Thursday, January 16, 2025

హమాస్‌పై దాడులను తీవ్రం చేసిన ఇజ్రాయెల్

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్: దేశ దక్షిణ ప్రాంతంలో హమాస్ మిలిటెంట్లపై ప్రతిదాడులను ఉధృతం చేసినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రిచర్డ్ హెట్చ్ సోమవారం తెలిపారు. సుమారు ఏడు నుంచి ఎనిమిది చోట్ల హమాస్ మిలిటెంట్లతో ఇజ్రాయెల్‌ దళాలు పోరాడు తున్నట్లు ఆయన చెప్పారు. గాజా సరిహద్దు వెంబడి ఊహించినదానికంటే ఎక్కువ చోట్ల చొరబాట్లు జరిగాయని, వాటిని తప్పి కొట్టేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. మరో వైపు హమాస్ మిలిటెంట్లకు, వారి మద్దతు దారుల నుంచి ఆయుధాలు అందకుండా అడ్డుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి హమాస్ వద్ద ఎలాంటి ఆయుధాలు లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే గాజాలోని వెయ్యికి పైగా హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడులు చేసినట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు ప్రారంభమై రెండు రోజుల తర్వాత పోరాటం చాలావరకు చల్లారిందని ఆయన చెప్పారు.

మరోవైపు బీరీ కీబుట్జ్ ప్రాంతంలో 70 మందికి పైగా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డారని, వారితో ఐడిఎఫ్ దళాలు భీకరంగా పోరాడుతున్నాయని తెలిపారు. కాగా, హమాస్ దాడుల్లో ఇప్పటివరకు ఇజ్రాయెల్‌లో 700 మందికి పైగా చనిపోగా వేలాది మంది గాయపడ్డారు. మృతుల్లో సైనికులతో పాటుగా పౌరులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. హమాస్ దాడుల్లో ఇప్పటివరకు 9 మందిఅమెరికన్లు, 10 మంది నేపాలీ విద్యార్థులు చనిపోయినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఇజ్రాయెల్ దళాలు జరిపిన ప్రతిదాడుల్లో 400 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌హమాస్ మధ్య దాడుల నేపథ్యంలో గాజా సరిహద్దుల్లోని ఐదు పట్టణాలను ఇజ్రాయెల్ దళాలు ముందస్తుగా ఖాళీ చేయించారు. అలగే పాలస్తీనా వైపు కూడా గాజా సరిహద్దులకు ఆనుకుని ఉన్న ప్రాంతాలనుంచి ప్రజలు ఖాళీ చేసి వెళ్తున్నారు.

ఈ పరిస్థితుల్లో ఇరువైపులా సుమారు లక్షమందికి పైగా నిరాశ్రయులైనట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. మరో వైపు సుమారు 130 మంది ఇజ్రాయెల్ వాసులను బందీలుగాపట్టుకున్నట్లు హమాస్ ప్రకటించింది. వీరిలో ఇజ్రాయెల్ సైనికులు కూడా ఉన్నారు. తమ వారిని విడిపించుకోవడానికి హమాస్ వీరిని అడ్డుపెట్టుకొని బేరసారాలకు దిగాలని అనుకొంటున్నట్లు తెలుస్తోంది.

గాజా దిగ్బంధం… నీరు, విద్యుత్, ఆహారం కట్

మరో వైపు హమాస్ ముష్కరులు తిష్టవేసిన గాజాను దిగ్బంధం చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. అక్కడికి వెళ్లే కీలక సరఫరాలను కట్ చేసింది.‘ గాజా స్ట్రిప్‌ను పూర్తిగా దిగ్బంధం చేయాలని నేను ఆదేశించా. ఇక అక్కడ నీరు, విద్యుత్, ఆహారం అందదు. మేము మానవ మృగాలతో పోరాడుతున్నాం. దానికితగ్గట్టే మా పోరాటం ఉంటుంది’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవో గల్లాంట్ ప్రకటించారు. ఆయన ప్రస్తుతం బెర్షబలోని ఐడిఎఫ్ దక్షిణ కమాండ్‌ను సమీక్షిస్తున్నారు. మరోవైపు ఐడిఎఫ్ బలగాలకు మద్దతుగా మరో 3 లక్షల మంది దళాలను మోహరించినట్లు ఐడిఎఫ్ ప్రతినిధి డేనియల్ హగారి ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News