Monday, December 23, 2024

ఇజ్రాయెల్ అమానుష దాడి

- Advertisement -
- Advertisement -

గాజాపై ఇజ్రాయెల్ అమానుష దాడులు అన్ని మానవ మర్యాదలను, హద్దులను మీరిపోయి చివరికి ఆసుపత్రుల మీద కూడా విరుచుకుపడడం ప్రపంచంలోని మానవత్వం గల ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నది. 2000 మందికిపైగా రోగులు, సిబ్బంది, ఇతర నిస్సహాయ జనం వున్న గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిపై బుధవారం నాడు ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడి ఎంత మందిపై అగ్ని వర్షం కురిపించిందో! అందులో ఇంకెందరు చిన్నారులున్నారో? అంతర్జాతీయ మానవతా నియమాలను ఇజ్రాయెల్ పాటించడం లేదంటూ అమెరికా మిత్ర దేశం ఫ్రాన్స్ ఖండించిందంటే ఈ దాడులు కరడుగట్టిన సామ్రాజ్యవాదులకు సైతం కంటతడి పెట్టిస్తున్నాయని అర్థమవుతున్నది. హమాస్ నేరాలకు పాలస్తీనా ప్రజలపై కక్ష వహించడం సరి కాదని ముఖ్యంగా రోగులపైన, వారికి సేవలు చేస్తున్నవారి మీద దాడులు చేయడం తగదని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఖండించింది. బ్రిటన్ వరుసగా ఐదు శనివారాలు ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలతో దద్దరిల్లిపోయింది.

ఇజ్రాయెల్ గాజాలో సాగిస్తున్న నిర్విరామ దాడులకు, దానిని వెనుకేసుకొస్తున్న అమెరికా వైఖరికి వ్యతిరేకంగా వాషింగ్టన్‌లో కూడా ప్రదర్శనలు జరిగాయి. పాలస్తీనా విమోచన కోరుతూ, దాని జెండా ఎగురవేస్తూ వేలాది మంది ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ప్రెసిడెంట్ బైడెన్ ఇజ్రాయెల్ చేతిలో కీలుబొమ్మ అయిపోయారంటూ ప్రదర్శకులు నినాదాలు చేశారు. తనపై తాము పెంచుకొన్న నమ్మకాన్ని బైడెన్ వమ్ము చేశారని, వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయబోమని వారు ప్రకటించారు. ఇజ్రాయెల్‌ను హంతకురాలుగా పేర్కొంటూ పారిస్‌లో వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. అంతిమ విజయం పాలస్తీనాదేనని నినాదాలిచ్చారు. ఇంకా బెర్లిన్‌లో, ఏథెన్స్‌లో, రోమ్‌లో ప్రదర్శనలు జరిగాయి. అయినా అమెరికాలో మార్పు రాకపోడం బాధాకరం. ఇజ్రాయెల్‌కు నచ్చజెప్పుతున్నానని, దాడులకు కొద్ది రోజులు విరామం ఇవ్వాలని బ్రతిమలాడుతున్నానని చెబుతూ అమెరికా ప్రపంచం కళ్ళుగప్పాలని చూస్తున్నది. అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై దాడులు చేయడంతో అది రెచ్చిపోయి గాజాను లక్షంగా చేసుకొని భీషణమైన ప్రతీకారం తీర్చుకొంటున్నది.

దాని దాడుల్లో వేలాది మంది పిల్లలు చనిపోతున్నారు. గాజా నుంచి పాలస్తీనియన్లను మొత్తంగా ఖాళీ చేయించాలన్న దుర్బుద్ధి ఇజ్రాయెల్‌లో వున్నదని అనుమానించడానికి ఆస్కారం కలుగుతున్నది. కొద్ది రోజులు విరామం పాటిస్తే తమ వద్ద బందీలుగా వున్న ఇజ్రాయెలీలలో కొంత మందిని విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది. దానికీ ఇజ్రాయెల్ నుంచి సానుకూల స్పందన లేదు. ఒక వైపు వైమానిక దాడులు, మరొక వైపు భూతల దాడులను కూడా అది ముమ్మరం చేసింది. ఇంత వరకు 11,320 మంది గాజావాసులు దుర్మరణం పాలైనట్లు వార్తలు చెబుతున్నాయి. అల్ షిఫా ఆస్పత్రిపై దాడులు మొదలైన తర్వాత గాజాలోని పౌరులకు ప్రాణ హాని జరుగుతున్నందుకు అమెరికా మరోసారి కపట కన్నీళ్ళు కార్చింది. నిస్సహాయులు, అమాయకులు, రోగులు వున్న ఆసుపత్రిపై అగ్నివర్షం కురిపించడాన్ని తాను ఎంత మాత్రం సమర్థించబోనని అది తన ప్రకటనలో పేర్కొన్నది. అల్ షిఫా ఆసుపత్రిలో హమాస్ మిలిటెంట్లు రక్షణ పొందుతున్నారని, ఆ భవనం కింద సొరంగాల్లో వారు తలదాచుకొంటున్నారని అందుచేతనే దానిపై దాడికి సమకట్టామని చెప్పిన ఇజ్రాయెల్ అందులో జరిపిన సోదాల్లో ఆయుధాలు పట్టుబడ్డాయని ప్రకటించింది, మరి మిలిటెంట్లు ఏమైనట్లు?

ఈ అమానుష కాండను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి స్వయంగా జరిపిస్తున్నదని జోర్డాన్ చేసిన ఆరోపణలో ఎంత మాత్రం అవాస్తవం లేదు. సమితి జనరల్ అసెంబ్లీ తీవ్రంగా ఖండించిన తర్వాతనైనా భద్రతా మండలిలో కదలిక వచ్చి వుండాల్సింది. కాని అమెరికా అందుకు సిద్ధంగా లేదు. వీటో రాజ్యాల చేతిలో ఐక్యరాజ్య సమితి బందీ అయిపోయింది. అమెరికా తలచుకొంటే భద్రతా మండలిని కూడా త్రోసిపుచ్చగలదు. ఇరాక్‌పై అమెరికా, దాని మిత్ర దేశాలు సాగించిన నిర్హేతుకమైన దాడులు ఐక్యరాజ్య సమితితో నిమిత్తం లేకుండా జరిగినవే. ప్రపంచ శాంతికి అమెరికా నాయకత్వంలో పడుతున్న తూట్లు లెక్కబెట్టడం సాధ్యమయ్యే పని కాదు. హమాస్ దాడులకు ప్రతిగా గాజాపై విరుచుకుపడడానికి ఇజ్రాయెల్ సేనలు బయలుదేరినప్పుడే అక్కడ జరగనున్నది అసాధారణమైన మానవ మారణ హోమమేనని బోధపడిపోయింది. కనీసం ఈ దశలోనైనా అమెరికా చొరవ తీసుకొని ఇజ్రాయెల్‌కు పగ్గాలు వేయకపోతే ఈ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదమే కనిపిస్తున్నది. అరబ్ దేశాల్లో ప్రజలు ఇప్పటికే అక్కడి ప్రభుత్వాలు కంపించి పోయే స్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆ దేశాలు నిగ్రహం కోల్పోయి ఒక్కుమ్మడిగా ఇజ్రాయెల్ మీదికి యుద్ధం సమకట్టడం ఒక్కటే జరగవలసి ఇక వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News