Sunday, January 19, 2025

ఇజ్రాయెల్‌కు హమాస్ పిలుపు ..

- Advertisement -
- Advertisement -

గాజా : కాల్పుల విరమణ కాలాన్ని మరో నాలుగు రోజులు పొడిగించాలని హమాస్ ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేసింది. ఇరు పక్షాల నడుమ తాత్కాలిక ఘర్షణ విరమణ ఒప్పందం కుదిరింది. ఇందుకు ప్రతిగా హమాస్ చెరలోని బందీలను విడిచిపెట్టే ప్రక్రియ సాగుతోంది. ఆదివారం మరో 17 మంది బందీలను ఈజిప్టు సరిహద్దులలో విడిచిపెట్టిన తరువాత హమాస్ నుంచి ప్రకటన వెలువడింది. ఇజ్రాయెల్ బందీలుగా ఉన్న మరికొందరు పాలస్తీనియన్ల విడుదలకు వీలు కల్పించేందుకు ఇప్పటి కాల్పుల విరమణ కొనసాగింపు అవసరం అని హమాస్ తెలిపింది. ఘర్షణలు తీవ్రతరం కాకుండా ఉండేందుకు ఇప్పటి బందీల ఉపసంహరణ దశ ఉపకరిస్తోంది. దీని వల్ల గాజాలో మానవీయ సాయానికి కూడా వీలేర్పడుతోంది. కాగా ఆదివారం హమాస్ విడిచిపెట్టిన బందీలలో నాలుగు సంవత్సరాల ఇజ్రాయెలీ అమెరికన్ బాలిక కూడా ఉన్నారు. పాలస్తీనియా బందీలను మరింత ఎక్కువ సంఖ్యలో విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ కూడా ముందుకు రావల్సి ఉందని హమాస్ అభ్యర్థించింది. ఈజిప్టు, ఖతార్ పరోక్షంగా అమెరికా వైపు నుంచి చేసిన దౌత్యయత్నాలు పాక్షికంగా ఫలించాయి.

మరో వైపు ఇప్పటి కాల్పుల విరమణను మరి కొద్దిరోజులు పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే తమ దేశస్తులను హమాస్ మరింత ఎక్కువ సంఖ్యలో విడిచిపెట్టాలని, ప్రతి పది మంది విడుదలకు మరో రోజు కాల్పులు విరమించడం జరుగుతుందని ఇజ్రాయెల్ షరతు పెట్టింది. ఇదే క్రమంలో హమాస్ కూడా ఇప్పుడు కాల్పుల విరమణను పొడిగించాలని, దీనికి ప్రతిగా పాలస్తీనియన్లను విడిచిపెట్టాలని కోరడంతో ఈ దిశలో సానుకూలత ఏర్పడుతుందని ఆశిస్తున్నారు.ఇంటర్నేషనల్ రెడ్‌క్రాస్ సొసైటీ నివేదిక ప్రకారం ఇప్పటివరకూ హమాస్ 17 మంది బందీలను విడిచిపెట్టగా వీరిలో 13 మంది ఇజ్రాయెలీలు, ముగ్గురు థాయ్స్, ఒక్కరు రష్యన్ ఉన్నారు. కాగా ఇజ్రాయెల్ నుంచి ఇప్పటివరకూ 39 మంది పాలస్తీనియన్లను విడిచిపెట్టగా వారికి వెస్ట్‌బ్యాంక్‌లోని రమాల్లాలో స్థానికులు స్వాగతం పలికారు. ఇప్పుడు హమాస్ చెర నుంచి బయటపడ్డ వారిలో నాలుగు సంవత్సరాల అమెరికన్ అబిగలి ఎడాన్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షులు జో బైడెన్ నిర్థారించారు. అక్టోబర్ 7వ తేదీ నాటి హమాస్ దాడిలో ఈ చిన్నారి తల్లిదండ్రులు బలి అయ్యారు. హమాస్ విడిచిపెట్టిన వారిలో ఈ చిన్నారి తొలి బాలిక అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News