హైదరాబాద్: ఆస్పత్రిలో పేలుడుపై హమాస్, ఇజ్రాయెల్ పరస్పర నిందలు మోపుకుంటున్నాయి. దాదాపు 500 మందిని బలిగొన్న కిరాతకులు మీరంటే మీరని నిందించుకుంటున్నాయి ముమ్మాటికీ ఇజ్రాయెలే ఈ ఘోరానికి ఒడి గట్టిందని హమాస్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ సైన్యం తోసిపుచ్చింది. ఇస్లామిక్ జిహాద్ ప్రయోగించిన రాకెట్ గురితప్పడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడిఎఫ్) ప్రతినిధి లెఫ్టెనెంట్ కల్నల్ జొనాథన్ కోర్నికస్ ఓ వీడియో ప్రకటనలో మరోసారి స్పష్టత ఇచ్చారు.ఆ పేలుడుతో తమకు సంబంధం లేదన్నారు. పేలుడు సంభవించిన సమయంలో తాము ఆ ప్రాంతంపై ఎలాంటి దాడులు చేయలేదన్నారు. మంగళవారం సాయంత్రం 6.59 గంటల సమయంలో సమీపంలోని ఓ స్మశాన వాటికనుంచి పాలస్తీనా మిలిటెంటు గ్రూపు అయిన ఇస్లామిక్ జిహాద్ గ్రూపు సభ్యులు రాకెట్ ప్రయోగించినట్లు తమ రాడార్ గుర్తించిందన్నారు.
ఆ రాకెట్ గురితప్పి ఆస్పత్రి వెలుపల కారు పార్కింగ్ స్థలంలో పేలిందని చెప్పారు. మంటలు మాత్రమే వచ్చాయి అని, ఎవరూ చనిపోయినట్లుగా చిత్రాల్లో ఎక్కడా లేదని చెప్పారు. తమ రాకెట్లు చాలా శక్తివంతమైనవని, అవి పేలితే పెద్ద గొయ్యి ఏర్పడుతుందని, అయితే అలాంటిదేమీ జరగలేదని కూడా ఆయన చెప్పారు. హమాస్ చెప్తున్నట్లుగా దాదాపు 500 మంది చనిపోయి ఉంటే మృత దేహాలు ఎక్కడని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే మృతదేహాలు నేలపై చెల్లాచెదరుగా పడి ఉన్న దృశ్యాలు, క్షతగాత్రులను బంధువులు చేతులమీద ఎత్తుకుని తీసురెళ్తున్న వీడియో చిత్రాలు మీడియాలో వచ్చాయి. అంతేకాకుండా డాక్టర్లు నేలపైనే సర్జరీలు చేస్తున్న దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి.
రోజురోజుకు పెరుగుతున్న మరణాలు
కాగా గత 13 రోజులుగా జరుగుతున్న దాడుల్లో ఇరువైపులా వేలాది మంది చనిపోగా, అంతకు రెట్టింపు సంఖ్యలో గాయపడ్డారు. యుద్ధం మొదలైనప్పటినుంచి గాజాలో 3.785 మంది చనిపోయారని హమాస్ ఆరోగ్య వాఖ ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు, వృద్ధులేనని తెలిపింది. మరో 12,500 మందికి పైగా గాయపడ్డారని, భవనాల శిథిలాల కింద 1300 మందికి పైగా చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపింది. మరో వైపు హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ వైపు 1400 మందికి పైగా చనిపోగా, వారిలో ఎక్కువ మంది పౌరులే ఉన్నారు. దాదాపు 200 మంది హమాస్ మిలిటెంట్ల చెరలో బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది.