ గ్రౌండ్‌లెవెల్ దాడి ఆరంభం అవుతుందని, ప్రజలు వెంటనే దక్షిణ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరికలు వెలువడ్డాయి. ఏ క్షణంలో అయినా ఈ ప్రాంతం అత్యంత భీకర పోరుకు వేదిక కానుందని తెలిపారు.ఇప్పటికే పలు విధాలుగా హమాస్‌పై సమన్వయరీతిలో దాడికి సిద్ధం అయినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) తెలిపింది.

గాజా సరిహద్దులకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సైనికులను ఉద్ధేశించి ప్రసంగించి వెళ్లారు. ఇక మరింతగా జరగాల్సింది ఉంది. సిద్ధం కావాలని వారికి పిలుపు నిచ్చినట్లు వెల్లడైంది. శనివారం రాత్రి తాము జరిపిన వైమానిక దాడులలోహమాస్ సైనిక విభాగం అగ్రశ్రేణి దళం నుక్బా అగ్రనేత బిలాల్ అల్ ఖెద్రాను తాము హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. క్షేత్రస్థాయిలో ఇక ఏ వైపు నుంచి అయినా దాడులు జరుగుతాయనే హెచ్చరికలతో లక్షలాదిగా పాలస్తీనియన్లు ఉత్తర గాజా వీడుతున్నారు. మధ్యలో వీరికి పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాగా ఇప్పటివరకూ జరిగిన పరస్పర దాడులతో మొత్తం మృతుల సంఖ్య 3600 దాటింది. ఇప్పటికి మృతులు, గాయపడ్డ వారి సంఖ్య , నిర్వాసితుల వివరాలు పూర్తిగా నిర్థారణ కాలేదు.

హమాస్‌కు పోరాటం… 23 లక్షల మందికి బతుకు ఆరాటం
గాజాలోని దాదాపు 23 లక్షల మంది పౌరులలో అత్యధికులు ఇప్పుడు ఆహారం, తాగేందుకు నీరు, బాంబుల దాడి నుంచి తలదాచుకునేందుకు నీడ కోసం వెతుక్కుంటున్నారు. ఇక ఆదివారం ఏ క్షణంలో అయినా ఇజ్రాయెల్ సేనలు గాజా ఉత్తర ప్రాంతాన్ని కైవసం చేసుకుంటాయనే వార్తలు వెలువడటంతో జనం పారిపోతున్నారు. అయితే ఈ క్రమంలో వారు తిండి , మంచినీరుకోసం వెతుక్కోవల్సి వస్తోంది. వేలాదిగా జనం ఇజ్రాయెల్ సేనల హెచ్చరికలతో గాజావీడేందుకు సిద్ధం అయ్యారు. అయితే క్షతగాత్రులు కిక్కిరిసిన ఆసుపత్రుల వైపు తరలివెళ్లుతున్నారు. వారం రోజులుగా సాగుతోన్న దాడులు ఆదివారం మరింత కీలక మలుపు తిరిగే వీలుందని స్థానికులు భయపడుతున్నారు. పౌరుల భద్రత కోణంలో ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం సరిహద్దుల్లో చాలా సేపు వేచి ఉంది. ఇక భీకరస్థాయి దాడిలో పరిస్థితి ఏమిటనేది పౌరులను దిక్కుతోచనిస్థితికి తెచ్చింది. ఇజ్రాయెల్ బలగాలు భారీ స్థాయిలో మొహరించాయి.

వీటికి మద్దతుగా మధ్యధరా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు నిలిచాయి. మిలిటెంట్లు సముద్రమార్గం మీదుగా ఎటువంటి చర్యలకు దిగకుండా దిగ్బంధించాయి. ఇప్పటివరకూ జరిగిన దాడులలో 2329 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కాగా 1300 మంది ఇజ్రాయెలీలు హమాస్ మెరుపుదాడులలో మృతి చెందారు. కాగా ఇప్పటికీ హమాస్ బందీలుగా ఉన్న పలు దేశాల వారి పరిస్థితి గురించి ఎటువంటి సమాచారం లేకుండా పోయింది. పౌరులంతా గాజా వీడి వెళ్లాలని ఇజ్రాయెల్ సేనలు తొలుత పలు ప్రాంతాలలో కరపత్రాలను వెదజల్లాయి. సామాజిక మాధ్యమాలలో కూడా హెచ్చరికలు వెలువరించారు. పదిలక్షల మంది పౌరులు వెంటనే ఉత్తర గాజావైపు వెళ్లాల్సి ఉంటుందని ఈ నేపథ్యంలో తెలిపారు. హమాస్ మిలిటెంట్ల నిర్మూలనకు ఇక తాము జరిపే దాడి అత్యంత తీవ్రస్థాయిలో ఉంటుందని, ఈ క్రమంలో పౌరులకు ప్రాణనష్టం నివారించేందుకు తాము తుది యత్నాలు చేపట్టినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

అయితే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఉత్తర ప్రాంతం వైపు వలసవెళ్లరాదని హమాస్ బలగాలు మైక్‌లలో తెలియచేస్తున్నాయి. దీనితో పౌరులకు మరింత సంకట స్థితి ఏర్పడింది. ఇక వేలాది మంది గాయపడ్డ వారితో పలు ఆసుపత్రులు కిక్కిరిసి ఉన్నాయి. మందులు, వైద్య పరికరాలు, ఆహారం నిల్వలు లేకుండా ఎక్కువ కాలం రోగులు ప్రాణాలతో ఉండే పరిస్థితి లేదని , వెంటనే ఆసుపత్రులకు తక్షణ సాయం అందాల్సి ఉందని గాజాలోని వైద్యవర్గాలు తెలిపాయి. ప్రత్యేకించి ఇజ్రాయెల్ గ్రౌండ్ లెవెల్ దాడుల ప్రాంతంలో ఉండే ఆసుపత్రులలోని రోగులు, అక్కడి వైద్యసిబ్బంది, గాయపడ్డ వారు , వారి బంధువులు ఇక ఏక్షణంలో ఏమి జరుగుతుందనే ఆందోళనతో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News